నేడు ఒంటిగంటకు నామినేషన్ దాఖలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ్ల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవీ కాలం ముగియనుండటంతో మరోసారి ఆమెను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ టిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. గతంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ఆయనపై అనర్హత వేటుపడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది.
ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం మళ్లీ అదే స్థానం నుంచి ఆమెకు అవకాశం దక్కింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత ఎన్నికైన సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కవిత నివాసానికి చేరుకొని అభినందనలు తెలియజేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలువురు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌లను దాఖలు చేశారు. ఈనెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్లచ ఉపసంహరణకు 26వ తేదీ వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.