మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసులో తనను ఇడి అరెస్ట్ చేయడం అక్రమమంటూ సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్ పిటి షన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖ న్నా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టి స్ బేలా త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించిం ది. విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) తీరుపై కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయని కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనను భావోద్వేగానికి గురికావొద్దని వారించారు.
ఈ కేసులో కవితను ఒకసారి సాక్షి గా, మరోసారి నిందితురాలిగా పిలిచారన్న కపిల్ సిబల్, ఒక్క బలమైన సాక్ష్యం లేకుండా దర్యాప్తు సాగుతోందన్నారు. అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని న్యాయస్థానానికి వివరించారు. ప్రస్తుతానికి తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని త్రిసభ్య ధర్మాసనం స్ప ష్టం చేసింది. ఇందులో తాము బెయిల్ ఇవ్వలేమని, మొదట కింది కోర్టును ఆశ్రయించాల్సిందేనని పేర్కొంది. ఆ స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందన్న ధర్మాసనం త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సూచనలు చేసింది. ఈ పిటిషన్‌లో రాజ్యాం గ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను లేవనెత్తినందున దీన్ని ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జతచేస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యాం గ పరమైన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాత మరో రెండు వారా ల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థ కు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు లో తన అరెస్టు చట్టాల ఉల్లంఘనతో పాటు ప్రాథమిక హక్కుల హననం కిందికి వస్తుందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందని వెల్లడించారు.తాను సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఇడి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు.అక్రమ నగదు ఆరోపణలకు దర్యాప్తు సంస్థ ఒక్క ఆధారాన్ని చూపలేదని, అరెస్టు ఉత్తర్వుల్లోని కారణాలు అవాస్తవాలని వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని కవిత పిటిషన్‌లో వెల్లడించారు.