ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత తీహార్ జైలులో మొదటి రోజు పూర్తైంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం జైలులో 6వ నంబర్ విభాగంలో మరో ఇద్దరు మహిళా ఖైదీలతో పాటు కవిత భోజనం చేశారని సమాచారం. ఉదయం స్నాక్స్ తిని, టీ తాగారు. ‘ఆమె మంగళవారం రాత్రి తన తోటి ఇద్దరు ఖైదీలతో కలిసి భోజనం చేశారు. అన్నంతో పాటు పప్పును తీసుకున్నారు. వీటిని తనతో పాటు ఉన్న మరో ఇద్దరు ఖైదీలకు కూడా వడ్డించి భోజనం చేశార’ని – జైలు వర్గాలు వెల్లడించాయి. టీ, ఆహారం, టివి చూసే సమయాలు ఇతర ఖైదీల మాదిరిగానే కవితకూ ఉంటాయని మరో అధికారి వెల్లడించారు. కవిత ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులు ఏమీ డిమాండ్ చేయలేదని జైలు వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తా మని అధికారులు వెల్లడించారు. మరోవైపు న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆమెకు ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉందని జైలు అధికారి తెలిపారు.
వీటితో పాటు దుస్తులు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, నగలు, మందులు బంగారు ఆభరణాలు ధరించేందుకు కూడా అనుమతి ఉంది, అయినప్పటికీ ఆమె జైలుకు వచ్చేటప్పుడు ఎలాంటి అభరణాలు ధరించలేదని జైలు వర్గాలు పేర్కొన్నాయి. ఆమెకు తీహార్ జైలు గ్రంథాలయంలోని పుస్తకాలు ఉపయోగించుకునే సౌలభ్యం ఉందని వెల్లడించారు. కాగా, తీహార్ జైలు కాంప్లెక్స్‌లో సుమారు 500 మంది మహిళలు ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న మనీశ్ సిసోడియా, సంజ య్ సింగ్ తర్వాత మూడో రాజకీయ నేత కవిత కావడం గమనార్హం. సిసోదియా జైలు నంబర్ 1 , సంజయ్ సింగ్‌కు జైలు నంబర్ 2 ను కేటాయించారు. మరో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత సత్యేంద్ర కుమార్ ఏడో నంబర్ జైలులో ఉంచారు. దిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు వచ్చేనెల 9 వరకు రౌజ్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది.
ఆమె తరపు లాయర్లు మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే దీనిపై కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది. కాగా, మంగళవారం ట్రయల్ కోర్టు రిమాండ్ విధించాక ఆమెను తీహార్ జైలుకు అధికారులు తరలించారు. అక్కడ కవితకు ఖైదీ నంబర్ 666 ను జైలు అధికారులు కేటాయించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు ఇదే జైల్లో కవిత ఉండనున్నారు.