ఆమె సాయతులతో బురద పొలంలో
మునుం బట్టి వడి వడిగా నాట్లేస్తూనే..
‘పుట్టంగ నలుగురం, పెరగంగ నలుగురం
పేరుకే ఇద్దరంరా తమ్ముడా లక్ష్మణా..’
అలవోకగ రామాయణం దరువు ఎత్తుకుంటే
స్వయాన రాముడూ సీతమ్మ వారే
కిందికి దిగివస్తున్నట్టే కంటిలో ఆలాపనలు
ఆ వరి పొలమంతా రంగస్థల సంరంభం
చేను పనిచేస్తూనే పదం కైగట్టిన కార్యాచరణ
వింటుంటే హార్మోనియం తీరు ఆమె నోరు
రాగయుక్తంగా కలగలిసిపోయిన గొంతుకలు
నారీమణుల నాట్ల సరి సమాన చరణాలు
నారు పారవశ్యంగా తలూపుతున్న దృశ్యం
చెరువు ఎనుక శికంల కలుపు తీయంగ
ఎర్ర చెలుక మీద కంకులు ఇరువంగ
వ్యవసాయ ఆకాశం ఒక జావలి గీతం
శ్రవణానందంతో కొంగల గుంపుల విహారం
నాగారం ఊరి దారికి ఇరువైపులా మోత్కుల్లు
ఆ చెట్ల ఆకుల నుంచి రెపరెపల ధ్వనులు
కంటి నిండా ఎర్ర ఎర్రని గోగుపూల సంగీతం
నిత్యం ఆమె పాటలు విన్న కొండ గుట్టల ధీరత
సత్తెమ్మ నివసించిన ఇంటి వైపు నడుస్తుంటే
ఆ వాడకట్టు నుంచి సన్నగా తీగ రాగాలు
ఇంటి వాకిలిలో దేశీ గీతాల ప్రకంపనలు
ఆ గోడలకు చెవి ఆనిస్తే భూపాల రాగమే
ఇప్పుడు ఆమె లోకంలో లేకపోవచ్చు
తన గొంతు ఊరందరిలోకి వ్యాపించింది
జ్ఞాన జానపదం జనబాహుల్యమైన తీరిది
అన్నవరం దేవేందర్
పద పదం జానపదం
- Advertisement -
- Advertisement -
- Advertisement -