- Advertisement -
లోకంలో నాణెమే నాణ్యమయ్యాక
మనిషిలో ప్రేమ నరం పుటుక్కుమంది
మురికినీళ్ళ లొడలొడలతో
శుధ్ధజలం నిశ్శబ్దమైపోయింది
ఆడంబరాల చమ్కీల ధమ్కీలకు
సాదాసీదా నూలు పోగులు
తలలుదించుకున్నాయి
వెర్రితలలు వేస్తున్న
వ్యక్తి అస్తిత్వపు వింతపోకడలు
వీడియోలుగా సెల్ఫీలుగా ఫోటోలుగా
పుట్టినరోజులుగా పెళ్ళిరోజులుగా
కొత్త ఏడాదులుగా షష్టి పూర్తులుగా
ఇంకా.. ఇంకా.. లుగా.. లుగా
విపర్యయించి విపరిణమించి
సమాజచైతన్యమే చచ్చుబడిపోతున్నది
కొబ్బరిబోండం కొట్టించుకుని
తాగుతున్నపుడల్లా
సురాభాండం ఊరేగుతోందని
అది గుండెపగిలి హృదయం స్రవించి
చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తున్నది
ఊదరగొట్టే మాటల ముందు
చేత చేష్టలుడిగి పోతోంది
వక్రరేఖల ధాటికి
సరళరేఖలేనాడో ఊరు దాటివెళిపోయినై
నలిమెల భాస్కర్
- Advertisement -