Monday, December 23, 2024

తెరసం పరివార కవిత్వం

- Advertisement -
- Advertisement -

ఉధృతంగా పెరిగిన సాంకేతికత సౌలభ్యంతో రూప, శబ్దమాత్రంగా మనుషులు అరచేతి తెరలపై కలిసి, కాగల కార్యాలు సునాయాసంగా చక్కదిద్దుకుంటున్నారు. హాలులో జరిగే కవి సమ్మేళనాలు తగ్గి కవులు కాలు కదపకుండానే ఒంటరి సమూహాలుగా తెరను పంచుకొని కవితలను వినిపిస్తున్నారు. ఎన్నో రకాల సమావేశాలు, సంస్మరణ సభలు ఇప్పుడు లింకులు, జూమ్ యాప్ లతో పరిపూర్ణమవుతున్నాయి. కరోనా తెచ్చిన అపార హాని తో పాటు వచ్చిన సరికొత్త బాణీ ఇది. సాహిత్య కార్యక్రమాల్లో క్రియాశీలంగా ఉండే జంట నగరాల తెలంగాణ రచయితల సంఘం శాఖ ఇంటర్ నెట్ లోని జూమ్ వ్యవస్థను ఉపయోగించుకొంటూ వారం వారిగా కవితా పఠనాన్ని కార్యక్రమంగా రూపొందించింది. ’కవివారం’ పేరుతో ప్రతి సోమవారం సాయంత్రం ఈ సభ సంపన్నమవుతోంది. అమెరికా లాంటి పరాయి దేశాల్లో ఉండే కవులు కూడా కవివారం లో పాల్గొనగలగడం ఈ విధాన విశేషం. 23 నవంబర్ 2020 లో మొదలైన ఈ అభినవ భువనవిజయం నవంబర్ 2022 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్బంగా అంతవరకూ చదివిన కవితల్లో ఎంపిక చేసి ’కవివారం’ అనే పేరుతో వారు పుస్తకంగా తెచ్చారు. తెరపై ఎంత హంగామా చేసిన కాగితంపై అచ్చులో వస్తేనే కవితకు సార్థకత వస్తుంది. ఈ విషయమైనా తెర మరుగైతే కాగితం మెరుగుపరుస్తుంది.

ఎలాంటి నిబంధనలు లేని కవుల సమ్మేళనం నుంచి వచ్చిన కవితలు కాబట్టి ఈ పుస్తకంలో అన్ని స్థాయిల కవులు ఉన్నారు. సీనియర్ కవుల సరసన సరికొత్త కవులకు ఇందులో చోటు లభించడం వల్ల కొత్తవారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఒక సీనియర్ కవి వేసుకునే పుస్తకంతో గాని, కవితలను జల్లెడ పట్టి తెచ్చిన సంకలనంతో గాని ఈ సంపుటిని పోల్చలేము. ఇందులో కొన్ని కవితలు కవివారంలో పాల్గొనడం వల్ల అర్హత సంపాదించినా, కొత్త కవులను ప్రోత్సహించడానికి ఉపయుక్తమనే భావించాలి. అలాగని పాత కవులు గొప్పవారని కొత్తవారు మాములు కవులని కొట్టిపారేయలేము. నిలిచి ఉండే కవిత్వాన్ని కాలమే నిర్ణయిస్తుంది.

తెరసం సీనియర్ కవి నందిని సిధారెడ్డి కవిత ’వేడుక’తో ఈ సంకలనం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమంలో గొప్ప ఆశావహ కవిత్వాన్ని ఈ మట్టితో సృష్టించిన ఈయన అక్షరాల్లో జీవకళ ఉంటుంది. ’ఒక రోజొస్తుంది / ఎవరూ పట్టించుకోని తంగేడు పూలు / తలల మీద ఊరేగుతాయి’ అంటూ తెలంగాణ బంగారు భవితపై సాకార కలగన్నారు. సౌమ్యతకు మారుపేరైన నాళేశ్వరం శంకరం ’తెల్లవారుజామున / దేవుణ్ణి మేల్కొల్పాలి గాని / సోమనాథుని కవిత్వమైతే మనల్ని మేల్కొల్పుతుంది’ అని తెలుగుని తొలి వెలుగు జీవనదిగా వర్ణించారు. నిత్య కవిత్వ హాలికుడు కందుకూరి శ్రీరాములు ’కవన భూమి’ ఒక హామీ ఇచ్చే కవిత. ’ఇది కవన భూమి / చౌడు నేల కాదు / మట్టి గింజ కలుపు / మొక్కై మొలకెత్తుతుంది /అచ్చు హల్లు ఒక్కటి చెయ్ /అక్షరమై విరబూస్తుంది’ తెలంగాణ కావ్య శక్తిని ప్రకటించే రచన ఇది.

జ్ఞాపకాల పొరల్లోంచి కవిత్వాన్ని ఒడిసిపట్టే కలం కందాళై రాఘవాచార్య. ’చిప్పల బువ్వ..’ మహత్యాన్ని కందాళై తన చేతివేళ్ళతో వినిపించారు. చిప్ప ప్రాశస్త్యాన్ని చెబుతూ కవి ’ మొదట్ల అందరం చిప్పలనే తిన్నం / జ్ఞానం ఎక్కువైనా కొద్ది / లోహం తలెలు తలెత్తినై / మట్టితనం మనుషులకు దూరమైనది /ఇగ మనిషిలా మానవత్వం /పగిలిపోక ఎట్లుంటది!!’ అని మట్టి కమ్మదనం రహస్యాన్ని విశదీకరిస్తారు.

అమ్మ ప్రసవ వేదనను హృద్యంగా చెప్పిన కవిత ’స్ఫూర్తిదాత అమ్మ’. ’ఎన్ని మత్తు మందులు సరిపోవు /నొప్పులు ఓర్చాలంటే /మాతృత్వపు మనసు చాలు /మవునంగా భరించడానికి!’ అనే జగ్గయ్య. జి పంక్తులు బ్రహ్మ అమ్మ తరువాతే అని తీర్పిస్తాయి.

దాసరి మోహన్ రాసిన ’యుద్ధం మొదలయ్యాక..’ జీవితాలకు విలువనిస్తుంది. ’యుద్ధం మొదలుపెట్టాక / సామూహిక ఖననాలు తప్ప /ఎవరు ఎవరి బిడ్డో / గుర్తు పట్టడం కుదరదు’ అని యుద్ధ బీభత్సాన్ని, ఫలితాన్ని గుండెలకు తాకేలా చెప్పారు.

’అనంత ఆకాశంలో అన్ని పక్షులు కలిసి ఎగిరినట్లు / ఈ సమాజంలో అందరం కలిసి ఎదగలేమా?’ అని పేద బతుకు కవితలో దుర్గ రాములు చక్కని ప్రశ్న వేశారు. ’మౌనం / చిగురు తొడిగిన నాలుకల కింద/ అదృశ్యంగా అసంకల్పిత కావ్యాన్ని లిఖిస్తోంది’ అనే పరిపక్వ వ్యక్తీకరణ నరేష్ చారి నేత్రవలయం లో చూడవచ్చు. ’యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు’ అని శీర్షికతోనే ఆకట్టుకొనే కవిత డా.బెల్లంకొండ సంపత్ కుమార్ రాసారు. ’యుద్ధం ఒంటరిగా రాదు / కనిపించని వ్యూహంతో / కత్తులు నూరుతది / ప్రజలు వద్దంటున్నా /దేశాలకెందుకీ పిపాస!’ అని సామాన్యుడి తరఫున ప్రశ్నిస్తారు. కావ్యం, కవి మధ్య సంభాషణగా కవిత్వమంటే ఏమిటో సున్నితంగా చెప్పిన కవిత ముదిగొండ సంతోష్ రాసిన ’చివరి ప్రశ్న’. ’మా మతం వారి అభిమతం ఒకటి కాదు’ అంటూ మతం కన్నా మాతృభూమి గొప్పదని రుక్సానా కవితలో ఉంది. మనిషి చివరి స్నానాన్ని కొత్తగా చెప్పిన పంక్తులు డా. రూప్ కుమార్ డబ్బీకార్ ’తెర తొలిగిన దృశ్యాలు’ లో చూడొచ్చు. ’పార్థివ దేహం మీద ఎవరెన్ని పూలు జల్లినా /మీ రెండు కన్నీటి చుక్కలే పరిమళించాయి /ఆ పరిమళాల తడిలో /అసలైన నా చివరి స్నానం సంపూర్ణమైంది’ అని పూల కన్నా కన్నీటి వీడ్కోలు గొప్పదనడం విశేషం. కొత్త పాత మేలికలయికలో కవితల ఎంపిక సంకలనానికి గౌరవాన్ని తెచ్చింది. కొత్తవారి రచనల్లోనూ అభివ్యక్తి, పదజాలం, శిల్ప ప్రాధాన్యం పండి భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. కవి సమ్మేళనం ద్వారానే కాకుండా కవితలను ముద్రణగా తెచ్చి కొత్త కవులకు ధీమానిచ్చిన తెరసంకు అభినందనలు. మారుతున్న కాలానికి అనుగుణంగా కావ్య సృష్టికి, ప్రాచుర్యానికి కొత్త మార్గా లు పట్టుకుంటున్న తెరసం జంట నగరాల శాఖ ఇతర సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

కవివారం (కవితా సంకలనం) సంపాదకులు : కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్ కుమార్, పేజీలు 245, వెల: రూ. 250/- ప్రచురణ : తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు, ప్రతులకు 9440119245, 9908519151.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News