Monday, January 20, 2025

కాజీ నజ్రుల్ ఇస్లాం కాలంపై చెరగని చిరునామా

- Advertisement -
- Advertisement -

నజ్రుల్ ఎంతో ఉత్సాహంగా శివ ప్రతీకను ఎత్తిపట్టాడు సామాజిక మార్పు, హింసాత్మక చర్యలను సాధనంగా ఆహ్వానించాడు. తనకు తాను ప్రళయ శంఖం మోగిస్తున్న శివుని అగ్ర అనుచరుడుగా భావించాడు. రచయితగా, కవిగా తన పాత్రను ప్రారంభించినప్పటి నుండి కూడా సంకల్ప పూర్వకంగా తన భావాలు చిత్రీకరించడానికి వివరించడానికి బాంగ్లా ప్రజలకు సుపరిచితమైన మత ప్రతీకలను నజ్రుల్ చాలా స్పష్టంగా ఉపయోగించుకున్నాడు. నజ్రుల్ చైతన్య పూర్వకంగాను ఏ అరమరికలు లేకుండానూ, తనను ప్రజలు వినేలా చేసుకోవడానికి ముస్లిం, హిందూ ఉభయ మత సంప్రదాయాలనుంచి ఎంతో స్వీకరించాడు -పీటర్ కస్టర్స్

కాజీ నజ్రుల్ ఇస్లాం విద్రోహి పుస్తకం నా చేతికి అందగానే, చదవడం మొదలుపెట్టగానే మళ్ళీ, నాకు శ్రీశ్రీ మహాప్రస్థానం లోని ఈ కవిత చప్పున గుర్తొచ్చింది. దానితో పాటూ, ఒకింత దుఃఖము, కోపము కూడా. ఈ తెలుగు నేల ఇంత గొప్ప కవిని, ఈ అద్భుత విద్రోహిని, ఎంతో సాహసోపేతంగా రాజ్యాన్ని, దేవుడిని, మత ఛాందసత్వాన్ని, సంకెళ్ళను, కారాగారాలను, అణిచివేతలను, కుళ్ళిన సమస్త విలువలను, కులతత్వాన్ని, మహిళలపై హింసను ధిక్కరించిన వాడిని, జైళ్ళ పాలైనా వెరవక నిలిచిన వాడిని, ప్రజా పోరాటాలకు తన కవిత్వపు బావుటాను నేటిదాకా అందిస్తూనే వున్న వాడిని ఎలా విస్మరించింది ఇన్నేళ్లుగా అని. అనేక ఉద్యమాలు, తిరుగుబాట్లు సాగిన ఈ చోట, కాజీ నజ్రుల్ ఇస్లాం ఇంత ఆలస్యంగా తెలుగులోకి అనువాదం కావడం నిజంగా ఆశ్చర్యమే. ఈ అనువాదం ఎప్పుడో జరగాల్సింది. అదే జరిగి వుంటే, ఇక్కడి ప్రగతిశీల ఆలోచనలు, ఉద్యమాల పై గోర్కి, శ్రీశ్రీ ల సాహిత్యం నెరిపిన ప్రభావం లాంటి శక్తివంతమైన ప్రభావాన్నే, నజ్రుల్ ఇస్లాం కవిత్వం, సంగీతం, సాహిత్యం వేయగలిగేది. నిజానికి అంతకన్నా ఎక్కువగా కూడా నేమో! విద్రోహి, కాజీ నజ్రుల్ ఇస్లాం జీవితం – సాహిత్యం , పుస్తకాన్ని మనకు అందించిన వరవరరావును, పుస్తకాన్ని ప్రచురించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారిని అభినందించాలి.

రుద్రుడు కష్టజీవులు శూద్రుల మధ్య మేలుకొన్నాడు

మా విషాదాలను, మా నిద్రలేని రాత్రులను పంచుకునే దేవుడు రుద్రుడు
కష్టజీవులైన శూద్రుల మధ్య ఉదయించాడు
నువ్వు కట్టుకోవడానికి బట్టలు లేని నేతగానివి
నువ్వు మేదర్ గానే గుర్తించబడతావు
నీ కులం ప్రపంచాన్ని అంతా శుభ్రంగా ఊడుస్తుంది
ఇంకా తెల్లవారకముందే ఋషి వంటి దేవుడు
మౌనంగా నగరవీధుల్లోని చెత్తంతా ఊడ్చేస్తాడు

నజ్రుల్ ని తెలుగు పాఠకుల కోసం పరిచయం చేయడానికి వరవరావు పూనుకున్న సందర్భం, ఆయన ఒక తప్పుడు కేసులో గృహ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న సమయం. అప్పుడు ప్రారంభమై, పూనే ఎరవాడ జైలు నిర్భందంలోనూ, ఆ అనువాదం కొనసాగి, తలోజా జైలు లోనే, ఆ అనువాదాలు వుండి పోయి, అవి బయటకు రావడానికి ఎంతో కాలం పట్టింది. 2022 లో మళ్ళీ పుస్తకం పనిని తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండానే, ఆయన చేసారు. జైలు పునాదులను పెకలించి, జైలు తాళాలను బద్దలు కొట్టమంటూ, రాజ్య నిర్భంధం పై ఎంతో ధిక్కారంతో రాసిన నజ్రుల్ కవిత్వాన్ని, రాజ్య నిర్భంధాన్ని ఎదుర్కొంటూ, జైలు గోడల మధ్య, ఇప్పుడు బలవంతపు ప్రవాస జీవితం సాగిస్తూ వున్న సమయంలో వరవరరావు అనువాదం చేసారు. ఆ జైలు గోడలు నజ్రుల్ ఆశించినట్లు ఇంకా పెకిలించి వేయబడలేదు. మన కాలపు ప్రియ కవి, పోరాటయోధుడు, చెదరని విశ్వాసాల విప్లవ పతకాన్ని ఎగురవేసి, ఇంతటి చీకటిలోనూ, చేత లాంతరును వెలిగించి ధృడంగా నిలిచిన వరవర రావుకు ఇంకా స్వేచ్చ రాలేదు.

చేతికి వేసిన సంకెళ్ళ సవ్వడిలోనూ జంకక ఎలుగెత్తి స్వేచ్చా సంగీతాన్ని వినిపించే వివి, నాజిమ్ హిక్మత్, ఇంకా పాలస్తీనా, నుండి కాశ్మీరీ, కవుల దాకా అనేక మంది ధిక్కార కవుల కలలూ, వందేళ్ళ క్రితం నజ్రుల్ ఏమి కలగన్నాడో ఆ కలలు ఇప్పటికీ, ఇంకా సాఫల్యం కోసం ఎదురు చూస్తూనే వున్నాయి. విద్రోహి పుస్తకం ప్రారంభంలో మరో ధిక్కార కవియిత్రి మౌమిత ఆలం అన్నట్లు “సమాజ పరివర్తన స్వప్నం కనే స్వాప్నికులందరికీ, నజ్రుల్ ఇస్లాం ఎంత ప్రాసంగికుడో, వరవరరావు కూడా అంతే. ఆయన మనందరికీ, అణగారిన వారికి, అంచుల్లోకి తోసి వేయబడిన వారికి, పీడితులకు, రాజ్యం దృష్టిలో పేరు లేని, అంకెలుగా మాత్రమే మిగిలిన అసంఖ్యాక ప్రజలకు ఒక శ్వాసించే, సజీవమైన కవి”. ‘వందేళ్ళ కాలం గడిచిన తరువాత కూడా ప్రాసంగికతను కోల్పోకుండా, మంటలతో మాట్లాడిస్తూ, తన రక్తచలన సంగీతాన్ని, కవిత్వాన్ని, నూతనోత్తేజాన్ని పాఠకులకు అందివ్వడమే కాక, పీడితుల తిరుగుబాట్లలో, నిరసనల్లో జాతిజనులు పాడుకునే గీతమై ఇప్పటికీ వెలుగుతునాడు నజ్రుల్. మరణానంతరం కూడా అట్లా కవి జనంలో జీవించి వుండటం కన్నా సార్ధకత ఏమి వుంటుంది?.

మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ లో నిరంకుశ పాలకురాలు, షేఖ్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ, ఏ మాత్రం జంకకుండా, పోలీసులను ను ఎదిరిస్తూ, విద్యార్ధులు ఎలుగెత్తి గానం చేసింది, నజ్రుల్ ఇస్లాం గీతాలనే.నజ్రుల్ గొప్పతనం ఏమిటంటే, ఆయన బంగ్లా జానపద బాణీలను తీసుకొని, తన విప్లవ, మతసామరస్య భావాలను, ప్రజా సంగీతాన్ని, సాహిత్యాన్ని, వ్యాసాలను, సందేశాలను, ఆ బాణీలో సృజనాత్మకంగా ప్రజలకు అందించడానికి మొదటిసారి పూనుకోవడం. అప్పటిదాకా, ఉర్దూ భాష లో వుండే గజిల్స్ ని, బంగ్లా భాషలో మొదటి సారి రాయడం మొదలుపెట్టిన వాడు కూడా అతడే. బంగ్లా సంగీత స్రవంతిలోకి, ఇస్లాంను పరిచయం చేసినది కూడా అతడే. నజ్రుల్ సంగీత, సాహిత్యాలలో చేసిన అనితరసాధ్య కృషి వల్లే , అప్పటిదాకా హిందూ భద్ర లోకుల ఆధిపత్యం కింద ఉన్న బంగ్లా ప్రధాన కళా స్రవంతిలో, ముస్లిం కళాకారులకు కూడా గుర్తింపదగ్గ స్థానం మొదటిగా దొరికింది. నజ్రుల్ మత సామరస్యవాది. హిందూ, ముస్లింల ఐక్యతను కోరుకోవడమే కాదు తన భావాలను వ్యక్తం చేసేందుకు ఆ రెండు మతాలలోని చిహ్నాలను, పురాణాలు, ఇతిహాసాలు, మత గ్రంధాల లోని ప్రతీకల్ని తన రచనలలో ఎంతో విసృతంగా, ప్రతిభావంతంగా వాడాడు. హిందూ, ముస్లిం భక్తి సంగీతాన్ని ఆయన సంమిళితం చేసి రాసిన భజనలు, కీర్తనలు పాత సంప్రదాయ సంకెళ్ళను బద్దలుకొట్టాయి.

విప్లవ భావాలు, ఇస్లాం, సూఫీ తత్వం, హిందూ ప్రతీకలు కలగలిసిన, ఆయనకు మాత్రమే సాధ్యం అయిన ప్రత్యేకత్వం, అతని సాహిత్యం అంతటా ప్రముఖంగా కనిపిస్తుంది. లౌకిక భావాల కోసం ధృడంగా నిలబడ్డ వాడు నజ్రుల్ . ఆయన తీసుకున్న ఈ వైఖరి కొంత వరకూ వివాదాస్పదం గా ఇతరులకు అనిపించినా, నిజానికి, బాంగ్లా సాహిత్య సంకెళ్ళను తెంచి, కొత్త పుంతలు తొక్కించిన వాడు నజ్రుల్. ఇవన్నీ ఒక ఎత్తయితే, నజ్రుల్ తిరుగుబాటుదారుడు. సమాజంలో విప్లవాత్మక మార్పులను కోరుకున్న వాడు. బోల్షవిక్ విప్లవం నుండి ప్రభావితుడు అయినవాడు. తొలినాళ్ళలో నే కమ్యూనిస్టు భావజాలన్ని ప్రచారం చేసేందుకు, ఆ నిర్మాణాలను, పత్రికను ఏర్పాటు చేసేందుకు పూనుకున్న వాడు. తన రచనలు, భావాల కారణంగా, రాజ్య ధిక్కార నేరం పేరిట అరెస్టు అయి జైయిలు జీవితాన్ని అనుభవించినవాడు. ఈ ధిక్కార కవి, జైలు నిర్భంధం లో కూడా తన సాహితీ సృజనను ఆపలేదు. సకల అణిచి వేతలను, అసమానతలను ఎదిరిస్తూ, తిరుగుబాటే ఊపిరిగా జీవించిన వాడు నజ్రుల్. సమానత్వం, న్యాయం, బ్రిటిష్ సామ్రాజ్య వాద వ్యతిరేకత, మానవత్వం, తిరుగుబాటు, ప్రజాస్వామిక విలువలు, స్త్రీ స్వేచ్ఛ, మతసామరస్యము, లౌకిక భావనలు ఇవన్నీ అంతస్సూ త్రం గా నజ్రుల్ సాహిత్యం అంతా పరుచుకుని వుంటాయి. కులము, జెండర్ పేరిట చలామణి అయ్యే అసమానత్వాన్ని అణిచివేతని వివక్షని ఆ కాలంలోనే ఆయన తీవ్రంగా ఖండించాడు. ఆయన రాసిన , సంగీతం సమకూర్చిన పాటలు దాదాపు నాలుగు వేలకు పైగానే వుంటాయి అంటారు.

ఇవన్నీ ’నజ్రుల్ గీత్ ’గా ప్రాచుర్యంలో ఉన్నాయి. నజ్రుల్, బ్రహ్మ సమాజ సభ్యురాలైన ప్రమీలాదేవిని ప్రేమించి 1924లో పెళ్లి చేసుకున్నాడు. పుట్టిన పిల్లలకు హిందూ, ముస్లింల పేర్లను కలిపి పెట్టారు వాళ్ళు. అతి తక్కువ కాలంలోనే ఎంతో చెప్పుకోదగ్గ సాహిత్యాన్ని, సంగీతాన్ని నజ్రుల్ మనకి అందించాడు. 1940లలో తన స్వరాన్ని, జ్ఞాపక శక్తిని, మానసిక స్థిమితత్వాన్ని కోల్పోయే నాటికి , ఆయన వయసు కేవలం 43 సంవత్సరాలు మాత్రమే . ఆయనకి అరుదైన పిక్స్ వ్యాధి సోకింది. ఈ వ్యాధి ఆయన ఆరోగ్యంపై, తీవ్ర ప్రభావం చూపి, ఆయన ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితిని కల్పించింది. కొన్ని నెలల పాటు పిచ్చాసుపత్రిలో, చికిత్స కోసం వైద్యశాలలలో ఏళ్ల తరబడి ఉండాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగు చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాక, నజ్రుల్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, అది కుదర్చటం వైద్య పరంగా సాధ్యం కాదని వైద్యులు తేల్చి చెప్పారు. ఒక కవిగా, సృజనశీలిగా, పోరాటవాదిగా, ప్రత్యక్ష కార్యాచరణలో వున్న నజ్రుల్ మెల్లిగా మాటలే లేని మౌనంలోకి శాశ్వితంగా వెళ్లిపోయాడు. అయినా ఆ నాటి నుండి నేటి దాక అతని ప్రాభవము, ప్రభావశీలత బంగ్లా సమాజంలో చెక్కు చెదరలేదు.

1971లో నూతనంగా ఏర్పడిన బాంగ్లాదేశ్ ప్రభుత్వం నజ్రున్ ఇస్లాంను భారత ప్రభుత్వం ఆమోదంతో, తమ దేశానికి తీసుకువెళ్లి ఆయనకు గౌరవ పౌరసత్వాన్ని ఇచ్చి, అక్కడే ఆయనకు వైద్య చికిత్సలను అందించింది. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన పద్మభూషణంను ఆయనకు ఇచ్చింది. నజ్రుల్ ఆరోగ్యం బాగుపడలేదు. ఈ సుదీర్ఘ అనారోగ్యంతోనే ఆయన 29 ఆగస్టు 1976 లో బంగ్లాదేశ్ లో మరణించాడు. ఆయన ఆకాంక్ష ప్రకారమే ఆయన మృతదేహాన్ని ఢాకా విశ్వవిద్యాలయం క్యాంపస్ లోని ఒక మసీదులో ఖననం చేశారు. ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. కాజీ నజ్రుల్ ఇస్లాం కవిత్వాన్ని, సంగీతాన్ని, మత సామరస్య, విప్లవ, సామాజికన్యాయ, సమ భావాలను మళ్ళీ ఎత్తిపట్టాల్సిన సామాజిక సందర్భంలో ఇప్పుడు మనం వున్నాం . మరణం లేని కవులు కొందరే వుంటారు. అందులో నజ్రుల్ కూడా ఒకడు.

-విమల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News