మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరిపై భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. మేడిగడ్డ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని, దీనివల్ల ప్రజాధనం వృథా అయ్యిందని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా న్యాయస్థానం జులై 10న కెసిఆర్, హరీశ్‌రావు సహా ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కెసిఆర్, హరీశ్‌రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ.. సోమవారం కెసిఆర్, హరీశ్‌రావులు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగా లేవని.. నోటీసులను సస్పెండ్ చేసింది. అలాగే, భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి నోటీసులు కోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.