యాదాద్రి: తెలంగాణ సిఎం కెసిఆర్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సిఎం పినరయి విజయన్‌లు ఈరోజు(బుధవారం) యాదాద్రిని సందర్శించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వా మి ఆలయానికి ముగ్గురు ముఖ్యమంత్రులు వస్తు న్న నేపథ్యంలో అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆలయ ఈఓ గీత, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సిపి దేవేంద్ర సింగ్ చౌహన్‌లు ఏర్పాట్లను పరిశీలించారు. యాదాద్రి గుట్టపై ఉన్న పరిసరాలు, ప్రెసిడెన్షియల్ సూట్స్, యాగ స్థలం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లను పరిశీలించి, భద్రతపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈరోజు ఉదయం (బుధవారం) 11 గంటలకు రెండు హెలికాప్టర్‌లలో వారు యాదాద్రికి చేరుకొని స్వామివారిని దర్శించుకొనున్నారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ఈరోజు ఆలయంలో స్వామివారి నిత్య కల్యాణం, ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. స్వామి వారి దర్శనం అనంతరం సిఎం కెసిఆర్‌తో కలిసి మిగతా ముఖ్యమంత్రులు ఖమ్మం సభలో పాల్గొననున్నారు. ఖమ్మం సభకు జాతీయ పార్టీనేతలు, ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్‌లు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. కేరళ సిఎం పినరయి విజయన్, సమాజ్ వాదీ పా ర్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు సిపిఐ నేత డి.రాజా హాజరుకాన్నునారు.