Wednesday, January 22, 2025

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసాని అందిస్తున్నారన్నారు. వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల అతిభారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు,వరదలతో జరిగిన నష్టంపై గురువారం నాడు శాసన మండలిలో లఘు చర్చలో రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పారు.

పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలను నివృత్తి చేశారు. అదే సమయంలో విపక్షాలు చేసిన విమర్శలపై మంత్రి కౌంటరిచ్చారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించలేమని, ఆపలేమన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఫోర్స్‌గా నిలబడ్డారన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఎంఎల్‌ఎలు సహాయక చర్యల్లో పాల్గొన్నారని, వరద ప్రాంతాలను పరిశీలించారన్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. వరద సమయంలో సహాయక చర్యలను సిఎం కెసిఆర్ పర్యవేక్షించారని, గోదావరి పరీవాహక ప్రాజెక్టుల వారీగా కెసిఆర్ మానిటరింగ్ చేశారన్నారు. ప్రాణ, ఆస్తినష్టం తగ్గించడంలో సిఎం కెసిఆర్ కృషి చేశారని, విపత్తును అంచనా వేస్తూ పర్యవేక్షించారన్నారు. కెసిఆర్ ఫొటోలకు పోజులు ఇచ్చే నాయకుడు కాదని స్పష్టం చేశారు.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎనిమిది ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని, మోరంచపల్లిలో హెలికాప్టర్, ఆర్మీని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. 2020లో హైదరాబాద్‌లో భారీ వరదలు వచ్చినప్పుడు కేంద్రం స్పందించకపోవడంతో సిఎం కెసిఆర్ తక్షణం 650 కోట్లు విడుదల చేసి నష్టపోయినవారికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారన్నారు. గత ఏడాది అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10వేల చొప్పున 4.50 లక్షల ఎకరాలకు గను 455 కోట్లు ప్రకటించి ఇప్పటికే రైతులకు 150 కోట్లు పరిహారం అందించారు. మిగతావి ప్రాసెస్ లో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేశారు.
జిహెచ్‌ఎంసి పరిధిలో వరదల కట్టడికి కెటిఆర్ ప్రణాళికాబద్ద కృషి
జిహెచ్‌ఎంసి పరిధిలో వరదల కట్టడికి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అత్యంత ప్రణాళిక బద్దంగా పనిచేశారన్నారు. వారు చేపట్టిన వ్యూహాత్మక నాలా అభివృద్ది కార్యక్రమం ద్వారా గతంలో లాగా వరదలు రాకుండా నిలువరించి ప్రాణ నష్టం జరుగకుండా చేసిందని వెల్లడించారు. 985 కోట్లతో 55 పనులకు శ్రీకారం చుట్టారని, అందులో 31 పూర్తి అయినట్లు వెల్లడించారు.
చరిత్రలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షాలు పడ్డాయి
18 జూలై నుంచి 22 వరకు,24 జూలై నుంచి 28 వరకు రెండు దఫాల్లో కేవలం ఒక్క రోజులో 6 గంటల్లోనే భారీ వర్షాలు కురిశాయన్నారు. ‘ప్రకృతి వైపరిత్యాలు మనం ఎవరం ఊహించలేమని, దానిని అడ్డుకోలేమని తెలిపారు. అది సహజ ప్రక్రియ కానీ ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల ప్రకృతి వైపరిత్యాలతో జరిగే ప్రాణ నష్టం, ఆస్థి నష్టాన్ని మాత్రం నిలువరించగలం అని సిఎం కెసిఆర్ ఎప్పుడూ తమకు దిశానిర్దేశన చేస్తార న్నారు. మొన్న వారం రోజుల పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆకాశానికి చిల్లు పడిందా? అనేంత కుండపోత వర్షాలు మనం చూశామన్నారు. ఏడాది పొడవునా కురిస్తే ఎంత వర్షపాతం అయితే నమోదు అవుతుందో. అంతే స్థాయిలో ఒక్క రోజులో కురిసిన సందర్భం చూశామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా వర్షాలు కురిశాయి. నా సొంతూరు వేల్పూర్ మండలంలో ఒక్కరోజు రాత్రి కేవలం 6 గంటల సమయంలోనే 46 సేం.మీ వర్షం కురిసింది.
139 గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
భారీ వర్షాలతో 139 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధిత ప్రజల కోసం 157 సహయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలోని 7870 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలించి నట్టుగా చెప్పారు. భారీ వర్షాల కారణంగా 756 చిన్న తరహా సాగునీటి చెరువులకు గండ్లు పడ్డాయని తెలిపారు. చెరువుల పునరుద్దరణకు రూ. 171.1 కోట్లు అవసరమని చెప్పారు. 488 రాష్ట్ర రహదారులు, 29 జాతీయ రహదారులు పునరుద్దరిం చామన్నారు. రోడ్ల తాత్కాలిక పునరుద్దరణ కోసం రూ. 253.77 కోట్లు అవసరమౌతుంది. శాశ్వత పునరుద్దరణ కోసం రూ.1,771.47 కోట్లు అవసరమని అధికారులు లెక్కలు కట్టారన్నారు. పంచాయితీరాజ్ శాఖకు చెందిన 1,517 రోడ్లు దెబ్బతిన్నాయని సభకు వివరించారు. ఈ రోడ్ల తాత్కాలిక పునరుద్దరణ కోసం రూ. 187.71 కోట్లు అవసరమన్నారు. శాశ్వత పునరుద్దరణ కోసం రూ. 1,339.03 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఆగస్టు 8వ వరకు తాత్కాలిక పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నట్టుగా మంత్రి వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ విషయమై విపక్షాలు తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
కుంభవృష్టి కురిసిందిలా…
2023 జూలై 17 నాటికి వార్షిక సగటు వర్షపాతం 20 శాతం ఉంటే 28 జూలై నాటికి +66% అధిక వర్షాలు కురిశాయన్నారు. జయశంకర్ భూపాలపల్లి,హన్మకొండ, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, ములుగు, జగిత్యాల్, నిర్మల్, నిజామాబాద్,పెద్దపల్లి ఇలా 10 జిల్లాల్లో సంవత్సరం మొత్తంలో నమోదు అయ్యే వర్షపాతంలో 50 శాతం కేవలం 8 రోజుల్లోనే నమోదైందన్నారు. లక్ష్మిదేవిపేటలో 6 గంటల్లో 65 సెం.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. వార్షిక సగటు వర్షపాతానికి 75 శాతం అధికమన్నారు. వాజేడులో 6 గంటల్లో 52 సెం.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. సగటు వర్షపాతానికి 60 శాతం అధికమని వెల్లడించారు. వేల్పూర్ లో 6 గంటల్లో 46 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని, సగటు వర్షపాతానికి 50 శాతం అధికమని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో 90సెంటీమీటర్ల వర్షం సంవత్సర సగటుగా ఉంటే 6 గంటల్లోనే అదే స్థాయి కుంభవృష్టి కురిసింది.
15 సెం.మీ వర్షం నమోదైతేనే క్లౌడబరస్ట్ అంటారు.. మరి దీన్నేమంటారో!?
10 నుంచి 15 సేం.మీ వర్షం నమోదైతేనే క్లౌడ్ బరస్ట్ అంటారు అని అధికారులు చెప్తున్నారన్నారు. అట్లాంటిది రాష్ట్రంలో ఒక్కరోజులో 65 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. తాము క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు వెళ్ళినప్పుడు గత 50 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి వర్షాన్ని చూడలేదని ప్రజలు తమతో చెప్పారన్నారు. ఇంతటి వర్షాలు మనం ఎవరం ఊహించలేదన్నారు. కానీ సిఎం కెసిఆర్ ఆదేశాలతో గౌరవ మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు.
క్షణం తీరిక లేకుండా సిఎం కెసిఆర్ 24×7 మానిటరింగ్
సీఎం కేసిఆర్ ఈ కుంభవృష్టి వల్ల జరిగే నష్టాన్ని ముందే అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్ల వందలమంది ప్రాణాలను కాపాడాం. వరద పరిస్థితిపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం యుద్ధసన్నద్ధతతో చర్యలు చేపట్టింది. స్వయంగా సిఎం కెసిఆర్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిక్షణం వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా ఎస్సారెస్పీ, కడెం, అప్పర్ మానేర్, నిజాంసాగర్, భద్రాచలం దగ్గర గోదావరి ఉదృతిని ఇలా అన్ని ప్రాజెక్టులకు వచ్చే వరదను ప్రతీ గంటా సమీక్షిస్తూ నీళ్లు వదలవలసి వస్తే దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో ఉన్న తమకు చేరవేస్తూ క్షణం తీరిక లేకుండా అందర్నీ అలెర్ట్ చేశారన్నారు. ప్రాణనష్టం జరగకుండా, వరద బాధితులు ఇబ్బంది పడకుండా లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణను, సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు మంత్రులను, ఎంఎల్‌ఎలను, అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. దీంతో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారన్నారు.
సహాయక చర్యలు ఇలా…
సిఎం కెసిఆర్ వరద సహాయక చర్యల్లో భాగంగా 8 ఎన్‌డిఆర్‌ఎఫ్ టీమ్స్ 4 ప్రత్యేక బోట్లతో (ఒక్కో టీంకు 20-22 మంది నిస్టాతులు), విశాఖ పట్నం నుండి అదనంగా 2 టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. రెండు హెలికాప్టర్లతో భూపాలపల్లి,ములుగు,కొత్తగూడెంలలో వరద సహాయక చర్యలు చేపట్టామన్నారు. వరద బాధితులకు ఆహారం,మెడిసిన్ అందించామన్నారు. ఆర్మీవారితో మాట్లాడి 90 మందితో కూడిన టీంను కూడా సిద్ధం చేశారు. జిల్లాల్లో ఉన్న రెగ్యులర్ ఫైర్ టీంలు అందుబాటులో ఉండగా, 18 ఫైర్ టీమ్స్ (టీమ్ కి 10 మంది) 18 బోట్లు,16 రిలీఫ్ వెహికిల్స్ తో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామన్నారు. వారు మొరంచపల్లితో పాటు వరదల్లోంచి 1500 మందిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. అత్యవసరమైతే వినియోగించేందుకు 4 టూరిజం బోట్లు కూడా సిద్దంగా ఉంచామన్నారు.
పునరావాస కేంద్రాలు
వరదలకు ప్రభావితం అయిన 139 గ్రామాల్లో 7,870 ఇండ్ల నుంచి 27,063 మందిని 157 పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించామని వెల్లడించారు. వారందరికీ మంచినీళ్లు, ఆహరం, దుప్పట్లు, మెడిసిన్ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆ ప్రాంతాల్లో గతంలో పని చేసి అనుభవం ఉన్న 7గురు స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారన్నారు. సెక్రటేరియట్‌లో, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 24/7 గంటల పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వరద తగ్గిన తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ చర్యలు చేపట్టారన్నారు. దోమల నియంత్రణ కొరకు మందులు స్ప్రే చేయడం,బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. సిఎం కెసిఆర్ సూచనలు తూచా తప్పకుండా వర్షం పడుతుంటే కూడా లెక్కచేయకుండా తడుస్తూ క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఉండి భారోసాను కల్పించామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి ఎంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు.
ఆపత్కాలంలో అధికారులు అద్భుతంగా పనిచేశారు
క్షేత్ర స్థాయిలో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ ఇలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారన్నారు. యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారన్నారు. పోలీస్ సిబ్బంది సుమారు 19 వేల మందిని వరద ప్రభావిత ప్రాంతాలనుండి క్షేమంగా పునరావాస కేంద్రాలకు తరలించారన్నారు. విద్యుత్ సిబ్బందికి ఈ వేదికగా సెల్యూట్ చేస్తున్నానన్నారు. వరదల్లో ఈదుకుంటూ ప్రాణాలకు తెగించి కరెంట్ పునరుద్దరణ చేసిన వారి సాహసానికి అంతా అభినందనలు, ధన్యవాదాలు తెలుపాల్సిన సందర్భం ఇది అని అన్నారు. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల చెరువులు పటిష్టంగా తయారయ్యి దాని ఫలితంగా ఎక్కువగా గండి పడలేదని తెలిపారు. కొద్దిగా గండి పడ్డ చెరువులకు కూడా ఇరిగేషన్ శాఖ సిబ్బంది సకాలంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారన్నారు. రోడ్లు భవనాలు శాఖ అధికారులు ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బంది రాకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు వెంట వెంటనే యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ చేశారని వెల్లడించారు. రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ అందరినీ సమన్వయం చేస్తూ క్షేత్ర స్థాయిలో వారు పనిచేసిన తీరు ప్రశంసనీయమని మంత్రి వేముల అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ టీం కింది స్థాయి ఆశా వర్కర్ వరకు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సాయం చేయకున్నా కెసిఆర్ ప్రభుత్వమే కరోనా సమయంలో, వర్షాలు వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పునరుద్దరణ కోసం, పంట నష్ట సహాయం కోసం జిహెచ్‌ఎంసి వరదలప్పుడు ఒక్కో కుటుంబానికి 10వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిందని వెల్లడించారు. అంతకుముందు ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు ప్రసంగించారు. కాంగ్రెస్ పక్ష సభ్యుడు జీవన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. గతంలో కూడ ఈ రకంగా ప్రకటనలు చేసినా కూడ ప్రజలకు సహాయం అందలేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News