బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో ఆ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కెసిఆర్ అంటే ఒక
వ్యక్తి కాదు.. 4కోట్ల మంది ప్రజల భావోద్వేగం : హరీశ్
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సాధకుడుగా ప్రగతి ప్రదాతగా కారణజన్ముడైన తమ అభిమాన నేత తెలంగాణ కోసం చేసిన త్యాగాలను కృషిని స్మరించుకుంటూ పార్టీ నేతలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జన్మదిన వే డుకలు జరుపుకున్నారు. అన్నీ జిల్లాల్లోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద టపాసులు కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పుణ్య క్షే త్రాలకు వెళ్లి కెసిఆర్ పేరు మీద పూజలు చేయించారు. బిఆర్‌ఎస్ కేంద్ర కా ర్యాలయం తెలంగాణ భవన్‌లో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా 71 కేజీల కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించా రు. మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగి న ఈ వేడుకలకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు
మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు,ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా కెసిఆర్ జీవిత, రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
కెసిఆర్ నాకు మాత్రమే కాదు..యావత్ తెలంగాణ జాతికి హీరో : కెటిఆర్
కెసిఆర్ కేవలం తనకు మాత్రమే కాదు యావత్ తెలంగాణ జాతికి హీరో అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కోట్లాదిమంది ప్రజల తరఫున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని స్వప్నించి, 25 సంవత్సరాల పాటు తెలుగు రాజకీయాలను శాసించి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు కెసిఆర్ అని పేర్కొన్నారు. అలాంటి కెసిఆర్ కొడుకుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్యానించారు. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు కెసిఆర్‌కు మీడియా, మనీ, మజిల్ పవర్ లేకుండా తెలంగాణను సాధించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణలోని ఏ మూలకు పోయినా తిరిగి కెసిఆరే ముఖ్యమంత్రి కావాలన్న స్వరాలు వినిపిస్తున్నాయన్నారని చెప్పారు. కెసిఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి చేసే ఏకైక లక్ష్యంతో 60 లక్షల గులాబీ దండు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇదే ఆ మహానుభావుడికి గులాబీ సైనికులు ఇచ్చే పుట్టిన రోజు కానుక అని పేర్కొన్నారు. తెలంగాణ అనే పసి గుడ్డును తిరిగి తండ్రి చేతిలో పెట్టడమే మనం కెసిఆర్‌కు ఇచ్చే బహుమానం అని వ్యాఖ్యానించారు.
కెసిఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం : హరీష్‌రావు
కెసిఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. కెసిఆర్ 1954లో పుట్టారని, ఆయన పుట్టిన రెండేళ్లకే ఉన్న తెలంగాణను ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని అన్నారు. 1969లో మలి దశ తెలంగాణ ఉద్యమం వచ్చిన నాడు కెసిఆర్ వయస్సు 16 ఏండ్లు అని, ఆ వయసులోనే జై తెలంగాణ అంటూ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. 1969 నుంచి 2001 మధ్య అనేక మంది జై తెలంగాణ అని ఉద్యమం ప్రారంభించి, పదవి రాగానే మధ్యలో వదిలి పెట్టారని, దాని వల్ల ప్రజల్లో అపనమ్మకం కలిగిందని అన్నారు. ఆ అపవాదును తొలగించడానికి కెసిఆర్ మూడు పదవులను గడ్డి పోచలుగా త్యజించి, తెలంగాణ ప్రజల్లో నమ్మకం కల్పించారని తెలిపారు. పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని నాటి నాయకులు కెసిఆర్‌ను విమర్శించారని, టిడిపి నుంచి వచ్చిన మూడు పదవులకూ రాజీనామా చేసి ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి ఆయన నడిచారని గుర్తు చేశారు.
కెసిఆర్‌ను వ్యక్తిత్వ హననం చేయాలని చూశారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉక్కు సంకల్పం, మొండి పట్టుదలతో తెలంగాణ కోసం ఆయన పోరాడారని చెప్పారు. ఆమరణ దీక్షకు కూర్చోని ‘కెసిఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ముందుకెళ్లారని, కెసిఆర్ దీక్షకు తలొగ్గి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని తెలిపారు. కానీ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని అలా ఇస్తేనే దీక్ష విరమిస్తానని కెసిఆర్ మెుండిపట్టుపడ్డారని, ఆ విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్‌గా కెసిఆర్ నిలిపారని అన్నారు. కెసిఆర్‌ది, తెలంగాణ రాష్ట్రానిది తల్లీబిడ్డ బంధం అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ పాలనపై కొంత మంది అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. టీ 20 మ్యాచ్ ఆడుతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, రేవంత్ టీ20 మ్యాచ్ ఆడేది డబ్బు సంచుల కోసం అని విమర్శించారు. సిఎం మాటల్లో తొండి, హామీల అమల్లో తొండి అని, కానీ కలెక్షన్లలో మాత్రం 2020 అని పేర్కొన్నారు. దీపం ఉండంగానే ఇళ్లు సక్కబెట్టుకోవాలని సదురుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్‌కు టెస్టు, వన్ డే, 2020 ఏదైనా అద్బుతంగా ఆడుతారని,
ఎప్పుడు ఏది ఆడాలో కెసిఆర్‌కు బాగా తెలుసు అని పేర్కొన్నారు. అవసరం అయితే డిఫెన్స్ అడుతారు.. అవసరం అయితే సిక్స్‌లు కొడుతారని చెప్పారు. తెలంగాణలో ఎక్కడికి పోయినా కూలీ పని చేసుకునే వాళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద పోయే పిల్లల వరకు అందరూ కెసిఆర్ రావాలి అంటున్నారని, రేవంత్ పాలన బాగోలేదని తిడుతున్నారని అన్నారు. ఇప్పుడు మనం ఓడిపోవచ్చు.. కానీ, వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అంటూ పార్టీ శ్రేణులకు ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈసారి గెలిస్తే మళ్లీ మూడు టర్ములు మనమే ఉంటామని, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.