Sunday, January 19, 2025

22 నుంచి కెసిఆర్ బస్సు యాత్ర

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం బిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిశారు. ఈ మేరకు బస్సు యాత్ర వివరాలను వికాస్ రాజ్‌కు వాసుదేవా రెడ్డి అందజేశారు. కెసిఆర్ యాత్రకు తగిన భద్రత కల్పించాలని సిఇఒను కోరారు. యాత్రకు పోలీసుల సహకారం అందించేలా చూడాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వికాస్ రాజ్‌ను కోరినట్లు వాసుదేవరెడ్డి తెలిపారు.

ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని వాసుదేవా రెడ్డి సిఇఒను కోరారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలకు కెసిఆర్ భరోసా కల్పిస్తారన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేక పోయిందని వాసుదేవరెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బిఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో పదేళ్ల బిఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ, ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బిఆర్‌ఎస్ సిద్ధం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News