హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. నేడు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మొదలైన సమావేశం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఎంపీలు నేడు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలు లేవనెత్తాలి, ఏం మాట్లాడాలి అనే విషయంలో సిఎం కెసిఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ర్టానికి సంబంధించి పార్లమెంట్‌లో చర్చించాల్సిన విషయాలు ముఖ్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా, కేంద్ర బడ్జెట్ సమావేశాలు నెల 31 నుంచి రెండు విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.