Monday, July 8, 2024

ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే శిరోధార్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలనను అందించిందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. విద్యుత్ సాగునీరు తాగునీరు వ్యవసాయం తదితర రంగాల్లో నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కెసిఆర్ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బిఆర్‌ఎస్‌తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని తెలిపారు. తెలంగాణ ప్రజల నిర్ణయం దేశ రైతాంగాన్ని నిరుత్సాహ పరిచిందని పేర్కొన్నారు. ప్రతిరోజూ మాదిరిగా గురువారం నాడు కూడా తమ అభిమాన నేత కెసిఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ నర్సాపూర్ ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుండి తనను కలిసేందుకు వచ్చిన వారితో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు అని… ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. మనకు ప్రజా తీర్పే శిరోధార్యం అని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదని, ప్రజాసంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయం అని పేర్కొన్నారు. ప్రజల్లో కలిసివుంటూ వారి సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలని కెసిఆర్ పునరుద్ఘటించారు. రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బిఆర్‌ఎస్ అంతిమలక్ష్యమని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు.మన ప్రభుత్వాన్ని పోగొట్టుకుని ఊర్లల్ల బాధపడుతున్నారు సార్ అంటూ- ఈ సందర్భంగా కెసిఆర్‌తో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి కెసిఆర్ ముఖమంత్రి కావాలని. జై కెసిఆర్..జై తెలంగాణ నినాదాలతో తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ అషన్నగారి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News