Monday, December 23, 2024

దిశ మార్చిన ‘దశ’

- Advertisement -
- Advertisement -

పండుగ ఉన్నపళంగా ఆకాశం నుంచి ఊడిపడేది కాదు, అది ఒక క్రమ పరిణామ ఫలం. ప్రజలు ఎంతో కృషి చేసి, పోరాడి సాధించుకొనే చరిత్రాత్మక విజయ చిహ్నమే సంబురం. అటువంటి గొప్ప ఘట్టం ముందు తెలంగాణ ప్రజలు నేడు నిలబడి వున్నారు. నేడు గడిస్తే రేపు జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం. అలాగే బిఆర్‌ఎస్ (అప్పటి టిఆర్‌ఎస్) ప్రభుత్వం మొదటిసారిగా అధికారాన్ని చేపట్టిన రోజు. 2014 జూన్ 2న తెలంగాణ అధికారికంగా 29వ రాష్ట్రంగా అవతరించింది. అప్పటి నుంచి విరామం లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కె చంద్రశేఖర్ రావు చరిత్ర సృష్టించారు. తనకంటూ ప్రత్యేక సంస్కృతి, విలక్షణ చరిత్ర కలిగిన తెలంగాణను రెండోసారి రగిలిన స్వరాష్ట్ర సాధన ఉద్యమ పథంలో నడిపించి లక్షానికి చేర్చిన అనితర సాధ్యమైన నాయకత్వమే కెసిఆర్‌ను ప్రజల హృదయాల్లో ప్రతిష్టంచి సిఎంగా చేసింది. తొమ్మిదేళ్ళకు పైబడిన పాలనా కాలమంతా రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో ముందుకు నడిపిస్తున్న ఘనత కూడా ఆయనకు చెందుతుంది. ఈ రోజున వెనుకకు చూసుకుంటే ఎలాంటి తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందో స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి, అందులో చేసిన అమూల్యమైన త్యాగాలకు, అమర వీరుల బలి దానాలకు మూలమైన మూడు ప్రధాన లక్షాలు నీళ్ళు, నిధులు, నియామకాలు. వాటి విషయంలో తెలంగాణ సాధించినవి, సాధించుకొంటున్నవి గణనీయమైన విజయాలేనని అంగీకరించక తప్పదు. ఒకప్పుడు ఎడారిని తలపించినట్టు వుండిన ప్రాంతాలు కూడా ఈ రోజున సస్యశ్యామలమై పంట సిరి ‘వరి’ంచిన సుభిక్ష క్షేత్రాలై వర్ధిల్లుతున్నాయి. సంక్షేమం సమ్మిళిత అభివృద్ధిలో తనకు సాటి లేదని తెలంగాణ చాటుకొంటున్నది. గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం కింద రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. వృద్ధులకు, నిస్సహాయ స్థితిలోని వారికి ఆసరా పింఛన్లు, అంగన్ వాడీ వర్కర్లకు జీతాల పెంపు, రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, విశేష సంఖ్యలో వైద్య కళాశాలలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, పేదలకు రూపాయికే కిలో బియ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం, నభూతో నభవిష్యతి అన్న చందంగా ఆకాశాన్ని తాకే అంబేడ్కర్ విగ్రహ స్థాపన, ఆయన పేరిట నూతన సచివాలయ భవనం ఇలా చెప్పుకొంటూ పోతే చాలా నవ్య సంకల్పాలు అనతి కాలంలోనే రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాయి.

2021లో నీతి ఆయోగ్ కొత్త పరిశోధనల సూచీలో రాష్ట్రం దేశం మొత్తంలో రెండవ స్థానాన్ని సాధించుకొన్నది. వివిధ రంగాల్లో రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ప్రకటించిన అవార్డుల్లో నాలుగో వంతు తెలంగాణకే లభించడం కంటే విశేషం ఏముంటుంది! పిల్లల ఆహారంలో తృణ ధాన్యాల వాటాను పెంచడానికి తెలంగాణ ఉద్దేశించిన పథకాన్ని నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రశంసించింది. అలాగే పల్లె ప్రకృతి వనాల పథకాన్ని దేశంలోనే ఉత్తమమైన 75 ప్రాజెక్టుల్లో ఒకటిగా చేర్చింది. మిషన్ భగీరథకు కేంద్రం విశేష పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ మంచి నీటిని సరఫరా చేస్తున్నందుకు మొదటి బహుమతిని ఇచ్చింది. 2023లో ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో పదమూడింటిని తెలంగాణ గెలుచుకొన్నది. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల ప్రవాహం విశేషంగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో తెలంగాణ 7వ స్థానంలో వుండగా, చాలా దూరంలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో నిలిచింది. తెలంగాణకు రూ. 10,319 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేవలం రూ. 2252 కోట్లు మాత్రమే లభించాయి. వైద్య ఆరోగ్య రంగంలో నిరంతర ప్రగతి కృషి జరుగుతోంది. కొవిడ్ సమయంలో కేంద్రం సహాయ నిరాకరణను తట్టుకొని బాధిత పేదలను ఆదుకొని రాష్ట్రం స్వావలంబనను రుజువు చేసుకొన్నది. ఎడారిని సాగు చేయడం క్షణాల్లో జరిగే పని కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చెప్పనలవికాని నిర్లక్షానికి గురైన తెలంగాణకు సాటిలేని అభివృద్ధి ఖ్యాతిని సాధించడానికి ఎల్లవేళలా ప్రయత్నం జరుగుతున్నది. దీనిని హర్షించకుండా వుండలేము. ఒక్క లక్ష సాధనా అనుకొన్న వెంటనే సాధ్యమయ్యేది కాదు. ఇది తిరుగులేని వాస్తవిక దృష్టి. ముందు వెనుకలుగా ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ముందడుగు వేయడమే లక్షంగా సాగుతున్న రాష్ట్రాభివృద్ధి కృషి దశాబ్ది సంబురాల సందర్భంగా ప్రశంసనీయమైన దశకు చేరుకొన్నందుకు ప్రతి ఒక్కరూ ఆనందించాలి. ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News