హైదరాబాద్: కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి, దేశానికి బిఆర్‌ఎస్ అవసరం తదితర విషయాలను తెలియచెప్పడానికి ఎన్‌ఆర్‌ఐలు తమవంతు పాత్రను పోషించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఆస్ట్రేలియాలో కెసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను కవిత శుక్రవారం ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో బిఆర్‌ఎస్ పార్టీ గురించి భారతీయులకు తెలియచేసేలా,
అలాగే ఉద్యమం నుంచి పార్టీ కోసం బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని కవిత అభినందించారు. బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగం ఆస్ట్రేలియాలో కెసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
29 రాష్ట్రాల ఎన్‌ఆర్‌ఐలు పాల్గొంటారు: కాసర్ల నాగేందర్ రెడ్డి
ఆస్ట్రేలియాలో కెసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ఇందులో 29 రాష్ట్రాల ఎన్‌ఆర్‌ఐలు పాల్గొంటున్నారని ఆస్ట్రేలియా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ నుంచి బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తరువాత ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులకు బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం, కెసిఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధి, కెసిఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఈ టోర్నమెంట్ దోహదపడుతుందని ఆయన తెలిపారు.
తద్వారా కెసిఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండా ఎన్‌ఆర్‌ఐలకు చేరుతుందన్నారు. కెసిఆర్ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో స్టేడియం నిర్మించబోతున్నారని, దీని స్ఫూరితోనే తాము క్రికెట్‌ను బిఆర్‌ఎస్ భావజాల వ్యాప్తికోసం ఎంచుకున్నామని నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా ఫసీయుద్దిన్, సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్ చారిలతో పాటు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.