Thursday, December 26, 2024

ఆరు రాష్ట్రాల నుంచి ఆరంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ కార్యకలాపాలు, డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ కిసాన్‌సెల్ లను ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే క్రి స్మస్ పండుగ తర్వాత నుంచి బిఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాల ఉధృతి పెరగనుంది. ఈ మేరకు ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్‌కే కార్యకలాపాలను ప్రారంభం కానున్నాయి. తద్వారా బిఆర్‌ఎస్ జాతీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తూ, దేశ ప్రజలను ఆకర్షిస్తూ చారిత్రక దశలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనుంది. డిసెంబర్ 16 నుంచి పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన వెంటనే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తమ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ధనుర్మాసం ప్రారంభం అవుతుందన్న నేపథ్యంలో ఆ లోపే బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన కెసిఆర్ అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు.

ఉత్తరాది, దక్షిణాది నుంచి ప్రముఖుల హాజరు దక్షిణాది నుంచి అఖిలేష్ యాదవ్, కుమార స్వామి వంటి మాజీ సిఎంలు, ప్రముఖ పార్టీల అధ్యక్షులు ముఖ్య అతిథులుగా ఈ కార్యాలయం ప్రారంభానికి హాజరయ్యారు. దేశ రాజకీయ విమర్శకులు మేథావులు ఆశ్చర్యపోయేలా అత్యద్భుతంగా బిఆర్‌ఎస్ కార్యాలయా న్ని డిసెంబర్ 14వ తేదీన అధినేత కెసిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకులు, రచయితలు, మేథావులు, ప్రముఖు లు హాజరై కెసిఆర్‌ను స్వయంగా కలిసి సంఘీభావం తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్‌లో సభ్యత్వం తీసుకొని పనిచే యడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకులు ప లు సామాజిక వర్గాల సంఘాల నేతలు, పలు రం గాలకు చెందిన వృత్తులకు చెందిన మేధావులు, యువతీ, యువకులు బిఆర్‌ఎస్‌లో చేరి అధినేత కెసిఆర్ వెంట కలిసి నడిచేందుకు ఉత్సాహం చూ పిస్తున్నారు.

నేపథ్యంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ అధికారిక ఆవిర్భావం రోజున హైదరాబాద్‌లో ప్రకటించిన కెసిఆర్ అందుకు అనుగుణంగా ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ కిసాన్ సెల్‌లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అటు ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీంలతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కెసిఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక పరిస్థితులు నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాలో వారికి సుధీర్ఘంగా అధినేత కెసిఆర్ వివరించి ఆ దిశగా వారిని సమాయత్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, సహా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ కిసాన్‌సెల్‌లను ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు.

జాతీయ మీడియాలో ఆసక్తికర చర్చ

బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయ మీడియాలో ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ‘అంధకార బంధురంగా మారిన వర్తమాన రాజకీయ పాలన యవనికమీద వెలుగు దివ్వెను వెలిగిస్తాం’ అన్న అధినేత సిఎం కెసిఆర్ ప్రకటన దేశవ్యాప్తంగా అటు మీడియా ఇటు రాజకీయ విమర్శకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో ఈనెలాఖరున కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో బిఆర్‌ఎస్ అధినేత సమావేశం జరుపనున్నారు. డిసెంబర్ నెలాఖరులో ఢిల్లీలో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసి బిఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతాలు భవిష్యత్ కార్యాచరణ సహా విధి, విధానాలను ఆయన ప్రకటించనున్నారు.

భవిష్యత్ కార్యాచరణపై జాతీయ మీడియాలో ఉత్కంఠ

దేశంలో గుణాత్మక రాజకీయాలు వాటితో పాటు కేంద్రంలో గుణాత్మక పాలన రావాలంటే ఏ దిశగా అడుగులు వేయాలో, ఈ దేశ ప్రజల కర్తవ్యం ఏమిటో ఇప్పటికే బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ పలుమార్లు ఉద్ఘాటించారు. ‘గెలవాల్సింది రాజకీయ నాయకులు పార్టీలు కాదు, ప్రజలు, ప్రజా ప్రతినిధులని కెసిఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ దేశానికి ప్రత్యామ్నాయం అంటే కొన్ని పార్టీలతో జతకట్టే రాజకీయ ఫ్రంటులు కాదనీ దేశ ప్రజలకు మేలు చేసే ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోయే రాజనీతిజ్జత కావాలని సిఎం కెసిఆర్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బిఆర్‌ఎస్ భవిష్యత్ కార్యాచరణపై జాతీయ మీడియాలో ఉత్కంఠ నెలకొంది. బిఆర్‌ఎస్ పార్టీ విధి, విధానాలు ఏమిటీ? రాజకీయ సైద్దాంతికత ఏమిటీ? అభివృద్ధి నమూనా ఏమిటన్న విషయంలో ఇప్పటికే జాతీయ మేధావి వర్గం చర్చలు జరుపుతోంది.

వ్యవసాయం, సాగునీటి రంగానికి పెద్దపీట

‘ఎద్దు ఏడ్చిన యవుసం …రైతు ఏడ్చిన రాజ్యం ముందట పడదు’ అనే నానుడి వ్యవసాయాధారిత దేశంలోని ప్రజల నానుడి. ప్రాముఖ్యతని వ్వాల్సిన వ్యవసాయం సాగునీటి రంగాన్ని దశాబ్దాలుగా దేశ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆవేదనను అధినేత కెసిఆర్ పలుమార్లు ప్రకటించారు. ఈ తాత్వికతతోనే తెలంగాణ సాధన అనంతరం తక్షణమే వ్యవసాయం, సాగునీటి రంగానికి ఆయన పెద్ద పీట వేశారు. నేడు రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయం సాగునీటి రంగాన్ని కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పటిష్ట పరిచి అన్నం పెట్టే దేశ రైతన్నను కాపాడుకోవాలన్న దీర్ఘకాలిక ధ్యేయంతో మహోన్నత ధ్యేయంతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముందడుగు వేస్తున్నారు.

ఎపి, మహారాష్ట్ర, ఒడిస్సా, కర్ణాటకల నుంచి స్పందన

బిఆర్‌ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను, రాజకీయ నాయకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఆ పార్టీలో పనిచేయడానికి తమకు అవకాశం కల్పించాలని అధినేత కెసిఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు సంప్రదింపులు జరుపుతున్నారు. తాము బిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుంటామని అధినేత కెసిఆర్‌తో కలిసి పనిచేయడానికి వారు ఉత్సాహంగా ఉన్నారు. ఈ మేరకు ఆంధ్రాలోని పలు జిల్లాల్లో బిఆర్‌ఎస్‌ను ప్రారంభించడానికి రంగం సిద్ధమయ్యింది. ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఎనభై మంది ప్రముఖులు కెసిఆర్‌ను సంప్రదించి వెళ్లారు. అధినేత ప్రకటన అనంతరం ఆంధ్రాలో బిఆర్‌కెఎస్ (బిఆర్‌ఎస్ కిసాన్ సెల్) కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఎపితో పాటు మహారాష్ట్ర, ఒడిస్సా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా పలువురు బిఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి, ఆ పార్టీ తరపున పనిచేయడానికి ఉత్సాహాం చూపడం విశేషం.

రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో….

ఇప్పటికే కన్నడ, ఒరియా, మరాఠా, వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి భావజాల వ్యాప్తి కోసం కెసిఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అందుకోవాల్సిన గుణాత్మక మార్పులు ఏమిటీ? వాటిని బిఆర్‌ఎస్ పార్టీ ఏ విధంగా దేశ ప్రజలకు అందించబోతుంది.

ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బిఆర్‌ఎస్ తన పాత్రను భవిష్యత్‌లో ఎట్లా పోషించబోతుంది ? ఈ దేశ సకల జనులకు, సబ్బండ వర్గాల ఆకాంక్షలకు చిరునామాగా బిఆర్‌ఎస్ ఎలా నిలవబోతుంది ? అనే తాత్విక సైద్దాంతిక అంశాలను పలు భాషా, సాహిత్యాలు, రచనలు, పాటల ద్వారా భావజాల ప్రచారం జరగనుంది. ఆయా రంగాల వారీగా సాహిత్య, సాంస్కృతిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా భావజాల వ్యాప్తి చేయడానికి అధినేత కెసిఆర్ కొన్ని నెలలుగా సాహితీ వేత్తలతో లోతైన విశ్లేషణలు, చర్చలు చేపట్టారు. త్వరలో అవి కార్యరూపం దాల్చడానికి రంగం సిద్ధమయ్యింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News