Friday, November 15, 2024

ఒక పర్యటన అనేక సమాధానాలు

- Advertisement -
- Advertisement -

KCR delhi tour symbolizes strategic relationship with Center

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరు రోజుల హస్తిన పర్యటన అనేక సమాధానాలిచ్చింది. ప్రత్యేకించి, ఈ పర్యటన కేంద్రంతో కెసిఆర్ వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్రంతో సామరస్యపూర్వక వైఖరి ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఆయన కృషి చేసినట్లుగా పర్యటన పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రంతో సంబంధాలు ఎలా ఉన్నా ఆయా రాష్ట్రాల సిఎంలకు భిన్నంగా తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా, ప్రాధాన్యతగా భావించి కెసిఆర్ తన ఆరు రోజుల పర్యటనను విజయవంతం చేసుకున్నారు. ప్రధాని మోడీతో సహా పలువురు కీలక శాఖల మంత్రులను తన అనుచరులతో కలిసి రాష్ట్రానికి సంబంధించిన సంక్లిష్ట సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తన రాజకీయ చతురత, పరిణతిని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో మైత్రీ పూర్వక సంబంధాలను కొనసాగించడం, అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన అంశాలను సామరస్య పూర్వక వాతావరణంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం, ఈ దిశలో అడ్డంకులను అధిగమించి కేంద్రం మద్దతు సాధించడమే లక్షంగా కెసిఆర్ తన పర్యటనను కొనసాగించారు.

ఒకవైపు ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి తొలి అడుగు వేస్తూ తమ పార్టీ జాతీయ స్థాయిలో కూడా తనదైన పాత్రను సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఆయన చెప్పకనే ఇక్కడ చెప్పారు. హస్తినలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కెసిఆర్ కోరిన వెంటనే ఢిల్లీ పెద్దలు స్థలాన్ని మంజూరు చేయడం విశేషం. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ, అందునా దక్షిణాది నుంచి హస్తినలో పార్టీ ఆఫీస్ నెలకొల్పుకుంటున్న తొలి పార్టీ టిఆర్‌ఎస్సే కావడం..దీని వెనక ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ శ్రమ, దానికి అనుసరించిన చాతుర్యాన్ని చాటుతోంది. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన పార్టీ కార్యాలయ భూమి పూజకే పరిమితమని తొలుత భావించినా అనూహ్యంగా ఆయన ప్రధాని మోడీని కలవడం, కేవలం రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడివున్న పది విజ్ఞప్తులతో వినతిపత్రం అందించడం, ఇదంతా చకచకా జరిగిపోవడం రాజకీయ పరిశీలకులను నివ్వెరపరిచింది. బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్రానికి వివిధ రంగాల్లో అవసరమైన ప్రతిపాదనలను కెసిఆర్ కేంద్రం ముందుంచారు. ప్రధానితో ఏకంగా 50 నిమిషాల పాటు వివిధ అంశాలను చర్చించి పర్యటనను విజయవంతం చేసుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన కలల ఆధ్యాత్మిక ప్రాజెక్టు యాదాద్రి ప్రారంభోత్సవానికి రావలసిందిగా మోడీని కోరారు.

దానికి ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వడమే కాకుండా తన ముఖ్య సహచరుల భేటీకి కూడా మోడీ అంగీకరించడం కెసిఆర్ పట్ల ప్రధానికి ఉన్న సానుకూలతను మరోసారి నిరూపించింది.

కెసిఆర్ ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రోడ్లు, జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌లను కలిసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కావలసిన ప్రతిపాదనలను విజ్ఞప్తుల రూపంలో ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా చర్చించడం ద్వారా రాష్ట్ర ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందుంచగలిగారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలతో విస్తరించిన తర్వాత పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఐపిఎస్ పోస్టుల సంఖ్యను 139 నుంచి 195కు పెంచాలని ఆయన హోం మంత్రి అమిత్ షా ను కోరారు.

నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఐదు లేఖలు ఇచ్చి వాటికి నిధులు కేటాయించాలని కోరారు. కల్వకుర్తి, నంద్యాల జాతీయ రహదారిని ప్రకటించడం పట్ల గడ్కరికి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిలిచిన హైదరాబాద్, విజయవాడ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమైన నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కెసిఆర్ గడ్కరీని కోరారు. ఇక పర్యటన చివరి రోజైన సోమవారంనాడు జలశక్తి మంత్రి షెకావత్‌ను కలిశారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో సాగునీటి జలాల విషయంలో కేంద్రం విడుదల చేసిన గెజిట్‌పై అభ్యంతరాలు తెలియజేయడం, కృష్ణా నీటిలో తెలంగాణ నీటి వాటాలను సాధించడం, కాళేశ్వరం మూడో టిఎంసి పనులకు అనుమతులు సాధించడానికి కృషి చేశారు.

రాష్ట్రంలో బిజెపితో సంబంధాలు ఎలా ఉన్నా తెలంగాణ విశాల ప్రయోజనాల దృష్టా కెసిఆర్ కేంద్రంలోని ప్రముఖులందరినీ కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలన్నింటినీ చర్చించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, రాజకీయంగా, శాంతి భద్రతలపరంగా సుస్థిరంగా నిలవడమే కాకుండా కొవిడ్ కష్ట కాలంలోనూ ఆర్థిక గండాలను గట్టెక్కుతూ విజయవంతంగా సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నారో ఆయన కేంద్ర పెద్దలకు వివరించారు. రాష్ట్రాన్ని మరింతగా సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం మెగా ప్రాజెక్టు ఎలా రికార్డు సమయంలో నిర్మించగలిగారో ఆయన కేంద్ర పెద్దలకు విశదీకరించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అనేక రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించడం, వినూత్న సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలవడం మూలంగానే కేంద్రం కెసిఆర్‌తో భేటీలకు ప్రాధాన్యమిచ్చినట్లుగా రుజువవుతున్నది. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందడానికి పారిశ్రామిక, సాగునీరు, వ్యవసాయ, విద్య, వైద్యం, ఐటి రంగాల్లో కేంద్రం నుంచి సహకారాన్ని ఆయన నిర్దిష్ట ప్రతిపాదనలతో కోరారు.

ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారాన్ని కూడా ఆయన మోడీతో సహా కలిసిన కేంద్ర ప్రముఖులను అభ్యర్థించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా నిలిచిన బియ్యం సేకరణ సమస్యను మంత్రి గంగుల కమలాకర్ ద్వారా, ఐటి, పారిశ్రామిక పెండింగ్ ప్రతిపాదనలకు మోక్షం కల్పించాలని మంత్రి కెటిఆర్ ద్వారా కేంద్ర మంత్రులను కలిసేలా చూసి వాటికి పరిష్కారం సాధించే ప్రయత్నం చేశారు. గతేడాది దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామం కేంద్రంగా రైతు పండించిన ధాన్యాన్ని నూరు శాతం కొనుగోలు చేసి రైతుకు మద్దతుగా నిలిచిన కెసిఆర్ యాసంగిలో ధాన్యం సేకరణలో ఎఫ్‌సిఐ నుంచి ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా ప్రధాని మోడీ మొదలుకొని హోంమంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌లతో ముఖ్యమంత్రి వరుస భేటీలు కేంద్రంతో ఆయన నెరపుతున్న సత్సంబంధాలను రుజువు చేస్తున్నాయి.

                                                                                                              (మిట్టపల్లి శ్రీనివాస్)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News