Thursday, January 23, 2025

బడుగు, బలహీన వర్గాల విద్యా ప్రదాత సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్

హైదరాబాద్ : బిసి విద్యార్థుల కోసం నూతనంగా మరో 17 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యా ప్రదాతగా చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్లుఎస్ ) విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో ప్రతి ఏడాది గురుకుల పాఠశాలను దశలవారీగా పెంచుతూ పాఠశాల స్థాయి నుండి డిగ్రీ కళాశాలల వరకు నూతన గురుకుల ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడక ముందు 19 బిసి గురుకుల పాఠశాలలు ఉంటే నేడు అవి 327 చేరుకున్నాయన్నారు. వీటిలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన కార్పొరేట్ విద్యను ఉచితంగా పొందుతున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి గురుకుల విద్యా విధానం లేదని కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన మేరకే ఇది సాధ్యమైందన్నారు. కళాశాల ఫీజులు కట్టలేక, రూమ్ కిరాయిలు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ డిగ్రీ కళాశాలలతో ఎంతో మేలు జరుగుతుందని కిశోర్ గౌడ్ కొనియాడారు. దీనివల్ల ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడడానికి దోహదపడుతోందని పేర్కొన్నారు. ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విద్యార్థులు జీవితాంతం రుణపడి ఉంటారు అని అన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన కిశోర్ గౌడ్ ముఖ్యమంత్రి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News