హైదరాబాద్: సామాజికంగా, ఆర్థికంగా శతాబ్దాల కాలంగా దళితులు వివక్షకు గురవుతున్నారని, దళిత సమాజం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాగు చేసుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితుల కోసం ఇంకా చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సిఎం దళిత సాధికారత పథక లక్ష్య సాధన కోసం దళిత మేధావులు కదలి రావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. రూ.1200 కోట్లతో ప్రారంభించి భవిష్యత్‌లో రూ. 40 వేల కోట్లతో సిఎం దళిత సాధికారత పథకం కోసం పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ పథకం కోసం సలహాలు, సూచనలు అందించాలని మేధావులను కోరారు. తెలంగాణలో ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నామని, సాగునీటి, వ్యవసాయం రంగంతో సహా గ్రామీణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకున్నామన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
అందరి జీవితాలతో పాటు దళితుల జీవితాలు మెరుగుపడుతూ రావాలన్నారు. తెలంగాణలో దళితుల్లో పేదరికం అనేది లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామని, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుడికే ఆర్థిక సాయం అందేలా అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, లక్షసాధనలో అందరూ భాగస్వాములు కావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. దళిత సాధికారతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని, పథకాన్ని రూపొందించడమే కాకుండా పటిష్టంగా అమలు చేసేందుకు కావాల్సిన సపోర్టివ్ మెకానిజాన్ని మనమే తయారు చేసుకోవాలన్నారు.
ఏ రంగంలోనైనా అభివృద్ధి జరగాలంటే రెండు రకాల ఇన్పుట్స్ అవసరం పడుతాయని, ఒకటి ఆర్థికపరమైనదని, రెండోది ఆలోచన పరమైనదన్నారు. రెండు ఇన్‌పుట్స్‌ను కలగలిపి దళితుల అభివృద్ధికి సమిష్టి కృషి సాగిద్దామన్నారు. దళితుల సమస్యలు గ్రామాల్లో ఒకలా… పట్టణాల్లో మరోలా ఉన్నాయని, హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో పూర్తి భిన్నంగా దళితుల సమస్యలు కనిపిస్తున్నాయని, ఏ ప్రాంతంలోని సమస్యలకు ఏ విధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా శాశ్వత పరిష్కారాలు సాధించగలమో ఆలోచన చేయాలన్నారు.