Monday, January 20, 2025

ఆపరేషన్ ‘మునుగోడు’

- Advertisement -
- Advertisement -

భారీ మెజార్టీ దిశగా కెసిఆర్ కసరత్తులు

స్వయంగా ఓ గ్రామం బాధ్యత తీసుకున్న కెసిఆర్ 86 క్లస్టర్లుగా
నియోజకవర్గం విభజన ప్రతి క్లస్టర్‌కు ఇన్‌చార్జిగా ఓ ఎంఎల్‌ఎ
కెటిఆర్, హరీశ్‌తో పాటు 14మంది మంత్రులకు బాధ్యతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఏం చేసినా దానికో లెక్కుంటది. అనేక సంచనాలకు కేంద్రబిందువుగా మారుతారు. పదునైన వ్యూహాలే ఆయనకు రాచబాటగా మారుతున్నాయి. రాష్ట్రంలో అనేక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అవి ఘన విజయాన్ని సాధించి పెడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల భారాన్ని పూర్తిగా పార్టీ నేతలకే అప్పగించిన కెసిఆర్… మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికపై అందుకు పూర్తి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌కు కేవలం గెలుపే కాకుండా భారీ మెజార్టీతో విజ యం దక్కించుకోవాలని ఆయన ఊవ్విళ్లూరుతున్నారు. టిఆర్‌ఎస్ సాధించే భారీ మెజార్టీని చూసి ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టాలన్న కసితో కెసిఆర్ ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అందు కే మునుగోడు ఉపఎన్నికపై ఆయన పూర్తి స్థాయి లో దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నేతలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

ఈ గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టిఆర్‌ఎస్‌కు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని తహతహలాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మ రో సంవత్సరం వ్యవధి కూడా లేదు. ఇలాంటి సమయంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుండడంతో దానిని కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ విజయంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలను మళ్లీ రెండు, మూడు స్థానాలకే పరిమితం చేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలకు అవసరమైతే డిపాజిట్లు కూడా దక్కకుండా ఉప ఎన్నిక మొత్తం వన్‌సైడ్‌గా జరిగే విధంగా కెసిఆర్ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ నియోజకర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…..నల్గొండ ఎంపిగా విజయం సాధించడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. కాగా ఈ ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా యత్నించింది. కానీ టిఆర్‌ఎస్ ప్రభావం ముందు తలవొంచక తప్పలేదు. ఈ ఎన్నిక అనంతరం నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరిగింది. టిఆర్‌ఎస్ శాసనసభ్యుడిగా కొనసాగిన నోముల నర్సింహయ్య చనిపోవడంతో జరిగిన ఉపఎన్నికలో మరోసారి గులాబీ పార్టీ విజయం సాధించింది.

ఇలా జిల్లాలో జరిగిన రెండు ఉపఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇక మూడవ ఎన్నిక మునుగోడు నియోజకవర్గానికి జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా కొనసాగిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ నియోజకవర్గాన్ని కూడా గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. మునుగోడుపై కూడా గులాబీ జెండాను ఎగురవేసి ఉమ్మడి నల్లొంగ జిల్లాలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకోవాలన్న యోచనలో గులాబీబాస్ ఉన్నారు. అందుకే పార్టీ ప్రచారం నుంచి మొదలుకుని పార్టీ నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు కెసిఆర్ ప్రగతి భవన్ నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ప్రత్యర్ధుల బలబలాలను తెలుసుకుంటూనే తదనుగుణంగా పార్టీశ్రేణులను తగు సూచనలు, సలహాలు జారీ చేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం జరిగిన హూజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ఎలాంటి ప్రచార సభలను కూడా నిర్వహించ లేదు. కానీ మునుగోడులో ఇప్పటికే ఒకసారి బహిరంగ సభల్లో పాల్గొన్న కెసిఆర్ మరోసారి కూడా బహిరంగ సభను నిర్వహించడానికి సిద్ధ్దమవుతున్నారు. పైగా ఈ ఉప ఎన్నిక సమయంలోనే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఆయన అడుగుపెడుతున్నారు. దీంతో మునుగోడు విజయంతోనే జాతీయ రాజకీయాల్లో మరింత శరవేగంగా దూసుకపోయే విధంగా కెసిఆర్ వ్యూహాలకు పదనుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం 86 క్లష్టర్లుగా విభజించారు. ప్రతి క్లష్టర్‌కు ఒక శాసనసభ్యుడికి బాధ్యతలు కట్టబెట్టారు. అలాగే మొత్తం 14 మంది మంత్రులకు కూడా ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. వారిలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు కెటిఆర్, హరీశ్‌రావులను కూడా భాగస్వామ్యం చేశారు.

లెంకలపల్లి గ్రామం బాధ్యతలను చూస్తున్న కెసిఆర్

ఇదిలా ఉండగా ఉపసమరంలో పార్టీ ఇన్‌చార్జుల ఎంపికలో సంచలన పరిణామం జరిగింది. సిఎం కెసిఆర్ కూడా కూడా ఒక గ్రామానికి ఇన్‌చార్జ్‌గా ఉండటం హాట్ హాట్ గా మారింది. మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామానికి ఆయన ఇన్‌చార్జుగా ఉన్నారు. కాగా మునుగోడు బైపోల్ బాధ్యతలను మొదటి నుంచి చూస్తున్న ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు లెంకలపల్లితో పాటు సరంపేట గ్రామాలను మొదట కేటాయించారు. తర్వాత తనకు ఒక గ్రామం కేటాయించాలని కెసిఆర్ సూచించడంతో.. లెంకలపల్లి గ్రామాన్ని కేటాయించారని తెలుస్తోంది. దీంతో మునుగోడు సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఎంపిలు, ఎంఎస్‌సిలు, ఎంఎల్‌ఎలంతా మునుగోడులో ప్రచారం చేయబోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News