Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతగా కెసిఆర్ ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఎంఎల్‌ఎలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కెసిఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ తీర్మానాన్ని ఎంఎల్‌ఎలు అందరూ బలపరిచారు. బిఆర్‌ఎల్‌ఎల్‌పి లీడర్‌గా పార్టీ అధినేత కెసిఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని బిఆర్‌ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్‌కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశానికి ఆయన హాజరు కాలేదు.

కెసిఆర్‌తో పాటు ఆసుపత్రిలోనే ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ కూడా భేటీకి హాజరు కాలేదు.బిఆర్‌ఎస్ శాసనసభ పక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను అధినేత కెసిఆర్‌కు అప్పగిస్తూ పార్టీ సమావేశంలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు. ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి సహా కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలు హాజరయ్యారు. సమావేశం అనంతరం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అసెంబ్లీ సమావేశానికి బయలుదేరి వెళ్లారు.

గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు
గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అమరులకు నివాళులర్పించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు జోహార్లు.. జై తెలంగాణ నినాదాలతో గన్‌పార్క్ ప్రాంగణం హోరెత్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News