Sunday, September 8, 2024

దేవుని పేరుతో ఓట్లు దేవునిపై ఒట్లు

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణ ఆగమైంది. బీజేపీ తప్ప కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ బ్రహ్మాండంగా ఉండేదని బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కోసం మద్దతుగా ఏర్పాటు చేసిన రోడ్ షో లో ఆయన పాల్గొని కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మేక్ ఇన్ ఇండియా, సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ వంటి పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చారు.. వాటితో ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేయడానికి నరేంద్రమోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. భేటీ బచావో – బేటీ పడావో అని నినాదమిచ్చారు.. మరి ఒక్క బేటీని అయినా బచాయించారా? ఒక్క బేటీ అయినా పడాయించారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలో దళిత, పేద మహిళలపై దాడులే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు బీజేపీ పాలనలో దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోని విధంగా రూపాయి విలువ రూ.83కి పడిపోయిందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ఇదీ భారతదేశ గౌరవం.. ఇది బీజేపీ పరిపాలన ఫలితమని విమర్శించారు. బీజేపీ పార్టీ ఏమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుద్ది.. కాంగ్రెస్ పార్టీ ఏమో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఓట్ల కోసం ఒట్లు పెట్టుకుంటుందని విమర్శించారు. ఒకడేమో ఓట్లు.. ఒకడేమో ఒట్లు ఇదేనా రాష్ట్రంలో జరుగుతుందని విమర్శించారు. భువనగిరి జిల్లాలో అద్భుతమైన యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించుకున్నాం.. కానీ ఏనాడైనా దాన్ని ఓట్ల కోసం వాడుకున్నామా? అని ప్రశ్నించారు. ఒకడొచ్చి బీజేపీకి బీఆర్‌ఎస్ బీటీమ్ అని కొంతమంది అంటున్నారని.. కానీ భువనగిరిలో ఏం జరిగిందని గుర్తుచేశారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయిపోయి.. బీఆర్‌ఎస్ చైర్మన్‌ను దించేశారని అప్పుడు కాంగ్రెస్ నుంచి చైర్మన్, బీజేపీ నుంచి వైఎస్ చైర్మన్ అయ్యారని చెప్పారు. మరి ఎవరికి ఎవరు బీ టీమ్ అని రెండు పార్టీలను ప్రశ్నించారు.

దేశంలో మోదీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది.. మహిళలకు రక్షణ లేదు.. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుంది.. ఇలా అనేక సమస్యలు ఉంటే, అదేమీ లేదన్నట్టుగా.. అక్షింతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి అన్నట్టుగా బీజేపీ తీరు ఉందని విమర్శించారు. ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతుందా? అని ప్రశ్నించారు. మన పొలాలకు నీళ్లను తీసుకొస్తుందా అని నిలదీశారు. ప్రతి బోర్‌కు మీటర్ పెట్టాలని.. లేదంటే నిన్ను పడగొడతా, నీ ఎమ్మెల్యేలను కొంటా అన్నట్టుగా మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని కేసీఆర్ గుర్తు చేశారు. నా తలకాయ తెగిబడ్డాసరే రాష్ట్ర ప్రజలకు కరెంటు కావాలి? మీటర్ పెట్టనని స్పష్టం చేశానని చెప్పారు. ‘ ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఏమంటారు.. మేం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పినా కూడా మాకే ఓటేసిండ్రు.. అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతారు’ అని కేసీఆర్ అన్నారు. అందుకే రైతులు ఆలోచించుకోవాలని సూచించారు. మోదీ వచ్చి రాగానే ఏడు మండలాలను తీసుకెళ్లి ఏపీకి ఇచ్చేశారని కేసీఆర్ తెలిపారు.

400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును తీసుకెళ్లి ఆంధ్రాకు అప్పజెప్పారని మండిపడ్డారు. మోదీ లేకుండా, బీజేపీ లేకుండా ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణకు బ్రహ్మాండంగా లాభం జరిగేదని అన్నారు. తెలంగాణ భారీగా నష్టపడ్డదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల అని వ్యాఖ్యానించారు. మళ్లీ సిగ్గులేకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆనాడు తప్పిపోయి ఓటేస్తే నలుగురు ఎంపీలుగా గెలిచారు. వీళ్లు ఒక్క రూపాయి పనైనా చేశారా? ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారని విమర్శించారు. ‘ మా వయసు మీరిపోతుంది.. ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీది.. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు.. పార్లమెంటులో ఏం జరుగుతుంది? ఎవరు గెలిస్తే మనకు మేలు జరుగుతుందనేది యువకులు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ చాలా నిజాయితీ పరుడు, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయంలో వచ్చారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి ప్రజలకు ఎంతో అభివృద్ధి చేశారు.

ఐన మీరిచ్చిన తీర్పును గౌరవించి ప్రజల పక్షాన నిలబడి పోరుబాట నడిపిస్తున్నాము. ప్రజల కోసం పోరాడేందుకు ప్రజల మద్దతు అవసరం అదే ముద్దతుతో మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో క్యామ మల్లేష్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, పోన్నల లక్ష్మయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఉమా మాధవరెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి, బుడిద బిక్షమ్మయ్య గౌడ్, జడల అమరేందర్ గౌడ్, జనగాం పాండు, ఆంజనేయులు, అమరేందర్, ర్యాకల శ్రీనివాస్, కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కేశవపట్నం రమేష్, బల్గూరి మధుసూదన్ రెడ్డి, జక్క రాఘవేందర్ రెడ్డి, సిలివేరు మద్దు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News