నేటి నుంచి మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ అధినేత
సిఎం కెసిఆర్ రెండ్రోజుల పర్యటన
పలువురు కీలక నేతల చేరికలు
రేపు పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
భారీ కాన్వాయ్‌తో బయల్దేరనున్న ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం
భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం నుంచి రెం డు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. తొలుత ఉస్మానాబాద్ జిల్లాలోని ఒమెర్గా చేరుకుంటారు. అక్కడ కార్యక్రమాల అనంతరం సోలాపూర్ బయల్దేరి వెళ్తారు. అక్కడ పలువురు కీలక నేతలు కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మంగళవా రం నాడు పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో సిఎం ప్రత్యేక పూ జలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన సిఎం కెసిఆర్ భారీ కా న్వాయ్‌తో మహారాష్ట్రకు బయల్దేరతారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నేతలు భారీ కాన్వాయ్‌గా తరలి వెళ్లనున్నారు.
మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి
మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధిష్టానం దృష్టి సారించింది. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారినప్పటి నుంచే మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. మహారాష్ట్ర నుంచే బిఆర్‌ఎస్ దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని.. అందుకు నాగపూరే సరైన వేదిక అని తొలి నాళ్లలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చెప్పేవారు. ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌లో పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్‌లోని సావ్‌ఖేడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బిఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.
మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ
బిఆర్‌ఎస్ పార్టీలో మహారాష్ట్ర క్రమంగా ఆదరణ పెరుగుతోందది. పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఇప్పటికే నాలుగుసార్లు మహారాష్ట్రలో పర్యటించారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో, మార్చి 14న కాంధార్ లోహాలో బహిరంగ సభలు నిర్వహించారు. మే 19న మరోసారి నాందేడ్‌లో పర్యటించి పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదనే ఆలోచన ప్రజల్లో కలిగించాలని అక్కడి నేతలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.