Monday, December 23, 2024

దక్షిణాదివాణి అణచాలని చూస్తే మౌనం వహించం

- Advertisement -
- Advertisement -

దక్షిణాదివాణి అణచాలని చూస్తే మౌనం వహించం
లోక్‌సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజాఉద్యమం వస్తుంది
ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: డీలిమిటేషన్(పునర్విభజన)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు డిమాండ్ చేశారు. దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజాఉద్యమం వస్తుందని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలం భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అని పేర్కొన్నారు. దక్షిణాదివాణి అణచాలని చూస్తే మౌనం వహించమని స్పష్టం చేశారు. కేంద్రం అన్ని విషయాలను వింటుందని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నామంటూ సోమవారం మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు డీలిటేషషన్‌పై ఓ జాతీయ పత్రిక ప్రచురించిన కథనాన్ని కెటిఆర్ ట్యాగ్ చేశారు. జాతీయ పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొన్న గణాంకాలే నిజమైతే ప్రజా ఉద్యమం తప్పదని మంత్రి స్పష్టం చేశారు.

దక్షిణాదిలో భారీగా తగ్గనున్న లోక్‌సభ స్థానాలు
దేశంలో ప్రస్తుత జనాభాను పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిథ్యం పెరుగనుండగా.. దక్షిణాది రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాలకు అదనంగా 32 స్థానాలు కలిసిరానుండగా.. దక్షిణాది రాష్ట్రాలు 24 స్థానాలను కోల్పోనున్నాయి. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం 39 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. డీలిమిటేషన్ తర్వాత 31కి తగ్గనున్నాయి. ఒక్క తమిళనాడు రాష్ట్రమే ఎనిమిది సీట్లను కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎనిమిది, కేరళ ఎనిమిది, కర్నాటక రెండు స్థానాలు కోల్పోనుండగా.. మధ్యప్రదేశ్‌లో నాలుగు, రాజస్థాన్‌లో ఆరు, బిహార్‌లో పది, ఉత్తరప్రదేశ్‌లో అదనంగా 11 స్థానాలు పెరిగే అవకాశం ఉంది.

ఏమిటీ డీలిమిటేషన్..?
జనాభా ప్రాతిపదికన దేశంలో, రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్. ఇది ఆయా రాష్ట్రాల్లో జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంట్‌లో, అసెంబ్లీలో సీట్లుండేలా చూసే ప్రక్రియ. మారుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఇది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News