క్రీస్తు పుట్టినరోజు పురస్కరించుకుని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు,కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు.యే నేరము చేయని తనను శిలువకెక్కిస్తున్న పాషాణ హృదయులను కూడా క్షమించమని ప్రభువును వేడుకున్న మహా త్యాగశీలి, అహింసావాది యేసు క్రీస్తు అని కెసిఆర్ కొనియాడారు. పాపులను సైతం క్షమించే ఓర్పు, సహనం, దార్శనికత మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన శాంతి మార్గం అని వ్యాఖ్యానించారు. విశ్వశాంతిని కాంక్షించే పరోపకారులైన ప్రతి ఒక్కరికీ యేసు బోధనలు అనుసరణీయమని,
ద్వేషంతో నిండిపోతూ రోజు రోజుకూ స్వార్థ పూరితమవుతున్న మానవ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రీస్తు కార్యాచరణ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. గంగా జమున సంస్కృతి ఫరిడవిల్లేలా, మత సామరస్యం వెల్లివిరిసేలా సర్వమత సమానత్వాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించి చూపిందని అన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ మైనారిటీలకు ఆనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా అమలు చేశామని, పలు కానుకలను అందిస్తూ క్రిస్మస్ పర్వదినాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని కెసిఆర్ గుర్తు చేశారు.