గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక స్వయంపాలనను అమలులోకి తెచ్చి, భారతదేశాన్ని సార్వభౌమాధికార, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా నిలుపుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏండ్లయిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్బంగా కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ అందించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లౌకిక వాద మౌలిక విలువలను అనుసరిస్తూ, స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతీ ఒక్కరం ప్రతినబూనుదామని పేర్కొన్నారు.
పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్య్ర ఫలాలు, దేశంలోని ప్రతి గడపకూ చేరిన నాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చినవారమవుతామని చెప్పారు. సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, మహిళలకు సమాన భాగస్వామ్యం దక్కేలా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ కలలుగన్న సమ సమాజ సాధనకు పాలకులు మరింత కృషి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు.కులం, మతం, ప్రాంతం, జెండర్ సహా ఎటువంటి వివక్ష లేకుండా మనుషులందరూ ఆత్మగౌరవంతో జీవిస్తూ సమాన హక్కులను పొందే దిశగా పౌరులుగా మన కర్తవ్యాన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ రాజ్యాంగం పటిష్ట అమలు కోసం ప్రతీ పౌరుడు కృషి చేయాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.