రైతు పండుగ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భోగీతో ప్రారంభమై మకర సంక్రాంతి, కనుమతో మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ అని, ఈ పండుగ వ్యవసాయాధారిత పల్లె సంస్కృతిలో ప్రత్యేకతను చాటుకుంటుందని పేర్కొన్నారు. పండిన పంటల రాశులతో ఇండ్లు కళ కళలాడుతుండగా, రైతు జీవితాల్లో సంక్రాంతి శోభ నిండుదనాన్ని సంతరించుకుంటుందని అన్నారు. రంగవల్లులతో, భోగి మంటలతో, గొబ్బెమ్మలతో, గంగిరెద్దుల ఆటలతో, పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ప్రకృతి పండుగ మకర సంక్రాంతి అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని,
పాడి పంటలతో రైతు కుటుంబాలు సంతోషాలతో నిండాలని, నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించిందని తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతాంశంగా నాడు అమలు చేసిన కార్యాచరణ, పదేండ్ల అనతికాలంలో సత్పలితాలనిచ్చిందని వివరించారు. అందులో భాగంగా.. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు, పంటకు పెట్టుబడిగా రైతుబంధు, రైతు కుటుంబానికి భరోసాగా రైతుబీమా వంటి పలు పథకాలను పటిష్టంగా అమలు చేశామన్నారు. తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలందుకుందని, దేశానికే ఆధర్శంగా తెలంగాణను నిలిపిందని గుర్తుచేసుకున్నారు.
బిఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయం పండుగలా మారింది
వ్యవసాయానికి దన్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నముకగా నిలిచిన కులవృత్తులకు, గతంలో లేని విధంగా నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం, సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభను నింపిందని కెసిఆర్ తెలిపారు. పదేండ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగాభివృద్ధికోసం ఖర్చు చేసిందన్నారు. రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢ సంకల్పంతో ముందుకు సాగామని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, బిఆర్‌ఎస్ హయాంలో పండుగలా మారిందని కెసిఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా, రైతన్న సంక్షేమమే ధ్యేయంగా, రాజీపడకుండా పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. తద్వారా రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూర్చినవారమవుతామని తెలిపారు. రైతన్న జీవితాల్లో వెలుగులు కొనసాగేలా దీవించాలని ప్రకృతిమాతను ఈ సందర్భంగా కెసిఆర్ ప్రార్థించారు.