మంత్రి నిరంజన్‌రెడ్డితో మాజీ మంత్రి వడ్డే చర్చలు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఏపికి చెందిన మాజీ మంత్రి వడ్డె శోభనాద్రేశ్వరావు మధ్య చర్చలు జరిగాయి. ఆదివారం మంత్రుల నివాసంలో వడ్డే మ్రంత్రి నిరంజన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇరువురి మధ్యన వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్రంలో రైతుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ తదితర పథకాలను మాజీ ఎంపి వడ్డెకు వివరించారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఈ సందర్బంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు అన్నారు. పంటల వైవిధ్యీకరణ తప్పని సరి అని ,వరిసాగునుండి పప్పుదనుసులు, అపరాలు , నూనెగింజ పంటల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. 198589 మధ్యకాలంలో నూనెగింజలు , అపరాలకు సాంకేతిక మిషన్ పథకం తరహాలో ప్రస్తుతం అపరాలు, పప్పుదినుసు, నూనెగింజ పంటల సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సాహించాలన్నారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి అధిక ధర పొందటానికి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళారైతు ఉత్పత్తి సంస్థలకు సహకారం అందించాలన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధరల విషయంలో అవలంబిస్తున్న లోపభూయిష్ట విధానాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. స్వామినాధన్ కమిటి సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తులకు సి2ప్లస్50 ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర లభించేలా చట్టబద్దత కల్పించినపుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఇతర రాష్ట్రాల సిఎంలను కలుపుకొని వ్యవసాయరంగంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అనుసరిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా ఉన్న నియమాలలో మార్పు తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావాలన్నారు.
అభివృద్ది చెందిన దేశాలకు అనుకూలంగా డంకెల్ డ్రాప్ట్ రచించుకుని ఆయా దేశాల ఉత్పత్తులకు అధిక ధరలు వచ్చేలా ఆయా దేశాల రైతులు లాభపడే విధంగా విధానాలు రూపొందించుకున్నట్టు తెలిపారు. భారత వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు మద్దతు ధర ఇవ్వొద్దని , మద్దతు ధర ఇచ్చే ఉత్పత్తులు కొనుగోలు చేయమని ,రైతులకు సబ్సిడిఈలు ఇవ్వోద్దని ఆంక్షలు విధిస్తున్నారన్నారు. దీనివల్ల దేశ వ్యవవసాయ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. అంతర్జాతీయంగా ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం రైతుల తరుపున పోరాడకుండా రైతుల నడ్డివిరిచే విధంగా కొత్త కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కార్పోరేట్ల కొమ్ముకాస్తు దేశ వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తుండడం దురదృష్టకరం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి ఈ అంశాలన్నింటిని తీసుకువెళ్లాలని మ్ంరత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. తానే స్వయంగా కలిసి వెల్లడించడానికి సమయం కుదరడం లేదని పైగా ఆరోగ్యం కూడా సహకరించడం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు పేర్కొన్నారు.