Wednesday, January 22, 2025

కెసిఆర్ ఉగ్రతాండవం….. బిజెపిపై రణభేరి

- Advertisement -
- Advertisement -

నాడు తెలంగాణ కోసం, నేడు దేశం కోసం ఉగ్రనరసింహావతారం
ఎనిమిదేళ్ల గంభీర సాగరం నేడు నిప్పుల సంద్రం
బిజెపి నేతల అవినీతి చిట్టాతో దేశమంతా విస్తృత ప్రచారం
ప్రైవేటేజేషన్‌పై కత్తి ఎత్తిన సిఎం
మోటార్లకు మీటర్లు పెట్టనంటూ కేంద్రానికి సవాల్
రాయగిరి అశేష జనవాహినిని ఉద్దేశించి మోడీపై కెసిఆర్ నిప్పులు

KCR Fire on BJP

ఎనిమిదేళ్లుగా ఎంతో శాంతంతో, సహనంతో ఉప్పెనలు, తుపానులెరుగని గంభీర సాగరం మాదిరిగా వున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై వున్నట్టుండి ఎందుకు ఉగ్రరూపం ధరించారు? భారతీయ జనతా పార్టీ తీరుపైన, ప్రధాని మోడీ పాలనపైన ఇలా అవిశ్రాంతంగా విరుచుకుపడడానికి కారణాలేమిటి? ఇటీవలి ఆయన స్వర తీవ్రతను గమనిస్తున్నవారందరినీ ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి. ముఖ్యమంత్రి వాగ్ధాటి అప్పుడే సానబట్టిన సునిశిత ఖడ్గాన్ని కూడా తలదన్నుతున్నది. మాటొక్క తూటాలా పేలుతున్నది. ముఖ్యమంత్రి కెసిఆర్ తన అస్త్రాలను నేరుగా ప్రధాని మోడీపైనే సంధిస్తున్నారు. ప్రజలు తనను దీవించి పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొడతానంటున్నారు.

మత పిచ్చితో దేశం సర్వనాశనం, కర్ణాటకను కాశ్మీరం చేశారు

మోడీని ఆ పీఠం మీది నుంచి తరిమి తరి మి కొడతామంటున్నారు. భారతీయ జన తా పార్టీ కరడుగట్టిన మతతత్వ పాలనతో దేశాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు. పెట్టుబడులు భయపడి వెనుకకు మళ్లిపోయేలా చేస్తున్నారన్నారు. కర్నాటకలో ముస్లిం ఆడ పిల్లలపై రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని కాషాయ మూకలపై విరుచుకుపడ్డారు. బిజెపి పాలనలో దేశంలో పదిహేను, పదహారు లక్షల పరిశ్రమలు మూ తపడ్డాయని, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో తాండవిస్తున్నదని విమర్శించారు.

మూడో కన్ను తెరచిన శివుడు

రైతుల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. మరొక్క మెట్టు పైకి వెళ్లి ‘మీ అవినీతి చిట్టా నా దగ్గరుంది, దేశమంతా తిరిగి వివిధ భాషల్లో ప్రచారం చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రోద్యమ సమయంలో ఆంధ్ర వలస పాలకులపైన, కేంద్రంపైన ఆయన ఇంతగా భగ్గుమన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ ఈ విధంగా మూడో కన్ను విప్పిన శివుడిని తలపించలేదు. కేంద్రంపై ఇప్పుడిలా విరుచుకుపడడానికి ఒకే ఒక్క కారణం కనిపిస్తున్నది. ఆనాడు రాష్ట్ర అవతరణ కోసం నిప్పులు చెరిగిన కెసిఆర్ ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి, దేశ ఫెడరల్ నీతికి ఎదురవుతున్న చెప్పనలవికాని ముప్పును అడ్డుకోడానికి, చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతుల గడ్డ అయిన తెలంగాణను మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల కుట్రల నుంచి కాపాడడానికి అనివార్యమై అస్త్రశస్త్రాలను ధరించిన అసమానయోధుడి రూపమెత్తారని స్పష్టపడుతున్నది.

ప్రభుత్వరంగం అదానీ, అంబానీ పరం

మోడీ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ జోరు దేశ ప్రజలను చేత చిల్లిగవ్వ లేని నిరుపేదలుగా మార్చివేస్తున్న దృశ్యం అందరి కళ్లముందు వున్నదే. ప్రభుత్వ రంగాన్నంతటినీ గుజరాత్‌కు చెందిన అదానికో, అంబానికో అప్పనంగా అప్పగిస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర వున్న భారతీయ రైల్వేలను ముక్కలు చెక్కలుగా చేసి ప్రైవేటు యాజమాన్యాల జేబుల్లో కుక్కడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పేద, మధ్య తరగతి ప్రజానీకం భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎల్‌ఐసి (జీవిత బీమా)ని ప్రైవేటుపరం చేయబోతున్నారు.

వ్యవసాయం కార్పొరేట్ మయం

పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడంటూ లేకుండా తుడిచిపెడుతున్న మోడీ ప్రభుత్వం గ్రామీణ జనాభాకు ప్రధాన ఉపాధి కల్పన రంగంగా వున్న వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యంలోకి పంపించడానికి చేసిన కుట్ర తెలిసిందే. పార్లమెంటులో చర్చకు కూడా అవకాశమివ్వకుండా తనకున్న మూక బలంతో ఆదరాబదరాగా శాసన రూపమిచ్చిన మూడు వ్యవసాయ చట్టాల గురించి తెలిసిందే. కనీస మద్దతు ధర రక్షణ కూడా లేకుండా చేసి కార్పొరేట్ల, వారి దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేయదలచిన ఈ మూడు క్రూర చట్టాలను రైతులు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో భీషణ పోరాటం చేసి రద్దు చేయించుకున్నారు. అప్పటికీ మోడీ ప్రభుత్వంలో పశ్చాత్తాపం కొంచెమైనా కనిపించకపోడం గమనించవలసిన విషయం.

మోటార్లకు మీటర్లతో రైతుకు ఉరి

రైతులను కాల్చుకు తినడానికి సిద్ధంగా వున్న విద్యుత్తు సంస్కరణల బిల్లు పులిలా కోరలు చాచుకొని వున్నది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి సాధారణ రైతుల మూలుగులను పీల్చడానికి సిద్ధంగా వున్న ఈ సంస్కరణలను రాష్ట్రంలో అడుగు పెట్టనీయబోనని ముఖ్యమంత్రి ఒకటికి రెండు సార్లు శపథం పూని చెబుతున్నారు.

మోడీని సాగనంపితేనే దేశానికి మంచి రోజులు

దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గం.లు విదుత్తును ఉచితంగా ఇస్తున్న ఖ్యాతిని కెసిఆర్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఇంకో వైపు కాళేశ్వరం వంటి అనితర సాధ్యమైన మెగా ఇరిగేషన్ ప్రాజెక్టును అతి స్వల్ప కాలంలో నిర్మాణం పూర్తి చేసి రైతులకు పుష్కలంగా పంట నీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందువల్ల వరిని పుష్కలంగా పండిస్తూ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా నిరూపించుకుంటున్నది. దీనిని ఓర్వలేక రాష్ట్ర రైతులు పండించే ధాన్య సేకరణను కేంద్రం మానుకున్నది. రైతు నోటి వద్ద ఆహారాన్ని హరించే అత్యంత నీచమైన పనికి ఒడిగడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే దేశానికి మంచి రోజులు వుండవని భావించిన కెసిఆర్ అందుకోసం ఉగ్ర నారసింహుడి రూపమెత్తడాన్ని ఏ విధంగా ఆక్షేపించగలం? నాడు రాష్ట్ర అవతరణ కోసం అపర రుద్రుడైన కెసిఆర్ నేడు దోపిడీ శక్తుల నుంచి కాపాడి దాని అభివృద్ధికి తన బాహువులను కవచాలుగా చేయడం కోసం కేంద్రంపై నిప్పులు కురుస్తున్నారు. ప్రజల ఆశీస్సులు ఈ లక్ష్యంతో ఆయన తప్పని సరిగా విజయం సాధిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News