Thursday, January 9, 2025

కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండట!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ : కాం గ్రెస్ అడ్డగోలు హామీలు చూసి మోసపోతే తెలంగాణ ప్రజలకు మళ్లీ గోస వచ్చిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు ఆరోపించారు. ఎన్నికల బరిలో ఉన్న మరో పార్టీ బిజెపి సైతం చాలా ప్రమాదకరమని, మ తం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే ఆ పా ర్టీ అజెండా అని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు పడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిండని.. ఈ చేతగాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని బిఆర్‌ఎస్ అధినేత మండిపడ్డారు. మనకు ఉన్న ఒకే ఒక నది..

మన బతుకుదెరువు. నేడైనా.. రేపైనా భవిష్యత్తులోనైనా గోదావరి నదే అని, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతుకోసి గోదావరి నది ఎత్తుకుపోతా.. తమిళనాడుకు, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతున్నడు అని విమర్శించారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హన్మకొండలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కెసిఆర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు చూసి మోసపోతే తెలంగాణ ప్రజలకు మళ్లీ గోస వచ్చిందని దుయ్యబట్టారు. ఒకామే ఏరికోరి మొగుణ్ణి తెచ్చుకుంటే వాడు ఆమెని ఎగిరెగిరి తన్నిండట…అట్లనే ఉంది కాంగ్రెస్‌ను తెచ్చుకున్నాక అని కెసిఆర్ విమర్శించారు. రైతుబంధు వచ్చిందా అంటే జనమే చెప్తున్నారు రాలేదని, అయ్యా ముఖ్యమంత్రి ఒక్కసారి జనం ఏం అంటున్నారో విను అని కోరారు.

ముఖ్యమంత్రి కుయ్యిలేదు కయ్యిలేదు..
గోదావరి నదిని నేను తీసుకొనిపోతా అని బాజాప్తా ఓట్లుపడే సమయంలో నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిడు అని కెసిఆర్ పేర్కొన్నారు. ఆయనేమే ఎత్తుకుపోతాంటడు… ఈ చేతగాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉన్నది… ఇందులో మతలబేంది..? అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ఎత్తుకుపోతా అని రాష్ట్ర ప్రభుత్వానికి బాజాప్తా పంపిండు… ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యిలేదు కయ్యిలేదు… ఏమానుకోవాలి దీన్ని అని అడిగారు. ఇంతకుముందే కృష్ణా నదిని తీసుకుపోయి కెఆర్‌ఎంబికి అప్పజెప్పిండు అని, ఇవాళ గోదావరి ఎత్తుకుపోతాంటే మూతిముడుసుకొని కూర్చున్నరు… ఏం కారణం..? దాన్ని ఎవరు కాపాడాలి..? అంటూ ప్రశ్నించారు.

మీరిచ్చే బలంతోనే కొట్లాడేది..
రైతుబంధు పోయిందా..? కరెంటు బంద్ అయ్యిందా..? కోతలు వచ్చినయా..? వడ్లు కొంటున్నరా..? బోనస్ ఇస్తున్నారా..? బోనస్ బోగస్ అయ్యిందా..? ఇవన్నీ మోసాలు చేసిన తర్వాత గోదావరి ఎత్తుకుపోతా అనే బిజెపికి గానీ.. వాగ్ధానాలను భంగం చేసిన కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మేం అన్నీ మోసం చేసినా.. మళ్లీ మాకే ఓటేశారని అన్నీ పండవెడుతరని కెసిఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్‌కు పంచాయితీ పడ్డది అని, ప్రజల తరఫున పోరాడేది బిఆర్‌ఎస్సే అని స్పష్టం చేశారు. కొట్లాడుదామా..? యుద్ధం చేద్దామా..? గోదావరిని కాపాడుకుందామా..? కృష్ణాను కాపాడుకుందామా..? మళ్లీ బిఆర్‌ఎస్ గవర్నమెంట్‌లాగా రైతుబంధు ఇచ్చుకుందామా..? కంటి నిండా కరెంటును తెచ్చుకుందామా..? అని అడిగారు. ఇది జరగాలంటే సుధీర్‌కుమార్ గెలవాలని, మీరు నాకిచ్చే బలంతోనే కదా..? కొట్లాడేదని ప్రజలనుద్దేశించి కెసిఆర్ వ్యాఖ్యానించారు.

బిజెపి ప్రమాదకరమైన పార్టీ..
ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఇంకొక పార్టీ బిజెపి పార్టీ అని, అది చాలా ప్రమాదకరమైన పార్టీ అని, దానికి ఎంతసేపు పంచాయితీలు పెట్టించుడు.. విద్వేషం తప్పా.. బిజెపి ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు అని కెసిఆర్ పేర్కొన్నారు. యువకులు వెర్రి ఆవేశం కాదు.. పిచ్చి ఆవేశం కాదు. ఈ దేశం మీది… ఈ రాష్ట్రం మీది. రేపటి భవిష్యత్ మీది… ఈ విషయాలను ఊర్లు, బస్తీలు, గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరారు. బిజెపి ఎజెండాలో ప్రజల కష్ట సుఖాలు ఉంటాయా..? మోదీ వంద నినాదాలు చెప్పారు. బేటీ బచావో.. బేటీ పడావో… ఎక్కడన్న ఏమైనా వచ్చిందా..? అని ప్రశ్నించారు. జన్‌ధన్ యోజనలో ఎవరి బ్యాంకులకైనా డబ్బులు వచ్చినయా..? విదేశాలకెళ్లి నల్లధనం తెస్తా.. ఇంటికి రూ.15లక్షలు ఇస్తా అన్నారు..మరి ఇచ్చిండా..? అని అడిగారు.అమృత్‌కాల్ వచ్చిందా..? అచ్చేదిన్ వచ్చిందా..? …అచ్చేదిన్ రాలేదు కానీ, సచ్చేదిన్ వచ్చిందని విమర్శించారు.

మోదీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ ఎత్తుకుపోయిండు..
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తే.. దాన్ని ప్రధాని గుజరాత్‌కు ఎత్తుకుపోయిండని కెసిఆర్ ఆరోపించారు. కాజీపేటకు వచ్చేదాన్ని గుజరాత్‌కు తీసుకుపోయాడని విమర్శించారు. అధేవిదంగా గిరిజన విశ్వవిద్యాలయం పదేళ్ల నుంచి వందసార్లు అడిగితే మొన్న ఎలక్షన్లకు ముందు కాగితం ఇచ్చారని, పదేళ్లు పడతదా ప్రధానమంత్రికి..? అని అడిగారు. ధరల పెరుగుదల, రూపాయి విలువ రూ.83కి పడిపోయిందని, ఏ హామీ నెరవేరలేదని మండిపడ్డారు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా కేంద్రంలో ఒక్కదాన్ని నింపరు అని పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ మీద బతికే వేల మంది రోడ్లపై పడ్డారు
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుండే అని కెసిఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు డౌన్ అయ్యిందా..? పెరిగిందా..? అంటూ ప్రజలకు అడగగా, బంద్ అయ్యింది అంటూ జనం నినదించారు. అందులో బతికే వేల మంది ఇవాళ రోడ్లపై పడ్డారని అన్నారు. హైదరాబాద్, పెద్దపెద్ద నగరాల్లో గత ఐదునెలలుగా పర్మిషన్లు ఇస్తలేరని, పర్మిషన్లు ఇవ్వకపోవడానికి కారణం ఏందీ..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మనం టిఎస్ బిపాస్ తీసుకువచ్చామని, అప్లికేషన్ పెడితే 21 రోజుల్లో ఆటోమేటిక్‌గా పర్మిషన్ ఇవ్వాలి అని..అది చట్టం అని పేర్కొన్నారు. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వేరే రాష్ట్రాల్లో ఉన్నట్లుగా స్వ్కేర్ ఫీట్ ఇంత అని కాంగ్రెస్ పార్టీకి లంచం ఇవ్వాలట అని, దాని కోసం మొత్తం ప్రగతిని ఆపేసి.. అభివృద్ధిని ఆపేసి పర్మిషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పూర్తయిన బిల్డింగ్‌లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ బండారం బయటపెడతామని హెచ్చరించారు.

మూడు నెలల్లో ఘన్‌పూర్ ఎంఎల్‌ఎగా రాజయ్య
మరో మూడు నెలల్లో తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతుందని.. ఆ ఉప ఎన్నికల్లో దళిత నాయకుడైన తాటికొండ రాజయ్య ఘనపూర్ ఎంఎల్‌ఎగా గెలవబోతున్నాడని కెసిఆర్ జోస్యం చెప్పారు. ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చాం.. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం… ఇప్పుడు ఎందుకు పార్టీ మారిపోయిండు..? అని కెసిఆర్ ప్రశ్నించారు కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నాడని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఇంకో మూడునెలల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదు అని, మన రాజయ్య ఎంఎల్‌ఎ కాక తప్పదు అని వ్యాఖ్యానించారు. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే అని అన్నారు.
కెసిఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా?
కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని హామీలు ఇచ్చారు.. అమలు చేస్తలేరని అని బిఆర్‌ఎస్ ప్రతినిధులు అసెంబ్లీలో అడిగితే కెసిఆర్ గుడ్లుపీకి గోళీలు ఆడుకుంటా.. నీ పేగులు తీసి మెడలో వేసుకుంట.. ఆఖరికి నీ ముడ్డిమీది చెడ్డి కూడా గుంజుకుంట అని సిఎం రేవంత్‌రెడ్డి అంటున్నడని అన్నారు. తాను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న.. తన నోట ఇలాంటి మాట విన్నరా..? అని అడిగారు. కెసిఆర్ నిన్ను చర్లపల్లి జైలులో వేస్తా..? అని అంటున్నాడని, జైళ్లకు తోకమట్టకు నేను భయపడుతనా..? అని ప్రశ్నించారు. కెసిఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా..? అని అడిగారు. ఎన్ని దెబ్బలు తిన్నం… ఎన్ని నిరాహార దీక్షలు చేశాం…ఎన్ని రాజీనామాలు చేశాం… ఎన్నిసార్లు పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేసినం.. గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా..? అని ప్రశ్నించారు.

తెలంగాణ పునర్నిర్మాణం మిగిలే ఉన్నది..
తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలే ఉన్నదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇంకా చాలా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.. అభివృద్ధి అంటే ఎట్ల ఉంటదో వరంగల్‌లో కట్టిన ఆసుపత్రే నిదర్శనమని అన్నారు. ఆకాశమంత ఎత్తున ఇవాళ అందరికీ కనిపిస్తున్నదని, అలాంటి ప్రతిభ ముందుకుపోవాదని చెప్పారు. అలాంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్ర ముందుకు దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బిఆర్‌ఎస్ పార్టీ గెలవాలని అన్నారు. మే 13 వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలని, చైతన్యం ఉన్న ఈ వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News