Saturday, November 23, 2024

మరో సమరానికి సన్నద్ధం

- Advertisement -
- Advertisement -

KCR fires on Modi for the third day in row

జాతీయస్థాయిలో దశ దిశ నిర్దేశానికి కెసిఆర్ అడుగులు
అస్త్రశస్త్రాలతో మరో చరిత్రకు రంగం సిద్ధం, మోడీపై
సాధికారికంగా మూడోరోజూ కెసిఆర్ నిప్పులు, అవసరమైతే
కొత్త పార్టీకి రె‘ఢీ’… దేశంలో సమగ్ర పరివర్తనకు చైనా,
సింగపూర్ విధానాలు రావాలి

(మిట్టపల్లి శ్రీనివాస్)
గులాబీ దళపతి మరో సమరానికి సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. జనగామ, రాయగిరి సభల్లో అవసరమైన అంశాలకే పరిమితమైన కెసిఆర్ ఆదివారంనాడు సుమారు రెండు గంటల పాటు జరిగిన మీడియా సమావేశంలో కేంద్రం, బిజెపిపై దాడిని సాధికారింగా ఉధృతం చేశారు. కాంగ్రెస్ పార్టీపై కఠిన వైఖరిని అవలంభిస్తూనే రాహుల్‌పై అసోం సిఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొంత సానుభూతిని ప్రదర్శించినా ఈ సందర్భాన్ని కూడా బిజెపిపై విమర్శల దాడికే వాడుకున్నారు. కేంద్రంపై రాజకీయ పోరునే కాకుండా న్యాయపరమైన యుద్ధానికి కూడా సిద్ధమైనట్లు ఆయన రఫేల్ ఒప్పందంపై చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు సాగిస్తున్న కెసిఆర్ ఆదివారం రఫేల్ కుంభకోణంపై కేసు వేస్తామని ప్రకటించడం కేంద్రంపై ఆయన బహుముఖ పోరుకు సిద్ధమైనట్లుగా అర్థమవుతోంది. నాడు తెలంగాణ కోసం యుద్ధం ప్రకటించి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన రీతిలోనే విభిన్నంగా జాతీయ అంశాలను లేవనెత్తుతూ దేశంలో మరో యుద్ధానికి టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అస్త్రశస్త్రాలతో సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ముందు వివిధ రంగాల నిపుణులతో మేధోమథనాన్ని ఎలా నిర్వహించారో అదే రీతిలో దేశంలో మార్పు కోసం తెరవెనక కసరత్తును పూర్తి చేసినట్లుగా విలేకుల సమావేశం నిరూపించింది. నాటి ఉద్యమంలో లక్షలాది ప్రజలను కదిలించిన రీతిలోనే దేశ ప్రజలను కదిలించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా విలేకరుల సమావేశం రుజువు చేసింది. ఉమ్మడి పాలనలో తెలంగాణ ఎలా దగాకు గురైందో ఇప్పుడు దేశం కూడా ఎన్‌డిఎ పాలనలో ఎలా భ్రష్టుపట్టిందో తెలియజేయడానికి కూడా ఆయన పరిశోధన, పరిశీలనను ఆలంబనగా చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. దేశంలో సంచలనం సృష్టించిన రాజ్యాంగం మార్పు అనే ప్రశ్నకు ఆయన రాజకీయ పరిణతితో ఇచ్చిన సమాధానాలు విశ్లేషకులను ఆశ్చర్యపరచగా, విమర్శకుల నోళ్లు మూయించింది. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో సకల రంగాలు అథోపాతాళానికి చేరిన నేపథ్యంలో దేశంలో సమగ్ర పరివర్తనకు సమయం ఆసన్నమైందని కెసిఆర్ ఆదివారం నాటి విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

పక్కా సమాచారంతో కార్యాచరణ..

కెసిఆర్ విలేకరుల సమావేశం మునుపటికన్నా భిన్నంగా అసాధారణంగా కొనసాగింది. పుస్తకాలు, డాక్యుమెంట్లు, వీడియోలు వంటి ఆధారాలు చూపిస్తూ మోడీ పాలనను సిఎం ఎండగట్టారు. మోదీ అధ్వాన్న పాలన తీరును వివరించడానికి ఆయన కొన్ని పుస్తకాలను, డాక్యుమెంట్లను, మొబైల్ ఫోన్‌లో మోదీ ప్రసంగాల దృశ్యాలను ఈ సందర్భంగా సాధికారికంగా ప్రదర్శించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలనే మోదీ కుట్రకు నాంది పలికిన విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లు ప్రతిని, ఆ తర్వాత ముసాయిదాకు ఆమోదం లభించకముందే అమలు చేసిన రాజ్యాంగ ఉల్లంఘనలను సూటిగా ప్రశ్నిస్తూ విలేకరుల సమావేశం సాగింది. ముఖ్యంగా స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు రాసిన ‘ఐయామ్ ఏ ట్రోల్‌” అనే పుస్తకం ద్వారా సోషల్ మీడియాలో బిజెపి ఎలాంటి అరాచకాలకు పాల్పడుతుందో కెసిఆర్ ఎండగట్టారు. దేశంలో బ్యాంకులను ముంచిన 33 మంది ఆర్థిక నేరగాళ్ల విదేశీ బహిరంగ అజ్ఞాతాన్ని తెలియజేసే డాటాను ఆయన విలేకరులకు అందజేశారు.ఫ్రాన్స్, ఇండియా మధ్య జరిగిన రఫేల్ ఫైటర్ జెట్‌ల కొనుగోళ్లలో జరిగిన కుంభకోణాన్ని వివరించిన డాక్యుమెంట్‌లు, చౌకీదారు దొంగ అని మళ్లీ నిరూపితమైందనే డాక్యుమెంట్‌ను, అమెరికాలో ట్రంప్ అనుకూల ఎన్నికల ప్రచారానికి వెళ్లి మోదీ చేసిన ప్రసంగ వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఇంకా విలేకరుల సమావేశంలో “ఇండియాస్ స్టాల్డ్‌రైజ్‌”, “ప్రెయిజ్ ఆఫ్‌ద మోదీ ఇయర్స్‌” అనే విశ్లేషణాత్మక వ్యాసాలు, పుస్తకాల వివరాలను అందజేయడం ద్వారా కెసిఆర్ తనదైన సాధికారిక పరిశోధన ఎలా ఉందో వివరంగా విలేకరుల ముందు ఉంచారు.

రాజ్యాంగంపై వ్యాఖ్యల విమర్శలకు దీటైన జవాబు..

ప్రత్యేకించి రాజ్యాంగ మార్పుపై తాను ఇప్పటికీ ఎందుకు కట్టుబడి ఉన్నానో తెలియజేసిన వివరాలు అన్ని వర్గాలను కదిలించాయి. సామాజిక న్యాయం కోసమే తాను రాజ్యాంగంలో మార్పు చేయాలని డిమాండ్ చేస్తున్నానని పునరుద్ఘాటించారు. 19 శాతం దాకా పెరిగిన దళితుల జనాభాకు అనుగుణంగా 19శాతం రిజర్వేషన్లు అవసరం లేదా? బిసిల కులగణన డిమాండ్ న్యాయం కాదా? మహిళలకు సమగ్ర రక్షణ అక్కర్లేదా? రాష్ట్రాల హక్కులను హరించే కేంద్రం నియంతృత్వ పోకడలకు కళ్లెం వేయాల్సిన అవసరం లేదా? వీటి కోసమే తాను రాజ్యాంగాన్ని మార్చాలని చర్చకు తెరతీశానని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా మార్పులకు అనుగుణంగా సవరణలు చేసుకోవచ్చునని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ తన వాదనకు బలం చేకూర్చుకున్నారు. అవసరమైతే దేశవ్యాప్తంగా కొత్త పార్టీ ఏర్పాటుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో మార్పు కోసం తెలంగాణ సమాజాన్ని కదిలించిన రీతిలోనే యావత్ దేశ ప్రజలను కదిలించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కెసిఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.

కేంద్రం విధానాలపై, మోదీ పరిపాలన తీరుపై విమర్శల జడివాన కురిపించిన కెసిఆర్ రాజ్యాంగం మార్పు నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ, విద్యుత్, బ్యాంకింగ్ రంగాలు ఎన్డీయే పాలనలో భ్రష్టు పట్టిన తీరును ఆయన అనేక డాక్యుమెంట్లతో ప్రజల ముందుంచారు. ఎన్డీయే పాలన దేశాన్ని తిరోగమనంలో పయనింపజేయడమే కాకుండా.. అవినీతిని, మతపిచ్చిని ప్రబలంగా మార్చిందని ఆయన బిజెపిపై విరుచుకుపడ్డారు. కేంద్రానికి సంబంధించిన అనేక అవినీతి కుంభకోణాల చిట్టా తన దగ్గర ఉందంటూ రఫెల్ డీల్ వెనుక జరిగిన కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నట్లు ప్రకటించడం ద్వారా న్యాయపరంగా కూడా కేంద్రాన్ని ఎదుర్కొవడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

సవాల్‌కు ప్రతి సవాల్..

తనను జైలుకు పంపిస్తామంటూ బిజెపి రాష్ట్ర నేతలు తరచూ చేస్తున్న ప్రకటనలపై కెసిఆర్ దీటుగా స్పందించారు. ‘దమ్ముంటే నన్ను జైల్లో వేయండి. నన్ను కాదు మిమ్మల్ని జైల్లో వేయడానికి అవినీతి చిట్టా అంతా రెడీ చేస్తు న్నా’ అంటూనే భయపడను, బెదరను అని ఇక్కడి బిజెపి నేతలతో పాటు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలకు కూడా ప్రతి సవాల్ విసిరారు. చైనా, సింగపూర్ తరహా విధానాలతోనే దేశం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, వసతులు, వనరులు, యువశక్తి అధికంగా ఉన్న దేశం ఆర్థికంగా అమెరికాను మించి ప్రబలశక్తిగా అవతరించే అవకాశం ఉందని ఆయన సాధికారికంగా అనేక గణాంకాలతో దాదాపు రెండు గంటల పాటు సాగిన విలేకరుల సమావేశం లో ప్రకటించారు. లాక్‌డౌన్‌తో దేశంలోని పరిశ్రమలను, సంస్కరణలతో విద్యుత్, వ్యవసాయ రంగాలను తిరోగమన బాట పట్టించడంలో మోదీ పాలన నెంబర్‌వన్‌గా నిలిచిందని ఆ వివరాలను ఆయన అందించారు. “బిజెపి మస్ట్ గో ఫ్రం కంట్రీ” అనే నినాదంతో ఆయన బిజెపికి చరమగీతం పాడితేనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు. గవర్నర్‌ల వ్యవస్థపై, బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా ఆయన సాధికారికంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశంలో 33 మంది బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నవారిలో సగం మంది మోదీ దోస్తులేనని కెసిఆర్ ప్రకటించారు. గవర్నర్ల వ్యవస్థలో మార్పులు వస్తేనే కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఫెడరల్ స్ఫూర్తిగా మెరుగుపడతాయని కెసిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News