Friday, February 21, 2025

బిఆర్‌ఎస్ దే మళ్లీ అధికారం

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 27న బిఆర్‌ఎస్ భారీ బహిరంగసభ ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బిఆర్‌ఎస్ కాదు పార్టీని
బలోపేతం చేయడానికి దృష్టిసారిస్తాం ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు అక్టోబర్, నవంబర్‌లో పార్టీ
అధ్యక్షుడి ఎన్నిక ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో పార్టీ ప్రతినిధుల సభ ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాలు కమిటీల
ఇన్‌చార్జిగా హరీశ్‌రావు నియామకం కాంగ్రెస్‌కు తొత్తుగా మారిన కమ్యూనిస్టులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
విఫలమైంది పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతోంది ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతున్నది.. ఇక
లేవదు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంవిఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని, పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోంద ని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యకవర్గ సమావేశం జరిగింది. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీ నరీ అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సు దీర్ఘ ప్రస్థానంపై కేసీఆర్ మాట్లాడారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. బిఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని, ప్రజల కష్టాలు బిఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసన్నారు. పాతికేళ్ల స్ఫూ ర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఏడాది పొడవునా బిఆర్‌ఎస్ రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని, ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ ప్రతినిధుల సభ. రజతోత్సవ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఇక నుంచి దృష్టి సారిస్తామని, ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉంటుందని కెసిఆర్ వెల్లడించారు.

ఏప్రిల్ 10 నుంచి సభ్యత్వ నమోదు : ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు ఉంటుందని, ఆ తర్వాత సంస్ధాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని కెసిఆర్ వెల్లడించారు. అక్టోబరు, నవంబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బిర్‌ఎస్ కాదని, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అని పునరుద్ఘాటించారు. ప్రజల్లో ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేవదని స్పష్టం చేశారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పటిష్టంగా నిర్మించాలని, పార్టీ, ప్రజల శాశ్వత విజయం కోసం పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

పార్టీ మారిన స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం : ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని, రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని..సిద్దంగా ఉండాలని యువ నేతలకు బీఆర్‌lఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో మళ్లీ మనదే అధికారం..మీరే ఎమ్మెల్యేలు..భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయాలని కేసీఆర్ కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆదాయం పెంచుకుంటూ పోయామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందన్నారు. అప్పటి అధికారులే ఇప్పుడూ ఉన్నారని, అయినా ఈ ప్రభుత్వానికి పనిచేయించుకోవడం రావడం లేదని కేసీఆర్ విమర్శించారు.

పార్టీ నేతలపై కేసీఆర్ ఆగ్రహం : ప్రజలకోసం పోరాటం చేయగల పార్టీ బీఆర్‌ఎస్ ఒక్కటే అని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2028లో అధికారంలోకి వచ్చేది 100 శాతం తామే అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోగానే స్వంత పార్టీ నేతలు నైరాశ్యం చెందారని, పార్టీలో ఉంటూనే నెగెటివ్ ప్రచారం చేశారని గులాబీ బాస్ మండిపడ్డారు. ఓడిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయిందని భావించక్కర్లేదని, అలా అనుకుని పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ : ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో వ్యవస్థాగత కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పార్టీలో విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలన్నారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి, ఆయా కమిటీలకు ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావు ను నియమిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి జిల్లాలో చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 10న బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించి పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చిస్తామని కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్‌కు తొత్తుగా మారిన కమ్యూనిస్టులు : కమ్యూనిస్టులపై కెసిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కమ్యూనిస్టులు అధికార పార్టీతో అనుసంధానమై, ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యతను విస్మరించి కాంగ్రెస్‌కు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. ఈ సమావేశంలో కేసీఆర్, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ పడిన కష్టనష్టాలను వివరించారు. టీడీపీ ఎన్టీఆర్ కాలంలో ఉన్న పరిస్థితులను గుర్తుచేశారు.

నీటివాటాలో రాష్ట్రానికి అన్యాయం : నీటివాటాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కెసిఆర్ ఆరోపించారు. చంద్రబాబు ఏపీకి నిధులు ఎక్కువగా తీసుకుపోతున్నారని, కృష్ణా జలాలు ఏపీ తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని విమర్శించారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేదని, తెలంగాణకు జరుగుతున్న నష్టం ప్రజలకు అర్థమవుతోందని, ప్రజలను జాగృతం చేసి రాష్ట్రానికి రక్షణగా ఉంటామని పునరుద్ఘాటించారు. ఈ తెలంగాణ శతాబ్దాల గోస కు ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పెట్టలసిందే నని గట్టి నిర్ణయం తీసుకుని ఒక్కడిగానే బయలుదేరానని, నాడు 2000 సంవత్సరం నుండి మొదలైన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నేటికి 25 ఏళ్లకు చేరుకుందన్నారు. తెలంగాణ సాధన ద్వారానే మన కష్టాలు తీరుతాయని, తాను టీఆర్ ఎస్ పార్టీ పెట్టిన నాడు నాకు ఆఫీస్ కూడా దొరకనివ్వలేదని, కొండా లక్షణ్ బాపూజీ తన నివాసం జలదృశ్యం లో ఆఫీస్ ఇస్తే దానిని నాటి తెలంగాణ వ్యతిరేక చంద్రబాబు ప్రభుత్వం కూల్చి వేసిందన్నారు. తెలంగాణ సమాజం తన చారిత్రక అవసరం దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ నాటి టీ ఆర్ ఎస్ నేటి బి ఆర్ ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.

అట్లా పురుడుపోసుకున్న బిడ్డను నలిపివేయాలని ఎన్నో కుట్రలు సాగాయని, ఇప్పుడదే చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణలో ఏదో రూపంలో అడుగు పెడుతానంటున్నారని, ఇప్పుడు తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికావద్దన్నారు. గతం గాయాలనుంచి కోలుకుంటున్నామని, తిరిగి వలస వాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. అలా జరుగకుండా తెలంగాణకు శాశ్వతంగా న్యాయం జరగాలంటే మనం ప్రజలను తిరిగి చైతన్యం చేయాలని, తెలంగాణకు రక్షణ కవచం బిఆర్‌ఎస్ పార్టీనే అని, ఆ బాధ్యత ప్రతి బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త మీద ఉందన్నారు. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు బాధలను పూర్తిగా తొలగిపోయేలా… స్వేచ్ఛవాయువులు పీల్చుకునే విధంగా, తెలంగాణ తనకు తాను నిలబడాలని పుట్టిందే మన పార్టీ అన్నారు. అటువంటి చారిత్రక పాత్రను పోషించడానికి సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సంసిద్ధులు కావాలని, అందుకు లోతైన చర్చ కోసం నిర్వహిస్తున్నదే ఈ ప్రత్యేక సమావేశమని తెలిపారు.

డీ లిమిటేషన్ తరువాత మహిళలకు 53 సీట్లు : నియోజకవర్గాల పునర్విభజన తరువాత అసెంబ్లీ స్థానాలు 160కి చేరుతాయని, అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని కెసిఆర్ వెల్లడించారు. త్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయని, శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇపుడు అభివృద్ధిలో వెనక్కి పోతోందని, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను ఆ స్థితికి తీసుకెళుతున్నారన్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు హాజరయ్యారు. కాగా ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ ప్రత్యేక ఆహ్వానితునిగా హజరయ్యారు. మధ్యాహ్నం ప్రారంభమైన సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు సాగిన ప్రసంగంలో తెలంగాణ చారిత్రక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిణామ క్రమాన్ని కేసీఆర్ వివరించారు. రాజుల కాలం నుండి నిజాం రాజుల దాకా రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాలు అవి ప్రజల్లో పెంచిన చైతన్యం గురించి కెసిఆర్ వివరించారు.

పాస్‌పోర్టు రెన్యువల్ చేయించుకున్న కెసిఆర్ : అంతకు ముందు కెసిఆర్ సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ వస్తూ సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్ పాస్‌పోర్టును అప్పగించి సాధారణ పాస్‌పోర్టును రెన్యువ్ చేయించుకున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి చేరుకుని కాసేపు సేద తీరిన అనంతరం బిఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News