శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి, సత్తా చూపించాలనే పట్టుదలతో వ్యూహం రచిస్తోంది. ఇందులోభాగంగా లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీలోని సీనియర్ నేతలకు కేసీఆర్ కీలకమైన బాధ్యతలను అప్పగించారు.
శాసనసభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన కేటీఆర్, హరీశ్ రావులతోపాటు మరికొందరు సీనియర్లకు కూడా బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు సీనియర్ నేతలతో ఆయన ఒక కోర్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలను సభ్యులుగా చేర్చారు. లోక్ సభ నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ తలపెట్టిన సన్నాహక సమావేశాలకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను కోర్ టీమ్ కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు.