Thursday, January 23, 2025

మేలైన విద్యుత్ అందిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం నాల్గవ రోజున విద్యుత్ దినోత్సవాన్ని సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక మాధురి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మేలైన విద్యుత్‌ను కెసిఆర్ ప్రభుత్వం అందిస్తుందని సమస్య లేకుండా నివారించగలిగారని, తొమ్మిది సంవత్సరాల్లో విద్యుత్తుకు సంబంధించి సాధించిన ప్రగతి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.

ఒకప్పుడు రోజు మొత్తం మీద నాలుగు నుండి ఐదు గంటల కరెంటు ఉంటే గొప్ప అని, ఇప్పుడు 24 గంటల విద్యుత్తు సరఫరా అవుతుందని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రగతి అని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి 75 శాతం బొగ్గు అవసరమని ఆయన తెలిపారు. మన ప్రాంతంలోని సత్తుపల్లి విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన వనరుల విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ పథకాలపై రైతులలో అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సంబంధించి నలుగురు, ఐదుగురు రైతులు కలిస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. రూ.75 వేల సబ్సిడీ పోను రైతుపై ఐదు నుంచి పదివేలు రూపాయలు మాత్రమే భారం పడుతుందన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు వంటి విషయాలు సులభం అవుతాయన్నారు. గిరి వికాస్ పథకం గురించి గిరిజనుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకం ద్వారా త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయవచ్చన్నారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్, మోటర్, పవర్ లైన్ వంటి సదుపాయాలు కల్పించవచ్చన్నారు. పాత పథకాల గురించి వివరిస్తూనే కొత్త పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, చిమ్మ చీకట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగు జిలుగుల కాంతుల నడుమ ముందుకు తీసుకెళుతున్నది విద్యుత్తు శాఖ అని అన్నారు.

తుఫాను వచ్చిన, గాలి దుమ్ము వచ్చిన, వర్షం వచ్చిన విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలు అమోఘం అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం యొక్క ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి ప్రణాళికబద్ధంగా ప్రగతి పథంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా తెలంగాణ రాష్ట్ర ప్రగతి అని అన్నారు. రైతాంగానికి త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం అందిస్తున్నట్లు ఆయన అన్నారు. విద్యుత్ సరఫరాకు ఎనలేని సేవలు అందిస్తున్న విద్యుత్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని అన్నారు. దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో , ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News