Wednesday, January 22, 2025

దశాబ్దాల కల నెరవేరింది..

- Advertisement -
- Advertisement -

గద్వాల: నడిగడ్డ ప్రాంత ప్రజల చిరకాల కోరిక విద్య, వైద్య రంగాలలో జిల్లా అభివృద్ధి చెందిందని, దశాబ్దాల కల సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వీఎం అబ్రహంలు అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గద్వాల పట్టణ పురవీధులలో కొనసాగింది. అనంతరం పాతబస్టాండు రాజీవ్‌చౌక్‌లో సీఎం కేసీఆర్, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చిత్రపటాలకు పాలాభీషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ బతుకమ్మ ఆట పాటలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఎమ్మెల్యేలు బతుకమ్మ పాటలకు విద్యార్థినిలతో కలిసి సరదాగా స్టెపులు వేశారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో వైద్యవిద్య చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్నారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో 100శాతం సీట్లు స్థానికులకే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలలో ఎక్కువ లబ్ది కలిగిస్తుందన్నారు. తెలంగాణ విద్యార్థులు తల్లిదండ్రులను వదిలి విదేశాలలో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్లే రోజులు తగ్గి వారికి వైద్య విద్య అందుబాటులోకి రానున్నదన్నారు. సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన ఆలోచనలతో వైద్య విద్యతోపాటు తెలంగాణ ప్రజలకు స్థానికంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరుతో పాటు 100 సీట్లతో అనుమతి ఇచ్చి కాలేజీ నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఉండేవని, తాను కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీలో డాక్టర్ విద్య చదవడం జరిగిందన్నారు.

సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు మెడికల్ కాలేజీ చదివి వైద్యరంగంలో రాణించాలని ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారన్నారు. సీఎం కేసీఆర్ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వైద్య విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చాడని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబురామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీధర్‌గౌడ్, ఎంపీపీలు, బీఆర్‌ఎస్ నాయకులు,విద్యార్థినిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News