Monday, December 23, 2024

కెసిఆర్ రైతుల పక్షపాతి: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం
సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి
ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీష్ అద్యక్షతన వరి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎం.శరత్‌చంద్రారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎన్.నందారెడ్డిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి అని అన్నారు. కెసిఆర్ పెద్ద మనస్సుతో రైతులకు నష్టం వాటిళ్లకుండా యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రస్తుత యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరను ప్రభుత్వం రూ.1,960గా నిర్ణయించి, ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులను రాజులను చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయడంతో పాటు రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తూ వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తోందని తెలిపారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేయూతనందిస్తూ వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే కృతనిశ్చయంతో ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ప్రణాళిక బద్దంగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 13,854 ఎకరాల్లో వరి సాగుచేయగా 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. ఇందుకు జిల్లాలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

వేసవి కాలం కావడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని, ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎఇఒలు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి, డిసిఎంఎస్ వైస్‌ఛైర్మన్ మధుకర్‌రెడ్డి, జడ్పి వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేరిరేఖ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పద్మావతి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News