Saturday, November 16, 2024

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

‘డాక్టర్స్ డే’ సందర్భంగా సిఎం కెసిఆర్ సందేశం
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రాన్నిఆరోగ్య తెలంగాణగా మార్చడమే తన ధ్యేయమన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్జంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలన్నారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని ఈ సందర్భంగా డాక్టర్లకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని, బాధలనుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని సిఎం అన్నారు. కరోనాతో సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవన్నారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కునే క్రమంలో తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టరునూ, వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులను, పేరు పేరునా మరోసారి అభినందిస్తున్నానని సిఎం అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇప్పటికే పలు వైద్య కళాశాలలను ప్రభుత్వం నెలకొల్పిందన్నారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రకాల రోగ నిర్ధారణ చేసే కేంద్రాలను ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ వరంగల్ సహా పలు ప్రాంతాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభమైందని సిఎం తెలిపారు. అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో మౌలిక వసతులను మరింత మెరుగు పరిచామన్నారు. బస్తీ దవాఖాన్ల ఏర్పాటు తో డాక్టర్ల సేవలను గల్లీ లోని సామాన్యుల చెంతకు చేర్చామన్నారు. డాక్టర్లతో సహా, అన్ని రకాల వైద్య సిబ్బందిని నియమించడం, ప్రమోషన్లు ఇవ్వడం, మెరుగైన రీతిలో జీత భత్యాలు పెంచడం జరిగిందని సిఎం తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే వైద్య ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బంది నియామకం కోసం 20 వేల కొత్త పోస్టులను మంజూరు చేయడం ద్వారా ప్రజారోగ్యం పట్ల ప్రభత్వ చిత్తశుద్దిని తెలుపుతున్నదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. ఈ క్రమంలో డాక్టర్లు, నర్సులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం కోసం, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.

KCR Greets to Doctors on National Medical Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News