దీంతోనే పల్లెల్లోంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌ల రాక
శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్ : పాలననూ ప్రజా ఉద్యమంగా నడిపిస్తూ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్.. క్రీడా విప్లవానికి కూడా అంతే స్థాయిలో బాటలు వేశారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. దేశం గర్వించదగ్గ అనేక మంది క్రీడా కారులను తెలంగాణ రాష్ట్రం అందించిందన్నారు. క్రీడా ప్రపంచంలో యువతను భారీగా భాగస్వామ్యులను చేసేందుకు, కెసిఆర్ ఆదేశానుసారం ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా ఇటీవల సీఎం కప్ క్రీడలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామన్నారు. రాష్ట్రంలో దాదాపు 24వేలకు పైగా క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ , గ్రామ పునాదుల్లోంచి క్రీడా విప్లవానికి బాటలేశారని వివరించారు.గ్రామాల్లో విలువైన స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించడం ద్వారా, క్రీడా రంగానికి వేల కోట్ల ఆస్థిని సీఎం కేసీఆర్ అందించారని వివరించారు. ఆదివారం నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఈ మేరకు ‘ స్పోర్ట్స్ హాస్టలర్స్ రీ యూనియన్ మీట్ ’ ను ఘనంగా నిర్వహించారు.
ఈ క్రీడా వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన రాష్ట్ర క్రీడా కారుల జీవిత చరిత్రలను రికార్డు చేసి, డాక్యుమెంటరీలుగా, పుస్తకాలుగా రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ముద్రించి, యువతకు అందించే ప్రయత్నం చేస్తుందని అన్నారు.సిఎం కెసిఆర్ రాష్ట్రంలో క్రీడా విప్లవానికి శ్రీకారం చుట్టారని,అందరూ ఆ మహా యజ్ఞం లో పాలుపంచుకోవాలని కోరారు. పల్లె ల్లోంచి ప్రపంచ చాంపియన్ లు రావాలన్నదే కెసిఆర్ ఆశయమన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు ఎస్. వేణుగోపాల చారీ, గజ్జెల నగేష్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ మాల్కమ్ కొమురయ్య, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్ , వివిధ క్రీడా సంఘాల నాయకులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వందలాది మంది మాజీ క్రీడా కారులు పాల్గొన్నారు.