శివసేన ఎంపి సంజయ్ రౌత్
కె.చంద్రశేఖర్ రావు చాలా కష్టపడి పనిచేసే నాయకులు జీవితంలో
ఎన్నో పోరాటాలు చేశారు అందరినీ కలుపుకొని వెళ్లగల సామర్థం
ఉంది ఉద్ధవ్ థాక్రేలతో పాటు ఇతర రాజకీయ నాయకులు
త్వరలో భేటీ అవుతారు యుపిలో బిజెపి ఓటమి ఖాయం : రౌత్
నాగపూర్: అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లగల సమర్ధత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఉందని శివసేన ఎంపి సంజయ్ రౌత్ తెలిపారు. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా భావసారూప్యం పార్టీలన్నీ సమైక్యపరిచే ప్రయత్నంలో భాగంగా కెసిఆర్ ఆదివారం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో భేటీ అయిన నేపథ్యంలో సంజయ్ రౌత్ సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కె చంద్రశేఖర్ రావు చాలా కష్టపడి పనిచేసే నాయకుడని, ఆయన తన జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నారని అన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లగల సమర్ధత ఆయనకు ఉందని రౌత్ అన్నారు. కెసిఆర్, థాక్రేల భేటీలో అభివృద్ధి, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి చర్చకు వచ్చాయని రౌత్ తెలిపారు.
ఇద్దరు ముఖ్యమంత్రులతోపాటు ఇతర రాజకీయ నాయకులు త్వరలో మరోసారి సమావేశమవుతారని శివసేన అధికారి ప్రతినిధి కూడా అయిన రౌత్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఆదివారం తాను ఉద్ధవ్ థాక్రేతో సమావేశమయ్యానని, తామిద్దరం యుపిలో మార్పు అనివార్యమన్న ఏకాభిప్రాయానికి వచ్చామని ఆయన తెలిపారు. యుపి ఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థులపై బిజెపి సాగిస్తున్న మాటల దాడిని గురించి ప్రశ్నించగా అది వారికి(బిజెపి) అలవాటేనని, ఓడిపోతున్నప్పుడు అలాంటి ప్రకటనలు చేస్తుంటారని రౌత్ చెప్పారు.