Thursday, January 23, 2025

ఢిల్లీలో బిఆర్‌ఎస్ సెంట్రల్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన కెసిఆర్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) సెంట్రల్ ఆఫీసును నేడు ఢిల్లీలోని వసంత్ విహార్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన కార్యాలయంలోకి ప్రత్యేక పూజల క్రతువులతో పాటు ప్రవేశించారు. ఆయన వెంబడి బిఆర్‌ఎస్ మంత్రుల కూడా ఉన్నారు.

 

నాలుగు అంతస్తుల బిఆర్‌ఎస్ భవనం ‘వాస్తు శాస్త్ర’ పద్ధతిలో గొప్పగా నిర్మించారు. ఈ భవన నిర్మాణం గత ఏడాది మొదలయింది. బిఆర్‌ఎస్ పార్టీని జాతీయ పార్టీగా విస్తరించాలన్న ధ్యేయంతో, ఢిల్లీలో కేంద్ర కార్యకలాపాలకు ఉపయోగపడే రీతిలో దీనిని నిర్మించారు.

 

దేశ సమగ్రాభివృద్ధి, రైతు పాలన తేవాలన్న లక్షంతో బిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కట్టిన కార్యాలయంతో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిరంతరం బిఆర్‌ఎస్ భవన్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. బిఆర్‌ఎస్ భవన్‌ను 11000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులుగా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్లు ఉన్నాయి. ఓ క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, జనరల్ సెక్రటరీలకు నాలుగు చాంబర్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించారు. ఇక పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ చాంబర్, ఇతర చాంబర్, కాన్ఫరెన్స్ హాల్ వంటివి మొదటి అంతస్తులో నిర్మించారు. రెండో అంతస్తులో ప్రెసిడెంట్ సూట్‌తో పాటు మొత్తం 20 గదులు ఉన్నాయి. వాటిలో వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్, ఇతర 18 గదులు ఉన్నాయి.

నూతన కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఎంఎల్‌సి కె.కవిత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును, ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆయన కార్యదక్షత వల్లే దేశవ్యాప్తంగా 39 రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రావతరణకు మద్దతునిచ్చాయన్నారు. కెసిఆర్ అనేక రాజకీయ కష్టనష్టాలు ఎదుర్కొని తెలంగాణను సాధించారన్నారు. ‘లోక్‌సభలో తొమ్మిది మంది ఎంపీలు, రాజ్యసభలో ఏడు మంది ఎంపీలు, తెలంగాణలో 105 మంది ఎంఎల్‌ఏలతో పార్టీ నేడు నేషనల్ పవర్‌హౌస్‌గా ఎదిగింది’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News