Monday, December 23, 2024

అమరుల ఆశయాలను సాధిస్తున్న కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతూ దేశానికే ఆదర్శంగా నిలిపారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను పరిపూర్ణం చేస్తూ సాగుతుండడంపై నేడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకుని ఖమ్మం నగరం మయూరి సెంటర్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్‌లో చేపట్టిన సర్వ సభ్య సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ అమరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టగా, సభ్యులందరు ఏకగ్రీవంగా బలపరిచారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో పదిలంగా ఉందన్నారు. ఎంతో మంది విద్యార్దుల ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకున్న ఉద్యమనేత కేసీఆర్ సర్కారు అమరుల కుటుంబాలకు అడుగడుగునా అండగా నిలుస్తూ ఆసరా నిస్తున్నదన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను రాష్ట్రం ఏర్పాటైన రెండేండ్లలోనే అక్కున చేర్చుకుందని, అమరుల కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన విషయం గుర్తు చేశారు. 2016 జూన్ 2న రాష్ట్రం రెండో అవతరణ రోజునే దీన్ని పూర్తి చేసిందని, అమరుల కుటుంబ సభ్యుల్లో కొందరికి చదువు, వయసు వంటి నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చి ఉద్యోగాలను కల్పించిందన్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో అసువులు బాసిన అమరులకు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ తెలంగాణ ఉద్యమంలోతొలి మలి దశ ఘటనలను, 14ఏళ్ళ పాటు కెసిఆర్ చేసిన ఉద్యమ కీలక అంశాలను, అప్పట్లో ఆంధ్రనేతల అడ్డంకులు, ఖమ్మం జైల్‌లో కెసిఆర్ ఆమరణదీక్ష, జిల్లా నేతల సంఘీభావం, తెలంగాణ ఉద్యమ కారుల పోరాట పటిమను సుదీర్ఘంగా వివరించారు. ఆంధ్రావాళ్ళు తెలంగాణకు పాలించే తెలివిలేదని ఎగతాళి చేశారని,విద్యుత్ ఉండదు, నక్సలైట్లు వస్తారని చెబుతూ అడ్డుకున్నారని కాని ఇప్పుడు అందుకు భిన్నమన పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా కేంద్రం నుంచి ఎన్నో అవార్డులను సాధించుకుందన్నారు.

తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందన్నారు. ఆనాడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఉండగా ఇప్పుడు తెలంగాణ మారిందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అగం కాకుండా ఉండలంటే మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆయనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని దాని కోసం అందరు కష్టపడాలని కోరారు.రానున్న రోజుల్లో పట్టుదలతో పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ రూ.4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగినట్లు తెలిపారు. సమైక్యాంధ్రాలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణ, రాష్ట్ర ఏర్పాటుతో అనతికాలంలోనే అన్ని రంగాల్లో ఊహించని అభివృద్ధితో దేశంలో ఆదర్శ రాష్ట్రంగా మారిందన్నారు.

తెలంగాణ వస్తే, అంధకారమని, నక్సలిజం బలపడుతుందని, అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందని అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కోతల్లేని 24 గంటల విద్యుత్, దేశానికే ధాన్య భండారంగా, ఆంద్రప్రదేశ్ ను వెనక్కినెట్టిన తీరులో రాష్ట్ర పరిపాలనను అద్దం పడుతుందన్నారు. అమరుల ఆకాంక్షల మేరకు రాష్ట్ర పాలన సాగుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఒకో శాఖలో సాధించిన ప్రగతి, అభివృద్ధి గురించి ప్రజల్లో వివరిస్తున్నట్లు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి అవగాహన కలిగిస్తున్నట్లు ఆయన అన్నారు. ఎందరో అమరుల త్యాగఫలం నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని ఆయన తెలిపారు.

అహింసాయుతంగా రాష్ట్ర సాధనకు అన్ని వర్గాల వారు ఉద్యమం చేశారన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరు పునరంకితులై రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, అసిస్టేంట్ కమీషనర్ బైరు మల్లేశ్వరీ,కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కురాకుల వల రాజు, శీలం శెట్టి రమా వీరభద్రం, తోట గోవిందమ్మ, దండ అయ్యప్పరెడ్డి, రుద్రగాని శ్రీదేవి, పగడాల శ్రీవిధ్య, ఉద్యమకారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News