మన తెలంగాణ/హైదరాబాద్ : అరుదైన రాజకీయ నేతగా సిఎం కెసిఆర్ గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతోపాటు కొన్ని దశాబ్దాల కల తెలంగాణ సాకారమవడానికి కూడా కారకుడయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మాటల మాంత్రికుడిగా ఖ్యాతి గడించారు. రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేయడంలో కెసిఆర్ దిట్ట. రాజకీయ చాణక్యుడిగా ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్నారు. ప్రత్యర్థులు సైతం సిఎం కెసిఆర్ అసలు సిసలైన రాజకీయ నేత అని ఒప్పుకున్న సందర్భాలు కోకొల్లలు.
ఈ విషయాన్ని ఆయా పార్టీల నేతలు పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం విదితమే. ఓ వైపు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉల్లాసంగా ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారు , ఎల్లవేళలా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు. నందమూరి తారక రామారావు నటించిన ‘దానవీర శూరకర్ణ’ను సిఎం కెసిఆర్ పదే పదే చూస్తుంటారు. ఆయనకు ఈ సినిమా అంటే బోలెడు ఇష్టం. సభల్లో ప్రసంగించే సమయంలో కూడా ఈ సినిమాలోని డైలాగులను తరచూ ఆయన ప్రస్తావిస్తుంటారు. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని తన కుమారుడికి పేరు పెట్టడం ద్వారా ఆయన దానిని నిరూపించుకున్నారు. మొదట కాంగ్రెస్‌లో ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఉద్యమంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ పార్టీ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది.
ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ నటించిన ‘ఆరాధన’ సినిమా అంటే కూడా కెసిఆర్‌కు చాలాచాలా ఇష్టం. కెసిఆర్ మాంసాహార ప్రియుడు. నాటుకోడి కూర అంటే ఎంతో ఇష్టం. పలు సందర్భాల్లో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా చేయించుకుంటుంటారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన ఆహారం తినడంలో ఏమాత్రం ఎక్కడా రాజీపడరు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రస్తుతం మూడోసారి ముఖ్యమంత్రి అవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ఏర్పాటవుతున్న సభలు సమావేశాల్లో పాల్గొంటూ భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) తెలంగాణలో అధికారంలోకి ఎందుకు రావాలనే అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.
హ్యాట్రిక్ కొట్టాల్సిందే.. రికార్డు సాధించాల్సిందే…! కెసిఆర్ మనోగతం
బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా కెసిఆర్ సరికొత్త రికార్డు సృష్టించే వీలుంది. అదేమిటంటే ఇప్పటివరకు ఉమ్మడి ఎపిలో మూడోసారి ముఖ్యమంత్రి అయినా దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడవని రీతిలో సిఎం కెసిఆర్ తనదైన శైలిలో ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇందులో భాగంగా ముందస్తుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించారు. తద్వారా బిఆర్‌ఎస్ నేతలు ముందస్తుగా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునే విధంగా వీలు కల్పించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యేందుకు అనువుగా సుడిగాలి పర్యటనలకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రచార సమయం ముగిసే కల్లా దాదాపు 97 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళన సభల్లో పాల్గొనే విధంగా వ్యూహం రచించారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ‘బిఆర్‌ఎస్‌యే శ్రీరామరక్ష’ అని ప్రజలకు వివరించడంలో ఆయన సక్సెస్ అయ్యే విధంగా ఆయన చేస్తున్న కృషే ఆయనకు హ్యాట్రిక్ తెచ్చిపెట్టగలదన్న ఆశాభావాన్ని బిఆర్‌ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.