గజ్వేల్, కామారెడ్డి స్థానాలలో ముందంజలో కెసిఆర్
రెండు నియోజకవర్గాలూ బిఆర్‌ఎస్‌కు పెట్టని కోటలు
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాలపైనే కేంద్రీకృతమై ఉంది. బిఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, పిసి సి అధినేత రేవంత్ రెడ్డి, బిజెపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లు ఈ నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తుండడంతో అందరి చూపు ఇక్కడి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ను, కామారెడ్డిలో పిసిసి నేత రేవంత్ రెడ్డిని ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఈ రె ండు నియోజకవర్గాలు బిఆర్‌ఎస్‌కు పెట్టని కోటలుగా వున్నాయి.
అయితే ఈసారి గజ్వేల్‌లో, కామారెడ్డిలో త్రిముఖ పోటీని కెసిఆర్ ఎదుర్కొంటున్నారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ ఎంఎల్‌ఎ తూముకుంట నర్సారెడ్డి, బిజెపి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో బిజెపి నుంచి వెంకట రమణా రెడ్డి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకతపైనే రేవంత్ రెడ్డి, రాజేందర్‌లు ఫోకస్ పెట్టి ప్రచారం సాగిస్తున్నారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో గజ్వేల్‌లో సాధించిన సర్వతోముఖాభివృద్ధి, తెలంగాణ మోడల్ పాలన లాంటి పాజిటివ్ అంశాలు, పటిష్టమైన క్యాడర్, లీడర్, సంక్షేమ పథకాల లబ్దిదారుల అండతో కెసిఆర్ ముందుకు దూసుకుపోతున్నారు.
రెండు స్థానాలకూ జాతీయ స్థాయి ప్రాముఖ్యత
ముగ్గురు మూడు పార్టీల ముఖ్య నేతలే కావడంతో ఈ ఎన్నికకు జాతీయ స్థాయి ప్రాముఖ్యత ఏర్పడింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇక్కడ ఫలితం పైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నది రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో, ఈటల రాజేందర్ హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కెసిఆర్‌తో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇప్పటి వరకు ఒకేసారి తప్ప ఏ ఎన్నికల్లోను ఓటమి ఎరగని నేతగా పేరుంది. కెసిఆర్ గతంలో ఎంపి, ఎంఎల్‌ఎగా రెండుసార్లు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘన విజయాలను సాధించారు.
ఇప్పటిదాక ఆయన 12 సార్లు పోటీ చేసినా 1982లో మాత్రమే అదీ అతి తక్కువ మెజార్టీతో ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. ఆయన ఎంపిగా పోటీ చేసినా ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజేతగానే కాకుండా మెజారిటీల్లో రికార్డు సాధించడం ఆయన ప్రత్యేకత. తెలంగాణలో స్థానిక స్థానికేతర అనే అంశం ఆయనకు వర్తించదు. ఆయన కరీంనగర్ లో ఎంపిగా పోటీ చేసినా మహబూబ్‌నగర్‌లో ఎంపిగా పోటీ చేసినా గెలుపు ఆయనదే. అలాంటి జనం నాయకుడితో ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఢీ కొంటున్నారు. కామారెడ్డి, గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌తో పోటీ తీవ్రంగానే వున్నా ఇప్పటి వరకు ఏ కోణం లో చూసినా కెసిఆర్ ముందంజలోనే వున్నారు.
కెసిఆర్‌పై పోటీలో నిల్చోవడమే వారి పార్టీలో వారిద్దరి ప్రాముఖ్యతను పెంచుతున్నది. అయితే, కెసిఆర్‌ను ఎన్నికల్లో ఎదుర్కోవడం నల్లేరుపై నడక కాదని వారికీ తెలుసు. కానీ ఒక్కసారైనా ప్రయత్నిద్దాం అన్నట్టుగా వారు జాతీయ పార్టీల ఒత్తిడులతో రంగంలోకి దిగారు. కెసిఆర్ దూకుడుకు కళ్లెం వేయాలని బిజెపి, కాంగ్రెస్‌లు ఆ ఇద్దరినీ చెరో చోట బరిలో నిలిపాయి. గజ్వేల్‌లో కెసిఆర్ 2014, 2018లో పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలిచారు. కానీ కామారెడ్డిలో పోటీ చేయడం ఇదే మొదటిసారి.
కామారెడ్డితో కెసిఆర్ అనుబంధం
కామారెడ్డిలో కెసిఆర్ పూర్వీకుల మూలాలు వున్నాయి. కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. కెసిఆర్ అమ్మమ్మ స్వగ్రామం కోనాపూర్ ఈ నియోజకవర్గంలోనే వుంది. అక్కడ కెసిఆర్ కుటుంబం ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. దాదాపు రెండు లక్షల 52 వేల ఓటర్లు వున్న కామారెడ్డి 2012 నుంచి బిఆర్‌ఎస్‌కు కంచుకోటగా వుంది. ఇక్కడ నుంచి గంప గోవర్ధన్ మూడు సార్లు కాంగ్రెస్ ముఖ్యనేత షబ్బీర్ అలీని మూడు సార్లు ఓడించారు. కెసిఆర్ రెండు చోట్లా గట్టి నేతల నుంచి పోటీ ఎదుర్కొంటున్నారే తప్ప ఆయన ఎన్నికల్లో రెండు చోట్లా గెలవడం అంత కష్టమేమీ కాదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆయన గెలుపు వ్యూహాల మీద ఎవరికీ అనుమానాలు లేవు. కెసిఆర్ పాచిక వేశారు అంటే అది విజయవంతం అవుతుంది అనేది విమర్శకులు కూడా ఒప్పుకుంటారు.
అభివృద్ధిలో గజ్వేల్ రోల్ మోడల్
గజ్వేల్‌లో కెసిఆర్ పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పట్టణ రూపురేఖలను మార్చివేశారు. 2014కు ముందు 2023 గజ్వేల్‌ను పరిశీలిస్తే ఎలాంటి అభివృద్ధి సాధ్యమైం దో ఎవరైనా ఇట్టే చెపుతారు. జాతీయ రహదారికి కొద్ది దూరం లో ఉన్న గజ్వేల్‌కు కెసిఆర్ రావడంతోనే వెనుకబడిన ఈ ప్రాంతానికి మహర్దశ పట్టింది. నివాస స్థలాలు, వ్యవసాయ భూముల ధరలు పదింతలు పెరిగాయి. విద్యా వైద్య వసతులు రోడ్లు అనూహ్యంగా మెరుగుపడ్డాయి. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్‌లో కాళేశ్వరం జలాలు గజ్వేల్‌ను సస్యశ్యామలం చేశాయి.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఇల్లు భాగస్వామ్యం అయింది. గజ్వేల్ చుట్టూ 22 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడమే కాకుండా వంద పడకల ఆసుపత్రి, హైదరాబాద్ రవీంద్ర భారతిని తలపించే మహతీ ఆడిటోరియంను, విద్యలో కెజి నుంచి పిజి దాకా రూ. 146 కోట్లతో కార్పొరేట్ స్థాయి అత్యాధునిక రీతిలో భవనాలు నిర్మించారు. మండల కేంద్రాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేకం జరిగాయి. ప్రతి ఊరు అభివృద్ధితో పరవళ్ళు తొక్కుతోంది. ఇలాంటి పూర్తి సానుకూల పరిస్థితుల్లో ఇక్కడ ఆయనకు పెద్దగా వ్యతిరేకత లేదు. బిసి సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ నిలబడడంతోనే పోటీ అంటూ ఏర్పడింది. ఈటల రాజేందర్ తనకున్న సామాజిక బలం, రాజకీయ బలంతో కొండను ఢీ కొంటున్నారు.
కామారెడ్డిలో పటిష్టంగా బిఆర్‌ఎస్
ఇక కామారెడ్డిలో కెసిఆర్‌కు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బిజెపి నుంచి వెంకట రమణారెడ్డితో పోటీలో వున్నారు. ఈ ముగ్గురిలో రేవంత్ రెడ్డి స్థానికుడు కాదు కానీ పిసిసి అధినేతగా ఆయనకు గుర్తింపు వుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గెలిచిన గంప గోవర్ధనకు కూడా ఇక్కడ మంచి పట్టు వుంది. అన్ని మండలాల్లోనూ గజ్వేలు మాదిరిగానే కామారెడ్డిలో కూడా గ్రామస్థాయి దాకా నాయకులు కేడర్ పటిష్టంగా వుంది.
ఈ నేతలు బిఆర్‌ఎస్‌కు ఓట్లను పోలింగ్ బూతు దాకా తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఈటల రాజేందర్‌కు రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయి దాకా పని చేసే కేడర్, లీడర్ లేకపోవడం ప్రధాన లోపం. కెసిఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌లు జంట నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ముందుగా వాళ్ళిద్దరూ కూడా ఇంట గెలవడం ముఖ్యం. రేవంత్ రెడ్డికి కొడంగల్‌లోను, ఈటల రాజేందర్‌కు హుజురాబాద్‌లోను ఈసారి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. హుజురాబాద్‌లో ఈటలను పాత ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డితో పాటు, ఒడితల వారసుడు ప్రణవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రణవ్ యువకుడిగా తనకున్న పరపతికి తోడు తన తాత ఒడితల రాజేశ్వరరావు రాజకీయ సంబంధాలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు.
(మిట్టపల్లి శ్రీనివాస్/మన తెలంగాణ)