Monday, December 23, 2024

పోడు గోడుకు వీడ్కోలు పలికిన ఘనుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : రైతులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న కల ఎట్టకేలకు సాకారమైంది. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ చేతుల మీదుగా లాంఛనంగా పట్టాలు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సుగుణ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నేతలు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, ఆదివాసీల దేవుడుగా వారి ఆరాధ్య దైవంగా మారారని ప్రశంసించారు. గత పాలకులు గిరిజన, దళితులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారని దాదాపు 60 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను సీఎం చిటికెలో పూర్తి చేశారని వివరించారు.

కెసిఆర్ పాలన గిరిజనుల పాలిట స్వర్ణయుగంగా మారిందని నేడు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం శుభ సూచకంగా వారు అభివర్ణించారు. రాష్ట్రంలో నాలుగు లక్షల 6వేల పట్టాలు ఉండగా, ఒక్క భద్రాద్రి జిల్లాలో మొత్తం 50,595 మంది గిరిజన రైతులకు 1,51,195 ఎకరాలకు పట్టాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి ఉచిత విద్యుత్, రైతుబంధు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అందించిన పట్టాల ద్వారా రైతులు పది రకాల సేవలు పొందేందుకు అర్హత సాధించినట్లు చెప్పారు. ధరణిలో పేరు నమోదు కావడంతో పాటు పాస్‌బుక్, ఎకరాకు పదివేల రూపాయల రైతుబంధు, దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే భీమా పథకం ప్రకారం 5 లక్షలు, అటవీ అధికారుల వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అక్రమంగా బనాయించిన కేసులను తొలగించేలా ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రకృతి వైపరిత్యాలు, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించేందుకు ఈ పట్టాలు దోహదం చేస్తాయని అన్నారు. తరతరాలుగా భూమిపై యాజమాన్యపు హక్కులు పొందనున్నట్లు తెలిపారు. గిరిజన బిడ్డలు వ్యవసాయ మార్కెట్, సహకార సంఘాల్లో సభ్యులుగా, బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. 2471తండాలు, గూడాలు పంచాయతీలుగా మార్చి దశాబ్దాల కల నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇక నుంచి ప్రతీ గ్రామానికి వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులు పట్టాలు పంపిణీ చేస్తారని ప్రకటించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపడం హర్షణీయమన్నారు. గతంలో యుద్ద వాతావరణం ఉండేదని ప్రస్తుతం పోడు గోడు లేని ప్రాంతాలుగా మన్యం ప్రాంతాలు విరాజిల్లుతాయని హర్షం ప్రకటించారు. తాను కూడా వ్యక్తిగతంగా ఎంతో ఆవేదనకు గురయ్యానని, ఆరు దశాబ్దాల కల నేటికి సాకారం కావడం ప్రజాప్రతినిధిగా తన జన్మ ధన్యమైందని భావోద్వేగంతో అన్నారు. తొలుత ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ వేద సాయిచంద్ మృతికి సంతాప సూచకంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ పిఎస్ రామకృష్ణారావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామానాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఐటిడిఎ పివో గౌతమ్, ఎస్‌పి. డాక్టర్ వినీత్, అటవీ అధికారి రంజిత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News