బాన్సువాడ: కరెంట్‌పై చంద్రబాబును ఆనాడు ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి కెసిఆర్ అని, మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ఇదే సర్వేలు చెబుతున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత విద్యుత్‌పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రైతులకు 3 గంటల కరెంట్ ఇవ్వాలని స్పష్టంగా చెప్పాడని, రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యాన్ని తెలియజేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని, రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా, మతిభ్రమించి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వ్యవసాయం, రైతుల గురించి ఏ మాత్రం తెలియదని, హైదరాబాద్ చుట్టు పక్కల రైతులను భయపెట్టి భూ కబ్జాలు చేయడం తెలుసన్నారు.
రైతుల కష్టాలను తెలిసిన వ్యక్తి సీఎం కేసిఆర్ అన్నారు. వ్యవసాయాన్ని దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అయితే దాన్ని పండుగ చేసింది కేసిఆర్ అన్నారు. బషీరాబాగ్ కాల్పులకు ఆధ్యుడు చంద్రబాబు అని, నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్నానన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ పనిచేస్తున్నాడన్నారు. చంద్రబాబు తన మనిషి ద్వారా మళ్లీ సీమాంధ్ర కుట్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, వారి నాయకులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సాగునీటి రంగంపై గత పాలకుల నిర్లక్షంతో తెలంగాణలో బోర్లు పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు కాకుండా 30 లక్షల కరెంట్ మోటార్లున్నాయన్నారు. 70 నుంచి 80 లక్షల ఎకరాలు సాగులో ఉందన్నారు.
రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ తప్పు కప్పి పుచ్చుకోవడానికి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఏజంట్ రేవంత్ రెడ్డి అని, చంద్రబాబు రేవంత్ ఇద్దరూ ఒక్కటేనన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చడానికి ప్రజలే కాదు కాంగ్రెస్ కార్యకర్తలే సిద్ధ్దంగా లేరన్నారు. ఆయన జాతకం అందరికి తెలుసు కాబట్టి ఎవ్వరూ నమ్మరన్నారు. కరెంట్ చార్జీల పెంపుదలకు వ్యతిరేఖంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేసిఆర్ ఉత్తరం రాశారని, రైతులకు మద్దతుగా చంద్రబాబును ఎదురించిన వ్యక్తి కేసిఆర్ అని గుర్తుచేశారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధ్ది, రైతుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ఏకైన వ్యక్తి సీఎం కేసిఆర్ అని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రమన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, లైన్ల పటిష్టం కోసం ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారన్నారు. భవిష్యత్తులో అన్ని రంగాలకు సంమృద్దిగా కరెంట్ అందించవచ్చన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, అవి కలలుగానే మిగిలిపోతాయన్నారు. మీ సమర్థత ఏంటో ప్రజలకు తెలుసన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆత్మ కమిటి చైర్మన్ మోహన్ నాయక్, ఎర్వల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, పిట్ల శ్రీధర్, పాత బాలకృష్ణ, మహ్మద్ ఎజాజ్, దొడ్ల వెంకట్రాం రెడ్డి, తదితరులున్నారు.