Tuesday, January 21, 2025

భారత భవితకు పునాది

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులు
రేపటి యువతను భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దాల్సిన అవసరమున్నది
ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక రంగాల్లో భోధన, శిక్షణ అవసరం
‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్)కు
శంకుస్థాపన చేసిన సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారు చేసే దిశగా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక రంగాల్లో భోధన, శిక్షణ అవసరమున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా సోమవారం నాడు కోకాపేటలో ‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్)కు బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వర్తమాన భారతానికి అవసరమున్నదని అన్నారు. సమాజాభివృద్ధికి దోహదం చేసే దిశగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనమీద వున్నవని చెప్పారు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుభవజ్జులైన గొప్ప గొప్ప మేధావులను, నోబుల్ లారేట్లను కూడా పిలిచి నాయకత్వ శిక్షణనిప్పిస్తామని తెలిపారు.

ప్రజలకు సుపరిపాలన నందించే నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాం
ప్రజలకు సుపరిపాలన నందించే నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని, తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్టం చేసే కృషి చేస్తామని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే ‘పొలిటికల్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ ఆర్ డి’ కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో శిక్షణనిచ్చేందుకు దేశం నలు మూలలనుంచి అనుభవజ్జులైన రాజనీతి శాస్త్రజ్జులు, ఆర్థిక వేత్తలు, సామాజిక వేత్తలు సమాజాభివృద్ధికి దోహదం చేసే రచయితలు, ప్రొఫెసర్లు విశ్రాంత అధికారులు తదితరులను ఆహ్వానించనున్నట్టు సిఎం చెప్పారు.

దేశం నలుమూలల నుంచి వచ్చే సామాజిక కార్యకర్తలకు, రాజకీయ వేత్తలకు, నాయకులకు భారత్ భవన్‌లో సమగ్రమైన సమస్త సమాచారం లభ్యమవుతుందని అన్నారు. ఇక్కడికి శిక్షణ కోసం వచ్చే వారికోసం, శిక్షణ పొందే వారి కోసం వసతులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శిక్షణకు అనుగుణంగా.. తరగతి గదులు, ప్రొజెక్టర్‌తో కూడిన మినిహాల్స్, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్ లైబ్రరీలు, వసతి కోసం లగ్జరీ గదులు నిర్మితమవుతాయని అన్నారు. దేశ విదేశాల వార్తా పత్రికలు అందుబాటులో వుంటాయని తెలిపారు. ప్రపంచ రాజకీయ సామాజిక తాత్విక రంగాలకు చెందిన ప్రపంచ మేధావుల రచనలు, గ్రంధాలు అందుబాటులో వుంటాయన్నారు. స్థానిక, దేశీయ, అంతర్జాతీయ మీడియా ఛానల్లు సమాచార కేంద్రాలుండే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా…సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో చోటు చేసుకునే పురోగతిని పరిశీలించే వేదికలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వార్తలు, కథనాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ విశ్లేషించి, క్రోడీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని బిఆర్‌ఎస్ అధినేత తెలిపారు.

KCR Lays foundation stone for Bharat Bhavan

సోషల్ మీడియాపై ప్రత్యేక శిక్షణా తరగతులు
ప్రజలను నిత్యం ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాల పట్ల అవగాహన కోసం ప్రత్యేక శిక్షణా తరగతులుంటాయని సిఎం కెసిఆర్ అన్నారు. మీడియా రంగంలో రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికను అందిపుచ్చుకునే దిశగా సీనియర్ టెక్నికల్ బృందాలు కూడా పనిచేస్తాయని తెలిపారు. సంక్షేమం అభివృద్ధి రంగాల అధ్యయనం దిశగా, శిక్షణ సమాచారం అందుబాటులో వుంటుందని పేర్కొన్నారు.
భారత్ భవన్‌కు కేటాయించిన స్థలంలోని కొంతమేరకే భవన నిర్మాణం చేపడుతామని, మిగిలిన స్థలమంతా పచ్చదనంతో నింపుతామని చెప్పారు. నాయకత్వ శిక్షణ కోసం ఇక్కడకు వచ్చే వారికి విశాల ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో శిక్షణ బోధన అందుతుందని సిఎం తెలిపారు.ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ … నిర్మాణ స్థలమంతా కలియ తిరిగారు. నాలుగు మూలలా సరిహద్దుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతర్గత రోడ్లు నిర్మాణం గురించి చర్చించారు. భవన నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజకు, అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు.

భూ వరాహ హోమంలో పాల్గొన్న సిఎం
‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్) శంఖుస్థాప కార్యక్రమంలో వేద మంత్రోశ్చారణల నడుమ వేద పండితులు నిర్వహించిన భూ వరాహ హోమం కార్యంలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం నిర్దేషిత సమయానికి భవన నిర్మాణానికి బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ చేతుల మీదుగా భారత్ భవన్ శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెంట మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, బిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, బిబి పాటిల్, రంజిత్ రెడ్డి, దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్ రెడ్డి, శంభీపూర్ రాజు, వెంకట్రామిరెడ్డి, మహేందర్ రెడ్డి, గోరెటి వెంకన్న, ఎగ్గె మల్లేశం,ఎంఎల్‌ఎలు ప్రకాశ్ గౌడ్, దానం నాగేందర్, కాలె యాదయ్య, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, రవీందర్ సింగ్, రాజీవ్ సాగర్, సతీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, కార్తీక్ రెడ్డి, సాయిచంద్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, అనిల్ కూర్మాచలం, సోమ భరత్, జెడ్‌పి చైర్మన్ తీగల అనితారెడ్డి, గ్యాదరి బాలమల్లు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News