Sunday, December 22, 2024

వైద్యానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

భవిష్యుత్తులో కరోనాను మించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంది
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం
వైద్యారోగ్య శాఖ ప్రజల బాగు కోసం ఏం చేస్తుందనేది ప్రజలకు బాగా తెలిసేలా చర్యలు చేపట్టాలి
నిమ్స్ దవాఖానా విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయడం భారతదేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భం: కెసిఆర్
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్…కొందరివి పార్టీషన్ పాలిటిక్స్
కెసిఆర్ పాలనలో కరెంట్ వెలుగులు, కంటి వెలుగులు
ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కందిళ్ల వెలుగులు
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల తపన కొనసాగుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రదర్శించిన పనితీరు గొప్పదని సిఎం కొనియాడారు. ఎంతచేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుండి విమర్శలు వస్తుంటాయని ఈ విషయాన్ని గమనించి ప్రజావైద్యం దిశగా ఈ శాఖ చేస్తున్న కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని అన్నారు. ఆ దిశగా ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకునేందుకు ప్లానింగ్ చేసుకోవాలని సిఎం సూచించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన ‘నిమ్స్’ విస్తరణ పనులకు సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేశారు. ఇందులోభాగంగా నిర్మించనున్న దశాబ్ధి వైద్య భవనాల్లో నూతనంగా 2000 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత అధునాతన ఆపరేషన్ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు అందనున్నాయి.

ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ గడల శ్రీనివాస్, మెడికల్ హెల్త్ డైరక్టర్ రమేశ్ రెడ్డి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, నగర మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, నిమ్స్ డైరక్టర్ బీరప్ప, పర్యాటక శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనే మనిషి తపన ఒకచోట ఆగేదీకాదు.. వొడిసేదీ కాదని వ్యాఖ్యానించారు. నిరంతరం కొనసాగుతూనే వుంటుందని సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రంగాలతో పాటు రాష్ట్ర వైద్యారోగ్య రంగంలో కూడా అద్భుతమైన అభివృద్ధిని నమోదుచేసుకున్న నేపథ్యంలో, అత్యద్భుత రీతిలో నిర్మించబోయే నిమ్స్ దవాఖానా విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయడం భారతదేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భమని సిఎం పేర్కొన్నారు.

మానవజాతి ఉన్నంత కాలం వైద్యులు ఉంటారు
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మానవజాతి ఉన్నంత కాలం వైద్యులు ఉంటారని చెప్పారు. సమాజ పురోగమనానికి అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి అంటూ వైద్యుని ప్రాముఖ్యత గురించి శతకకారుడు వివరంగా చెప్పారని అన్నారు. తెలంగాణ వచ్చాక ఆరోగ్యశాఖ అతికీలకమైనదిగా భావించామని తెలిపారు. 2014లో వైద్యరంగానికి బడ్జెట్‌లో రూ.2,100 కోట్లు కేటాయించామని, 2023- 24 నాటికి అది రూ.12,367 కోట్లకు చేరిందని వెల్లడించారు. వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పారని, వైద్యరంగం బలంగా ఉన్న చోట తక్కువ నష్టంతో బయటపడుతారని చెప్పారని తెలిపారు. అందుకే వైద్యరంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ చాలా ప్రాధాన్యత కలిగిన శాఖ అని, ఏ సందర్భంలోనైనా చాలా లైవ్‌గా ఉండాల్సిన శాఖ అని సిఎం పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖను చాలా అనూహ్యంగా విస్తరిస్తున్నామని వెల్లడించారు. 17 వేల పడకల నుండి 50 వేల పడకలకు విస్తరించామని చెప్పారు. వందో రెండొందలో ఉన్న ఆక్సిజన్ బెడ్లను 50 వేలకు పెంచుకున్నామని, కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నులు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం
పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్ళు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే, మళ్ళీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుందని అన్నారు. చాలా మందికి ఈ విషయం తెలియదని, పెరుగుదలలో సమస్య రాకుండా ఉండాలంటే ముందస్తుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు పంచబడుతున్నవే న్యూట్రిషన్ కిట్లు అని వివరించారు. ఈ రోజు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం..?, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది..? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి…? చేపట్టాల్సిన చర్యలు ఏంటి…? అనే ప్రణాళికల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని తాను ఆరోగ్యశాఖ అధికారులను కోరుతున్నానని అన్నారు. బెస్ట్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ సక్సెస్ (ఉత్తమ ప్రణాళికతో సగం విజయం సాధించినట్లే) అని చెప్పినట్లు, వైద్యారోగ్య రంగం ఇంకెంత గొప్పగా ఉండాలి… ఇంకా ఎంతో ముందుకు పోవాలి… ఎలా ఈ లక్ష్యాలను ఎలా సాధించవచ్చో ఆరోగ్య శాఖ అధికారులు బాగా ఆలోచించాలని కోరారు.

వైద్యారోగ్య శాఖకు పబ్లిక్ రిలేషన్స్ చాలా తక్కువ
డాక్టర్లు గొప్పవారని, మంచి మనసున్న వాళ్లని సిఎం కెసిఆర్ కొనియాడారు. నిరుపేదల వైద్యం కోసం వస్తే, బెడ్లు అందుబాటులో లేనప్పుడు ఉదారమైన హృదయంతో ఒక అరగంట ఎక్కువ పని చేసైనా కిందనే బెడ్డు వేసి వైద్యం అందిస్తారని, అది వాస్తవం అని పేర్కొన్నారు. కానీ పత్రికలు, జర్నలిస్టులు అవాస్తవాలను ప్రచురిస్తారని, ఉస్మానియాలో బెడ్లు లేవు…. పేషెంట్లను కింద పడుకోబెడుతున్నరు అంటూ వక్రీకరణలు చేస్తారని అన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులకు పబ్లిక్ రిలేషన్స్ (పిఆర్) చాలా తక్కువ అని, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరని వైద్యులను ఉద్దేశించి అన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి మంచి చురుకైన వ్యక్తి అని, వైద్యశాఖ అందించే సేవలు ప్రజల్లోకి పోయేలా పిఆర్‌ను పెంపొందించాలని చెప్పారు. ప్రజలతో పెనవేసుకున్న విభాగం కాబట్టీ వైద్యారోగ్య రంగం పిఆర్ బాగా పెరగాలని, వైద్యారోగ్య శాఖ ప్రజల బాగు కోసం ఏం చేస్తుంనేది ప్రజలకు బాగా తెలిసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రయత్నిస్తే ఫలితముంటుందని అన్నారు. వైద్యారోగ్య శాఖ పిఆర్ బాగా పెరగాలి, ప్లానింగ్ బాగుండాలని కోరారు.

మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా డాక్టర్ల దగ్గరకు రావాల్సిందే
మనం కూడా మానవత్వ కోణంలో ఆలోచించాలని, వైద్యం ప్రత్యేక చదువు, ప్రత్యేకమైన అర్హత. ఐఎఎస్ లైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా డాక్టర్ల దగ్గరకు రావాల్సిందే అని తెలిపారు. ఒకసారి విచిత్రమైన సందర్భం వచ్చింది. ములుగు, భూపాలపల్లి ప్రాంతానికి పోస్టింగ్‌లు ఇచ్చిన సందర్భంలో వాళ్ళు జాయిన్ కాలేదని, కారణమేంటని తాను వాళ్ళను పిలిచి అడిగానని తెలిపారు. తాము పోవడానికే సిద్ధమే కానీ తమ భార్యలు రావడం లేదని చెప్పారని, ఎందుకని అడిగితే అక్కడ ఒక ఒక సినిమా మాల్ లేదు, ఇతరత్రా సౌకర్యాలు లేవని తమ సమస్యలు చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు తాలూకా కేంద్రంలో లేదా జిల్లా కేంద్రంలో ఉండేలా రూల్స్ సడలింపు చేయాలని చెప్పి అప్పుడున్న హెల్త్ సెక్రటరీకి చెప్పానని, దాంతో పాటు వారికి ఎక్స్‌ట్రా అలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్పానని అన్నారు.

పోలీస్ స్టేషన్‌లలో, పోలీస్ ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్ళిన ప్రజలకు, ప్రముఖులకు పోలీసులు మర్యాద ఇస్తున్నారని, ఇది మంచి మార్పు అని భావిస్తున్నారని అన్నారు. గతంలో పేద గర్భిణులు ప్రసవానికి ప్రైవేట్ ఆసుపత్రికి పోయేదని, ప్రభుత్వం తెచ్చిన కెసిఆర్ కిట్ల ద్వారా వారికి నగదు సాయంతో పాటు, ప్రసవానంతరం ఇచ్చి కిట్లతో నేడు ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. గతంలో హాస్పటల్స్‌లో 30 శాతం ప్రసవాలు జరిగితే, నేడు 70 శాతం ప్రసవాలు హాస్పటల్స్ లోనే జరుగుతున్నాయని అన్నారు. దానివల్ల మహిళల ఆరోగ్యం బాగుంటున్నదని, అనవసరమైన అబార్షన్లు, దుర్మార్గపూరిత చర్యలు కూడా ఉండటం లేదని, సమాజాన్ని కాపాడుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. మాతా మరణాలు, శిశు మరణాలు చాలా తగ్గాయని అన్నారు.

గొప్పగా హాస్పటల్స్ కట్టుకుంటున్నాం
రాష్ట్రంలో గొప్పగా హాస్పటల్స్ కట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ప్రపంచంలో ఎక్కడలేనటువంటి సూపర్ స్పెషాలిటి హాస్పటల్‌ను కడుతున్నాం. ఒకప్పుడు నిమ్స్‌లో 900 పడకలుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 1,500 పడకలకు తీసుకునిపోయామని, మరో 2000 పడకలను మనం కట్టుకుంటున్నామని చెప్పారు.హైదరాబాద్‌లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటి హాస్పటల్స్ కట్టుకుంటున్నామన్నారు. విదేశాలకు పోకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలిమెడిసన్ బాగా వినియోగించడం, వీటి సమాహారంగా అద్భుతాలను ఆవిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలని అన్నారు.

కరోనా వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్యులు సిద్ధంగా ఉండాలి
ఉత్తమోత్తమ సేవలు ప్రజలకు అందించడానికి, కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తే కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసిందని కొనియాడారు. ప్రైవేట్ హాస్పటల్స్‌లో కరోనా సోకిన పేషెంట్ పరిస్థితి విషమిస్తే గాంధీ హాస్పటల్స్‌కు పంపించే వారని, గాంధీ డాక్టర్లు అటువంటి పేషెంట్స్‌ను కూడా బతికించారని తెలిపారు. వారి సేవలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో మన రాష్ట్రంలోని పరిస్థితులకు అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా వైద్యసేవలు అందించేలా వైద్యులు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. వైద్యారోగ్య శాఖ మీదున్న అపవాదును తొలగించుకొని, రాష్ట్రంలో వైద్యశాఖే నెంబర్‌వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభించిన సిఎం కెసిఆర్
గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ లబ్ధిదారులు పార్వతి -ఉదయనగర్ కాలనీ చెందిన పార్వతి, భోళానగర్‌కు చెందిన పర్వీనమ్మ, ఎంబీటీ నగర్‌కు చెందిన శిరీషమ్మ, ప్రతాప్ నగర్ పంజాగుట్ట తేజశ్విని, శ్రీరామ్ నగర్‌కు చెందిన సుజాతమ్మ, అంబేడ్కర్ నగర్ రేణుకమ్మలకు సిఎం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. అనంతరం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్‌కు లక్ష్మినరసింహ స్వామి జ్జాపికను అందచేశారు.

ఆరోగ్య తెలంగాణ కోసం ఒక్కో అడుగు ముందుకు పడుతుంది: హరీశ్‌రావు
నిమ్స్ చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ఒక్కో అడుగు ముందుకు పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వైద్య రంగంలో. .ఇదొక విప్లవమని అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉస్మానియా, గాంధీ తప్ప వేరేవి లేదని, వైద్యారోగ్య శాఖను మెరుగు పరచడం గత ప్రభుత్వాలు మర్చిపోయాయని విమర్శించారు. స్వరాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కరోన లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తెలంగాణ వైద్యరంగం ఎదురుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ యూజ్ డయాలసిస్ వసతలు ఇక్కడ ఉందని చెప్పారు.

గతంలో డాక్టర్ చదవాలంటే అందని ద్రాక్ష అని, తెలంగాణ బిడ్డలు ఉక్రెయిన్ లేదా మరెక్కడో వెళ్లి కష్టాలు పడకుండా అన్ని జిల్లాలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతీ లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, పిజి మెడికల్ సీట్లలో దేశంలో రెండోస్థానంలో ఉందని అన్నారు. తలసారి ఆదాయంలో, తలసారి విద్యుత్ వినియోగంలో, గ్రీన్ కవర్ పెంపుదలలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని పేర్కొన్నారు. కెసిఆర్ నంబర్ వన్ కాబట్టి తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. బిపి, షుగర్‌లతో బాధపడేవారికి మందుల కిట్‌లు అందిస్తున్నామని, బిఆర్‌ఎస్ కిట్‌లు అందిస్తుంటే.. ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి తిట్లు తిడుతున్నారని మండిపడ్డారు. పల్లె దవాఖానాలు, బస్తీ ఖానాలు వచ్చిన తర్వాత.. ప్రజలకు ఆరోగ్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కంటి వెలుగును పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు అభినందిస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు మనం మోడల్‌గా మారామని చెప్పారు.

కెసిఆర్ పాలనలో కరెంట్ వెలుగులు, కంటి వెలుగులు అని, ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కందిళ్ల వెలుగులు అని విమర్శించారు. మావి న్యూట్రిషన్ పాలిటిక్స్…కొందరివి పార్టీషన్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. రోగమొస్తే బాగుచేయడమే కాదు.. రోగం రాకుండా ఆలోచించిన నాయకుడు సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. కెసిఆర్ ముందుచూపుతో మిషన్ భగీరథను ప్రారంభించి.. రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత గ్రామంగా మార్చారని చెప్పారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సీజనల్ వ్యాధులు రాకుండా తగ్గించుకోగలిగామని చెప్పారు. మారుమూలు గిరిజన గ్రామాల్లో, తండాల్లో కూడా అంటువ్యాధులు లేవని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాదు…ఎవరూ అడగని న్యూట్రిషన్ కిట్ల లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. హరితహారం ద్వారా కాలుష్య రహిత తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఆచరిస్తోంది..దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News