Thursday, January 9, 2025

నాటి ‘మహా’ చైతన్యం ఏమైంది?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈ దేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ, నేడు మహారాష్ట్రకు తానే నేర్పుతున్నానని, నేర్చు కోవడం, నేర్పడం జ్జాన సముపార్జనలో భాగమని, బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తాను ఎమ్మె ల్యేగా వున్న తొలినాళ్లలో మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ల్లమన్నారు. నాడు తలఎత్తుకుని చూసిన మహారాష్ట్రను ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి రావడానికి ఇన్నాళ్లుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన బాధ్యతారాహిత్య నిర్లక్ష్యపూరిత ధోరణులే కారణమని సిఎం పేర్కొన్నారు. సోమవారం మహారాష్ట్రకు చెందిన పలువురు ముఖ్యనేతలతో అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై ఆయన చర్చించారు. పార్టీకి అనుబంధంగా పలు కమిటీల నిర్మాణంతో పాటు 288 నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు, రాష్ట్రవ్యాప్తంగా తాలూకాలు జిల్లాల వారీగా బిఆర్‌ఎస్ శాఖలను ఏర్పాటు చేసి పార్టీని నిర్మాణాత్మకంగా మరాఠా ప్రజల్లోకి తీసుకుపోయే దిశగా కార్యాచరణపై మహారాష్ట్ర నుంచి వచ్చిన ముఖ్యనేతలతో అధినేత సిఎం కెసిఆర్ చర్చించారు.

మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులు

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ మాట్లాడుతూ గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో పరిపాలన రోజు రోజుకూ దిగజారి పోతుందన్నారు. మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులని, వాళ్ల జీవితాల్లో గుణాత్మాకాభివృద్ధిని తీసుకురావడానికి బిఆర్‌ఎస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ అక్కడి ప్రజల ఆదరాభిమానాలను రోజు రోజుకూ చూరగొంటుందన్నారు. అక్కడ పల్లెల్లో బిఆర్‌ఎస్ గురించి చర్చిస్తున్నారని, ఇన్నాళ్ల్లు ప్రభుత్వాలను నడిపిన అక్కడి పార్టీలు వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్న విషయాన్ని మరాఠా ప్రజలు గ్రహించారన్నారు. అదే సందర్భంలో తెలంగాణ ప్రగతి మోడల్ వారిని అమితంగా ఆకట్టుకుంటుందన్నారు. బిఆర్‌ఎస్ నిర్వహించిన ప్రతి సభను విజయవంతం చేస్తూ పార్టీ పిలుపులో భాగస్వాములవుతూ వారు కనబరుస్తున్న ఉత్సాహం గొప్పగా ఉందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమం తరహాలో మహారాష్ట్రలో ప్రజా స్పందన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ గాలి వీస్తుందని అధినేత సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

అన్ని రకాల ప్రచార సామగ్రిని సిద్ధం

మహారాష్ట్రలో మొదటి దశలో నాలుగు ముఖ్యపట్టణాలైన నాగపూర్, ఔరంగాబాద్, ఫుణే, ముంబైలలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని స్థానిక నాయకులు ప్రతిరోజు గ్రామ గ్రామానికి వెళ్లి గ్రామ శాఖలను ఏర్పాటు చేయడం వంటి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు సంబంధించి అన్ని రకాల ప్రచార సామగ్రిని సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కెసిఆర్ తెలిపారు. కాగా మహారాష్ట్రంలో ఏ పార్టీతోని కూడా పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

బిఆర్ అంబేద్కర్ మనకు స్ఫూర్తిదాత

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌కు విశేష ఆదరణ వస్తుందని, మహారాష్ట్ర నలుమూలల నుంచి ఎంతోమంది బిఆర్‌ఎస్ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారన్నారు. తెలంగాణ కంటే మహారాష్ట్ర వైశాల్యంలో, జనసంఖ్యలో ఆర్థిక వనరులు ఇలా అన్ని రంగాల్లో అనేక రెట్లు పెద్దదన్నారు. కానీ, మహారాష్ట్ర ఎందుకు అన్ని రంగాల్లో వెనుకబడిందో అక్కడి ప్రజలు ఆలోచించాలన్నారు. విశ్వమానవుడైన బిఆర్ అంబేద్కర్ మనకు స్ఫూర్తిదాత అని, 125 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. దీని వెనుక మహత్తర సత్యం దాగి ఉందన్నారు. అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని నెలకొల్పడమే బిఆర్‌ఎస్ లక్ష్యమని ఊరూరా చెప్పాలన్నారు.

సమతామూర్తి సిద్ధాంతాన్ని ఆచరించటమే మా లక్ష్యం

బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి షో చేయాలని తాము అనుకోలేదని, ఆ సమతామూర్తి సిద్ధాంతాన్ని ఆచరించటమే కర్తవ్యంగా లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నామన్నారు. అందుకోసం నిరంతరం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. అంబేద్కర్ కలలను సాకారం చేయటమే బిఆర్‌ఎస్ లక్ష్యమని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రపంచంలో ఏదేశానికి లేని మానవ వనరుల సంపద భారతదేశానికి ఉందన్నారు. ఈ సంపత్తిని వినిగించుకునే జ్ఞానం పాలకులకు లేకుండా పోయిందని అదే అసలైన దురదృష్టకరమని ఆయన తెలిపారు. కుటుంబ నియంత్రణ విధానాలు, అశాస్త్రీయ ఆలోచనలు అమలు చేయడం వల్ల చైనాలో ఇవ్వాళ 60 శాతం మంది వృద్ధులుగా మారిపోయారన్నారు. అలాగే జపాన్ జనాభా తగ్గిపోయిందని, ఆయా దేశాల్లో జనాభావృద్ధి కోసం లక్షలాది రూపాయల నజరానాను ప్రకటిస్తున్నారని కెసిఆర్ తెలిపారు. కానీ, భారత్ అలా కాదనీ, అద్భుతమైన మానవ సంపద ఉందని, దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే దేశం అమెరికా, యూరప్ దేశాలను మించిపోతుందన్నారు.

70 శాతం మంది అభివృద్ధికి దూరంగా….

దేశంలో 20 శాతం ఉన్న దళితులను, సమాజంలో 50 శాతం ఉన్న స్త్రీలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయనంత వరకు ఈ దేశం ముందుకు సాగదన్నారు. దురదృష్టవశాత్తు 70 శాతం మంది అభివృద్ధికి దూరంగా ఉన్నారని అందువల్లే దేశం ఈరోజు ఈ దుస్థితిలో ఉందన్నారు. దళితులు పేదరికంలో మగ్గుతున్నారని, 20 శాతం మంది దళితుల్లో వజ్రాల్లాంటివారున్నారని కెసిఆర్ తెలిపారు. వారిని ఉపయోగిస్తే దేశంలో అద్భుతాలు సృష్టించవచ్చని, వారిని ఉపయోగించడం లేదన్నారు. అలాగే స్త్రీలను వంటింకే పరిమితం చేశామని, ఇది సరైన విధానం కాదన్నారు. స్త్రీలకు అవకాశం కల్పిస్తే సమాజం తన గతిని మార్చుకుంటుందన్నారు. రష్యాలో 95 శాతం మంది పైలట్లు మహిళలే ఉన్నారని, ప్రపంచంలో 70శాతం దేశాలు మహిళలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నాయన్నారు. దురదృష్టవశాత్తు మనం మాత్రం స్త్రీలను వంటింటికే పరిమితం చేయడం దురదృష్టకరమన్నారు. దళితులు, స్త్రీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కానంతర వరకు దేశం ముందుకు సాగదని కెసిఆర్ తెలిపారు.

మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్‌లను కేంద్రం మరిచింది

తాను ఎంపిగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ భారత పార్లమెంట్‌లో ప్రసంగించారని, మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ లేకపోతే బరాక్ ఒబామా అనే వ్యక్తి అమెరికా దేశానికి అధ్యక్షుడు అయ్యేవాడిని కాదనీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారన్నారు. అదీ భారత్ తాకత్ అని, కానీ, మన పాలకులు వారిని విస్మరించారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పాలకుల నిర్లక్ష్యం, చిత్తశుద్ధిలేమి, అవగాహనా రాహిత్యం వల్ల ఉత్పాదక రంగాన్ని, అనుత్పాదక రంగంగా మార్చుకోవాల్సి వచ్చిందని, ఈ దురవస్థ నుంచి దేశాన్ని బాగుచేసుకోవాలన్నారు. 1987లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అన్నాహజారే ఆలోచనలు, ఆచరణ తెలుసుకునేందుకు రాలేగాంసిద్దికి వెళ్లానని కెసిఆర్ తెలిపారు. నీటి నిల్వ, నీటి వనరుల వినియోగం వంటి అనేక అంశాల గురించి తెలుసుకున్నానన్నారు. మహిళా చైతన్యం, అభివృద్ధిలో భాగస్వామ్యం చూసి ఎంతో నేర్చుకున్నానని ఆయన తెలిపారు. తెలియంది తెలుసుకోవటం తప్పుకాదనీ, అవకాశాలుండీ తెలుసుకోకపోవడమే అజ్ఞానమని కెసిఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ‘మొహందారి-వన్ధరి’లో అప్పుడే తాను వైకుంఠధామాలను చూశానన్నారు. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నానని తాను అదే మహారాష్ట్రకు చెప్పాల్సి వస్తుందన్నారు.

దేశానికి మోడల్‌గా అంకాపూర్

అంకాపూర్ (ఆర్మూర్ నియోజకర్గంలో) దేశానికి మోడల్‌గా నిలిచిందని కెసిఆర్ తెలిపారు. విడిసి (విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీలు) చెప్పిందే సర్పంచ్, ఎమ్మెల్యేలయినా వినాలని కెసిఆర్ పేర్కొన్నారు. రాజకీయాల కోసమే బిఆర్‌ఎస్ పుట్టలేదనీ, దేశ ప్రజల జీవన స్థితిగతులు మార్చడమే బిఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. నాయకులుగా ఎవరూ పుట్టరని, తయారు చేయబడతారని కెసిఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర రాతను మార్చేందుకు కొత్త రక్తం రాజకీయాల్లోకి వస్తుందని వారిని ఆహ్వానిద్దామని కెసిఆర్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కొత్తపార్టీ పుట్టినప్పుడు అందరూ వింతగానే చూస్తారని కెసిఆర్ తెలిపారు. కానీ, ఆ పార్టీ సిద్ధాంతం, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధిని చూశాక మెల్లమెల్లగా ప్రజలు ఆ పార్టీ పట్ల ఆసక్తిని పెంచుకుంటారన్నారు. అభిమానంతో ఆదరిస్తారని కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్రలోనూ ఇప్పుడు అదే జరుగుతుందని, లేదంటే మనం పెట్టిన సభలకు వేలు, లక్షలుగా ప్రజలు రారనీ కెసిఆర్ పేర్కొన్నారు.

మోడీ లక్ష కోట్ల అప్పు చేశారు….

మనలో మనకు నమ్మకం ఉండాలని, ఆ నమ్మకం నిజాయితీతో కూడినదై ఉండాలని, అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్ర దుస్థితిని మార్చేందుకు యువశక్తి, నవరక్తం రాజకీయాల్లో వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. తెలంగాణ మోడల్‌ను మహారాష్ట్రలో నూటికి నూరుపాళ్లు అమలు చేసి తీరుతామని, అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదన్నారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, దళితబంధు సహా తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు అమలు చేస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదనీ కెసిఆర్ ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశానికి దిక్సూచీగా నిలిచిందన్నారు. దేశంలో ఏ ప్రధానమంత్రి హయాంలో చేయని అప్పులు మోడీ హయాంలో అయ్యాయని కెసిఆర్ ఆరోపించారు. 13 మంది ప్రధానులు రూ. 56లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్కమోడీనే లక్ష కోట్ల అప్పు చేశారని కెసిఆర్ అన్నారు.

అన్ని రంగాల్లో దేశం దివాళా

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధర ఇలా అన్ని రంగాల్లో దేశం దివాళా తీసిందన్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 5 నుంచి జూన్ 5 వరకు పార్టీ విస్తరణకు కార్యచరణ చేపట్టాలన్నారు. గ్రామ గ్రామాన పార్టీ కమిటీలు వేయాలని, వీటితోపాటు రైతు, విద్యార్థి, యువజన, మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా 9 కమిటీలు వేయాలని కెసిఆర్ సూచించారు. ఈ కమిటీల ద్వారా తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కెసిఆర్ సూచించారు. రోజుకు కనీసం 5 గ్రామాల చొప్పున తిరగాలన్నారు. పార్టీ ప్రచార సామాగ్రి సిద్ధం అవుతుందని, మరాఠీ భాషలో పాటలు సిద్ధం అయ్యాయని కెసిఆర్ పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ మహారాష్ట్రలో ప్రభజంనం సృష్టించబోతుందని అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదని కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్రలో అతినీతి రహిత, నీతివంతమైన పాలన అందించటమే బిఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. ఈ దేశంలో ప్రజాప్రతినిధులకు నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధులతో ఆఫీసులు కట్టించిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీదన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్, ఎంపి బి బి పాటిల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి తదితరులతో మాహారాష్ట్ర బిఆర్‌ఎస్ ముఖ్యనేతలు మాణికం కదం, శంకరన్నడోంగే, సుధీర్ సుధాకార్ రావు బిందు, మాజీ ఎంపీ హరిబావు రాథోడ్, మాజీ ఎమ్మల్యేలు చరణ్ వాగ్మారే, దీపక్ ఆత్రం, రాజు తొడసం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News