Monday, December 23, 2024

అపూర్వ కదలిక

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: జాతీయ రాజకీయాలు ఆసక్తికరమైన, ప్రయోజకరమైన మలుపు వద్ద ముస్తాబవుతున్నాయి. దేశాధికారాన్ని చేజిక్కించుకోడమనే లక్షానికి మించిన గొప్ప ఆశయంతో కదులుతున్నాయి. అందుకు తగిన రంగ స్థలాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని మట్టికరిపించి గద్దె దించడం ద్వారా మతోన్మత్త, కార్పొరేట్ అనుకూల, ఆత్మహత్యా సదృశ భ్రష్ఠ విధానాల నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఉమ్మడి గమ్యం వైపు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యే చరిత్రాత్మక పరిణామం జాడలు గట్టిగా కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావమూ జరుగుతున్నది. జన జీవనంలో, దేశాభివృద్ధిలో అనూహ్యమైన ప్రగతి శిఖరాలను ఆవిష్కరించే ఆలోచన బలం గా సాగుతున్నది. విభజన, విచ్ఛిన్న ధోరణులు మితిమించి ముదిరిపోయిన బిజెపి సంకెళ్ల నుంచి యువతను విముక్తం చేసే పరమాశయం వైపు దేశాన్ని నడిపించే చోదకశక్తుల సంఘటన జరిగితే అంతకంటే సంతోషించవలసిన అంశం మరొకటి వుండదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ కొద్ది రోజుల్లోనే జాతీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ విషయం ఆదివారం నాడు ఆయనే స్వయంగా ప్రకటించారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నేత కుమార స్వామి హైదరాబాద్ వచ్చి ఆయనను కలుసుకొని సంఘీభావం ప్రకటించిన సందర్భంలో కెసిఆర్ ఈ శుభవార్తను తెలియజేశారు. జాతీయ అజెండాతో ప్రత్యామ్నాయ రాజకీయాల దిశగా కృషి చేయాలని మేధావులు, ఆర్థికవేత్తలు, వివిధ జీవన రంగాలకు చెందిన నిపుణులు తనను కోరారని ఆయన ఈ సందర్భంలో వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే కొత్త జాతీయ పార్టీని స్ధాపించదలచానని చెప్పారు. జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ రాజకీయాలలో ఏర్పడిన లోటును పూరించడానికి కెసిఆర్ వంటి నాయకుల అవసరముందని కుమార స్వామి చేసిన ప్రకటన గమనించదగినది. జాతీయ ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయిన దృశ్యం కళ్లముందున్నదే. కాంగ్రెస్ ముక్త భారత్‌ను అవతరింపజేస్తానని ప్రకటించిన ప్రధాని మోడీ దేశంలో ప్రతిపక్షమన్నదే వుండకూడదని, ప్రశ్నను, ప్రత్యామ్నాయ ఆలోచనను తలెత్తనీయకుండా అణచివేయాలని చేస్తున్న దుర్మార్గం అందరికీ తెలిసిందే. ఇందుకోసం కేంద్రంలో తనకున్న విశేషాధికారాలను, ఇడి, సిబిఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి సంస్థలను దుర్వినియోగపరుస్తున్న దారుణాన్ని చూస్తూనే వున్నాము. ఈ విషయాన్ని అందరి కంటే బలంగా, హేతుబద్ధంగా అనేక కోణాల్లో కెసిఆర్ దేశ ప్రజల దృష్టికి తెస్తున్నారు. బిజెపి విభజన రాజకీయాలపైన, మతోన్మాదంపైన, దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న దాని దుర్విధానాలపైన, రైతులను బికారులను చేసే విలయ విద్యుత్తు బిల్లుపైన, ఇంకా అనేక అంశాలపైన దేశప్రజలకు సుబోధకంగా వివరిస్తున్నారు.

ఈ సమయంలో ప్రతిపక్ష ప్రముఖులు కొందరు చేస్తున్న ప్రకటనలు, సూచనలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపి వ్యతిరేక ఏకం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వహిస్తున్న పాత్రను గురించి కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. బిజెపిని గద్దె దించడానికి కలిసి వచ్చే శక్తులతో వ్యూహ రచన చేయాలని తన పార్టీ కార్యకర్తలకు ఎన్‌సిపి అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ సూచించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) నేత తేజస్వి యాదవ్ తాజాగా చేసిన ఒక సూచన గమనించదగినది. 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించడానికి ప్రాంతీయ పార్టీల అవసరాన్ని, అనివార్యతను గుర్తించి కాంగ్రెస్ నడుచుకోవాలని తేజస్వీ యాదవ్ ఆదివారం నాడు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో సూచించారు. ప్రతిపక్షాలన్నింటి కంటే కాంగ్రెస్‌కు పార్లమెంటులో ఎక్కువ స్థానాలున్నందున అది బిజెపితో ముఖాముఖీగా ఉన్న లోక్‌సభ సీట్లలో పోటీ చేసి ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట అవి పోటీ చేసేందుకు అంగీకరించి వాటికి తోడ్పడాలని ఆయన అన్నారు.

బీహార్‌లో ఇందుకు తగిన వాతావరణం వుంది. కాంగ్రెస్‌ను కలుపుకొని చేసిన మహాఘట్ బంధన్ ప్రయోగం అక్కడ విజయవంతమైంది. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రాంతీయ పక్షాలన్నీ ఒక కూటమిగా పోటీ చేయాలా, దానిని కూడా కలుపుకొని బరిలో దిగాలా అనే ప్రశ్నకు తేజస్వి యాదవ్ ఫార్ములాలో తగిన జవాబున్నది. అయితే అది అనుకున్నంత సులభసాధ్యం కాదు. బీహార్‌లో మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రతిపక్షంగా వున్న రాష్ట్రాలలో పాలక ప్రాంతీయ పక్షాలు దానితో అవగాహనకు రావడం సులభ సాధ్యం కాదు. అయితే బిజెపిని ఓడించి సప్త సముద్రాల్లో కలిపేయడానికి, దేశాన్ని మతపరమైన విభజన రాజకీయాల నుంచి బడా పెట్టుబడిదార్ల సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి కాషాయేతర రాజకీయ శక్తులన్నీ ఒక్క త్రాటి మీదికి రావలసి వుంది. 2024 మరో 2019 కాకూడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News